బాబు.. 'పంచసూత్రాలు': ఇప్పుడు ఆయనను అలా అనగలరా?
ఏపీ సీఎం చంద్రబాబు.. సాధారణంగా అభివృద్ధి, ఐటీ, టెక్నాలజీ అంటూ..ప్రసంగాలు దంచికొడతారు. ఎక్కడ ఏ వేదికెక్కినా.. పెట్టుబడులు, ఉద్యోగాలు, పరిశ్రమల రాగం ఆలపిస్తున్నారు.;
ఏపీ సీఎం చంద్రబాబు.. సాధారణంగా అభివృద్ధి, ఐటీ, టెక్నాలజీ అంటూ..ప్రసంగాలు దంచికొడతారు. ఎక్కడ ఏ వేదికెక్కినా.. పెట్టుబడులు, ఉద్యోగాలు, పరిశ్రమల రాగం ఆలపిస్తున్నారు. గతంలోనూ ఇప్పుడు కూడా ఆయన దాదాపు అదే పంథాను అనుసరించారు. దీంతో చంద్రబాబుకు వ్యవసాయం అంటే గిట్టదన్న విమర్శలు ఎదురయ్యాయి. కానీ, ఇది నిజమేనా? ఈ వాదనలో పస ఉందా? అంటే.. లేదని ఆయనే స్వయంగా చెప్పారు. తాజాగా కడప జిల్లా కమలాపురంలో నిర్వహించిన `అన్నదాత సుఖీభవ` నిధుల విడుదలసందర్భంగా రైతన్నలను ఉద్దేశించి చంద్రబాబు `పంచసూత్రాలు` చెప్పారు. వీటిని పాటిస్తే.. సాగుకు తిరుగు ఉండదన్నారు. అంతేకాదు.. రైతులు మీసం మెలేసే పరిస్థితి వస్తుందనికూడా చెప్పారు.
ఆ పంచసూత్రాలు ఇవీ..
1) నీటి భద్రత: సాగుకునీటి అవసరం ఎంతనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే.. నీటిని వినియోగించుకుంటూనే నీటి భద్రతకు కూడా రైతులు ప్రాధాన్యం ఇవ్వాలనిచంద్రబాబు చెప్పారు. దీనిలో భాగంగా తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి ఇచ్చే పంటలను సాగు చేయాలని చెప్పారు. అదేసమయంలో ప్రాజెక్టుల్లో నీటిని సంరక్షించే విధానాలను కూడా అలవరచుకోవాలన్నారు.
2) డిమాండ్ ఆధారిత పంటలు: అన్నదాతలు.. తమకు నచ్చిన పంటలు కాకుండా.. సమాజం మెచ్చే పంటలు వేయాలన్నది చంద్రబాబు రెండో సూచన. అంటే.. ప్రజల నాడిని పట్టుకునే ప్రయత్నం చేయాలని సూచించారు ప్రజలు ఎక్కువగా వినియోగిస్తున్న ఆహారాన్ని గుర్తించి(ఇది ప్రభుత్వం చెబుతుంది) ఆ దిశగా సాగును మళ్లించాలి. తద్వారా డిమాండ్ పెరిగి.. సాగు భారం తగ్గుతుంది.
3) అగ్రిటెక్: అంటే.. సాగులో సాంకేతికతను అందిపుచ్చుకోవడం. సాంకేతిక సాయంతో సాగులో మెళకువలను అమలు చేయడం. ఉదాహరణకు పంటలకు పురుగు మందులు పిచికారీ చేసే సమయంలో ఏ మొక్కకు తెగుళ్లు ఉంటే.. దానికే పిచికారీ చేసే డ్రోన్ కెమెరా వ్యవస్థకు అలవాటు పడడం. తద్వారా ఎరువుల వినియోగం తగ్గుతుంది. అదేవిధంగా భూమి పరీక్షలు, పర్యావరణ మార్పుల ఫలితాలను అంచనా వేసే వ్యవస్థలను రైతులు అందుకోవాలి.
4) వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు: రైతులే స్వయంగా చిన్న సూక్ష్మపరిశ్రమలను ఏర్పాటు చేయడం ద్వారా.. పండ్ల ప్రాసెసింగ్ చేసి.. తద్వారా అదనపు ఆదాయంగడిచడంతోపాటు.. ఎవరో వచ్చి కొనేవరకు వేచి చూడకుండా ఉండే పరిస్థితి వస్తుంది. అలాగే.. పరిశ్రమలకు అవసరమైన రీతిలో పండ్లను ఉత్పత్తి చేసే దిశగా రైతులు ఎదగాలి.
5) ప్రపంచ మార్కెటింగ్: ప్రస్తుతం రైతులు.. తమ పంటలను జిల్లాల్లోనో.. రాష్ట్రంలోనో విక్రయిస్తున్నారు. అలా కాకుండా.. ప్రపంచ స్థాయి మార్కెట్‌ను అందుకునే స్థాయికి రైతులు ఎదగాలి. పంటల దిగుబడిలో నాణ్యత ఉంటే.. ఆటోమేటిక్‌గానే ప్రపంచ మార్కెట్ అందివస్తుంది. సో.. ఇతమిత్థంగా చంద్రబాబు చెప్పిన పంచ సూత్రాలు ఇవీ. మరి రైతులు అందిపుచ్చుకుంటారో లేదో చూడాలి. ఇవన్నీ విన్నాక.. చంద్రబాబుకు వ్యవసాయం అంటే గిట్టదని ఎవరైనా అనగలరా? !.