పార్లమెంటులో అమరావతిపై బిల్లు.. కేంద్రం నుంచి సమాచారం
ఏపీ రాజధాని అమరావతిగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టనుంది.;
ఏపీ రాజధాని అమరావతిగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టనుంది. ఏప్రిల్ 1వ తేదీన కేంద్ర కేబినెట్ లో దీనిపై తీర్మానం చేసి ఆ మరునాడే పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. కేంద్రం సూచనలతో శనివారం (రేపు) అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ప్రత్యేక భేటీలో అమరావతిపై తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించనుంది. అమరావతిపై తీర్మానం ఎలా ఉండాలనేది చర్చించేందుకు గురువారం కేబినెట్ లో చర్చించారు.
అమరావతిని ఏపీకి శాశ్వత రాజధానిగా ప్రకటించాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు కలలు నెరవేరుతున్నాయి. రాజధానిగా అమరావతిని 11 ఏళ్ల క్రితమే ప్రకటించారు. అయినప్పటికీ ఇంతవరకు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయకపోవడంతో రాజధానిపై సందిగ్ధానికి అనవసర చర్చలకు అవకాశం కల్పించినట్లు అవుతోందని అంటున్నారు. ఇక గత ప్రభుత్వంలో మూడు రాజధానుల ప్రతిపాదన చేయడం కూడా అమరావతి భవిష్యత్తుగా ప్రమాదకరంగా పరిణమించింది. ఈ పరిస్థితుల్లో భవిష్యత్తులో అమరావతిపై ఇలాంటి ఊగిసలాటలకు అవకాశం ఇవ్వకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని అంటున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దిశగా అడుగులు వేసింది. రాజధానిగా అమరావతిని నోటిఫై చేయాలని కేంద్రాన్ని సూచించింది. అయితే ఇందుకు చట్టబద్ధంగా చర్యలు తీసుకోవడం వల్ల ఇంతవరకు జాప్యం జరిగిందని అంటున్నారు. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైందని, రాజధానిని నోటిఫై చేసేందుకు కేంద్ర కేబినెట్ తీర్మానం చేయాలని నిర్ణయించిందని అంటున్నారు. అయితే ఈ తీర్మానం పకడ్బందీగా ఉండేలా కేంద్రం కొన్ని సూచనలు చేసినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.
భవిష్యత్తులో రాజధానిని మర్చాలని ఎవరూ అనుకోకుండా, అమరావతికి చట్టబద్ధత కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 2014లో గుంటూరు-విజయవాడ మధ్యలో రాజధాని అమరావతి అని పేర్కొన్నామని, ఈ సారి రాజధాని సీఆర్డీయే పరిధిలోని అమరావతి అని స్పష్టంగా తీర్మానం చేస్తూ కేంద్రానికి పంపుతున్నామని సీఎం వివరించారు. ఈ అంశంపై 2025 మే 8న క్యాబినెట్ ఆమోదించిన తీర్మానాన్ని కేంద్ర హోంశాఖకు అదే నెల 12న పంపించినట్లు సీఎం వెల్లడించారు.
అయితే ఈ తీర్మానాన్ని అసెంబ్లీలో కూడా ఆమోదించి పంపాలని కేంద్రం తాజాగా సూచించడంతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్లు సీఎం తెలిపారు. శనివారం జరిగే సమావేశంలో అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని, కేంద్రం ఏప్రిల్ 1న కేబినెట్లో చర్చించి ఆమోదిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ఏప్రిల్ 2న ఈ బిల్లు పార్లమెంటు ముందుకు వచ్చే అవకాశం ఉందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.