ఏపీకి ట్రంప్ షాక్.. ప్రతీకార సుంకాలతో భారీ నష్టం!
అమెరికా సుంకాలు విధించిన సమయంలో ఎగుమతి చేసేందుకు కంటెనర్లలో ఉన్న సరుకుపై దాదాపు రూ.600 కోట్ల మేర భారం పడినట్లు వివరిస్తున్నారు.;
రష్యా చమురు కొనుగోలు చేస్తున్నామని రగిలిపోతూ దేశంపై సుంకాలు బాధేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వల్ల ఏపీకి భారీ నష్టం వాటిల్లుతోంది. అమెరికా ఎగుమతులే ఆధారంగా వ్యాపారం సాగిస్తున్న ఏపీ అక్వా రంగం ట్రంప్ దెబ్బతో కుదేలయ్యే పరిస్థితి కనిపిస్తోందని ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికాకు ప్రత్యామ్నాయ మార్కెట్ కోసం ప్రభుత్వం అన్వేషిస్తున్నా.. తక్షణం ఎగుమతి కావాల్సిన రొయ్యిలు నిలిచిపోవడంతో దాదాపు రూ.25 వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు చెబుతున్నారు.
అమెరికా సుంకాల మోత మొదలైన తర్వాత ఏపీ నుంచి ఒక్క కిలో రొయ్యిలు కూడా ఎగుమతి కాలేదని చెబుతున్నారు. దీంతో ట్రంప్ సుంకాలతో అక్వా రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. రష్యా చమురు కొనుగోలు చేస్తున్నామని మన దేశంపై అమెరికా భారీగా సుంకాలు విధించిన విషయం తెలిసిందే. తొలుత 25 శాతం ఆ వెంటనే 50 శాతం సుంకాలు విధించడంతో రొయ్యిలు ఎగుమతులు నిలిచిపోయాయని అంటున్నారు. దాదాపు 50 శాతం రొయ్యిల ఆర్డర్లు రద్దు చేయడంతో దాదాపు రూ.25 వేల కోట్ల మేర నష్టం వచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
అమెరికా సుంకాలు విధించిన సమయంలో ఎగుమతి చేసేందుకు కంటెనర్లలో ఉన్న సరుకుపై దాదాపు రూ.600 కోట్ల మేర భారం పడినట్లు వివరిస్తున్నారు. గోదావరి జిల్లాలతోపాటు నెల్లూరులో ఎక్కువగా అక్వా సాగు చేస్తుంటారు. ఏపీ నుంచి అమెరికాకు పెద్ద మొత్తంలో రొయ్యిలు ఎగుమతి అవుతుంటాయి. అమెరికా అధ్యక్షుడు తొలుత 25 శాతం, ఆ తర్వాత మరో 25 శాతం పెంచిన సుంకాల్లో అక్వాను చేర్చడంతో రైతులు షాక్ తిన్నారు. దీనిపై భారత ప్రభుత్వం చర్చలు జరుపుతున్నా అమెరికా ఇంకా దిగిరాలేదు. 50 శాతం సుంకాలకు అదనంగా 5.76 శాతం కౌంటింగు వెయిలింగ్ సుంకం, 3.96 శాతం యాంటీ-డంపింగ్ సుంకం కలుపుకుంటే మొత్తం 59.72 శాతానికి చేరుకున్నాయి.
దీంతో ఆక్వా రైతులను ఆదుకునేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ఆక్వా రైతులకు జీఎస్టీపై ఊరట కల్పించడంతోపాటు ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వానికి నివేదించారు. రైతాంగాన్ని నష్టాల బారి నుంచి కాపాడాలంటే జాతీయ స్థాయిలో నిర్ణయాలు ఉండాలని సీఎం భావిస్తున్నారు. అదే సమయంలో దేశీయంగా ఆక్వా ఉత్పత్తుల దేశీయ వినియోగాన్ని పెంచడానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దేశంలోని రొయ్యిల ఎగుమతుల్లో 80 శాతం, సముద్ర ఎగుమతుల్లో 34 శాతం ఏపీ నుంచి జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఈ ఎగుమతుల విలువ ఏటా రూ.21,246 కోట్లుగా ఉంటోంది. దాదాపు 2.5 లక్షల ఆక్వా రైతు కుటుంబాలు, అనుబంధ రంగాలపై ఆధారపడిన 30 లక్షల మంది ప్రజలు సుంకాల దెబ్బతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కడానికి అమెరికాకు ప్రత్యామ్నాయ మార్కెట్లపై ద్రుష్టి పెట్టాలని చంద్రబాబు కోరుతున్నారు. ఎగుమతులను పెంచడానికి యూరోపియన్ యూనియన్, దక్షిణ కొరియా, సౌదీ అరేబియా, రష్యాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవాలని ప్రధానిని చంద్రబాబు కోరుతున్నారు.