నాలుగేళ్లకు ముందే ఎన్నికల ముచ్చట.. రీజనేంటి ..!
రాష్ట్రంలో ఎన్నికలు జరిగేందుకు నాలుగేళ్ల సమయం ఉంది. ప్రస్తుత కూటమి సర్కారు పాలనను ఇప్పు డే పట్టాలెక్కించింది.;
రాష్ట్రంలో ఎన్నికలు జరిగేందుకు నాలుగేళ్ల సమయం ఉంది. ప్రస్తుత కూటమి సర్కారు పాలనను ఇప్పు డే పట్టాలెక్కించింది. కానీ, ఇంతలోనే ఎన్నికల ముచ్చట తెరమీదికి వచ్చింది. ఇదేదో వైసీపీ నాయకులు, లేదా ఆ పార్టీ అధినేత జగన్ చెప్పిన మాట కాదు. సాక్షాత్తూ.. కూటమిని నడిపిస్తున్న చంద్రబాబు తాజాగా కార్యకర్తలు, నాయకులతో ఎన్నికలకు సంబంధించిన ముచ్చటనే తెరమీదికి తెచ్చారు. ఎన్నికల్లో సీట్లు దక్కాలంటే.. ఇలా ఉండండి! అంటూ.. క్లాసిచ్చారు.
దీంతో అందరూ ఆశ్చర్య పోయారు. సహజంగా ఏ నాయకుడైనా.. పార్టీ అయినా.. ఎన్నికలకు ముందు పార్టీ నాయకులను అలెర్టు చేస్తుంది. ప్రతిపక్షంలో ఉంటే ఒకటి రెండేళ్ల ముందు నుంచే నాయకులను లైన్‌లో పెడతారు. కానీ, తాజాగా చంద్రబాబు అధికారంలో ఉండి కూడా.. నాలుగేళ్ల ముందుగానే నాయకులను లైన్‌లో పెట్టడం గమనార్హం. నాయకులను ఒకవైపు హెచ్చరిస్తూనే.. మరోవైపు బుజ్జగించే ప్రయత్నాలు కూడా జరిగాయి. మరి దీని అంతరార్థం ఏంటి? ఎందుకిలా చేశారు? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
ప్రస్తుతం ఎమ్మెల్యేల పనితీరుపై రెండు సా ర్లు సర్వే చేయించుకున్న చంద్రబాబుకు.. నెగిటివ్ థింకింగ్ తో ఉన్న నాయకుల వివరాలు బాగానే అందాయి. వారిని ఇప్పటికే ఒకటికి రెండు సార్లు హెచ్చరించారు. అయినా.. కూడా వారిలో మార్పు పెద్దగా రావడం లేదు. మరీ ముఖ్యంగా.. సొంత పార్టీలోనే గ్రూపు రాజకీ యాలు పెరిగాయన్నది బహిరంగ రహస్యం. దీంతో వారిని హెచ్చరించినా పలితం రావడం లేదని గ్రహించిన చంద్రబాబు.. ఇలా ఎన్నికల బూచిని చూపించారా? అనేదిచర్చ.
``మీరు సరిగా ఉంటే మంచిది. లేకపోతే.. నాయకులను తయారు చేసుకునేందుకు పార్టీ ఎప్పుడూ సిద్ధం గా ఉంటుంది`` అని చంద్రబాబు ఎవరి పేరునూ ప్రస్తావించకుండానే వ్యాఖ్యానించారు. దీనిని బట్టి.. ఆయన పక్కాగా నాయకులకు తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఇతర విషయాలు ఎలా ఉన్నా.. క్షేత్రస్థాయిలో పర్యటనలకు మాత్రం నాయకులు ముందుకు రావడం లేదు. పైగా.. ఎవరూ కలివిడిగా కూడా ఉండడం లేదు. దీంతోనే చంద్రబాబు ఎన్నికల ముచ్చట తెచ్చారన్న వాదనావినిపిస్తోంది. ఏదేమైనా గాడిలో పెట్టేందుకు చేసిన ప్రయత్నం ఫలిస్తుందా? లేదా? అనేది చూడాలి.