చంద్రబాబు అధికారిక కార్యక్రమాల్లో తొలిసారి భువనేశ్వరి.. ప్రధాని మోదీతో ప్రత్యేక భేటీ!

కానీ, ఇప్పుడు అమరావతి నిర్మాణ పనులను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం చంద్రబాబు.. అధికారికంగా ప్రధాని మోదీని ఎప్పుడో ఆహ్వానించారు.;

Update: 2025-04-24 14:30 GMT

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం (ఏప్రిల్ 25) ఢిల్లీ వెళ్లనున్నారు. ఇందులో కొత్తేమి ఉందని అనుకుంటున్నారు. అవును ఈ సారి చంద్రబాబు ఢిల్లీ టూర్ కాస్త స్పెషల్ అని చెప్పాలి. అధికారిక కార్యక్రమాల్లో తరచూ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు పర్యటించడం సాధారణమే.. అయితే ఈ సారి కాస్త స్పెషల్ గా ఆయన టూర్ ప్లాన్ చేశారు. రాజధాని అమరావతి నిర్మాణ పనుల ప్రారంభానికి వచ్చేనెల 2వ తేదీన ప్రధాని మోదీని ఆహ్వానించేందుకు సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళుతున్నారు. అయితే ప్రధాని మోదీని ఆహ్వానించేందుకు చంద్రబాబు తన వెంట భార్య భువనేశ్వరిని కూడా తీసుకువెళ్లడం ఆసక్తికరంగా మారింది.

ముఖ్యమంత్రిగా చంద్రబాబు వ్యవహరించడం ఇది నాలుగో సారి. 1995లో సీఎం అయిన చంద్రబాబు సుదీర్ఘకాలం ఉమ్మడి రాష్ట్రానికి, విభజిత ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంతేకాకుండా యునైటెడ్ ఫ్రంట్, ఎన్డీఏ కన్వీనరుగా గతంలో పనిచేసి కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పారు. అయితే రాజకీయ, అధికార కార్యక్రమాలకు తన కుటుంబాన్ని దూరంగా ఉంచేవారు చంద్రబాబు. కుమారుడు లోకేశ్ రాజకీయాల్లోకి వచ్చాక కూడా ఆయన వేరు, చంద్రబాబు వేరు అన్నట్లే రాజకీయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇక సీఎం హోదాలో చంద్రబాబు తన భార్య భువనేశ్వరిని ఎక్కడికైనా తీసుకువెళ్లాల్సివచ్చినా, అది ఏ సంప్రదాయ వేడుకో అయి ఉండాల్సిందే. అంతకుమించి అధికారిక కార్యక్రమాలకు ఎప్పుడూ భువనేశ్వరిని తీసుకువెళ్లలేదు సీఎం చంద్రబాబు.

కానీ, ఇప్పుడు అమరావతి నిర్మాణ పనులను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం చంద్రబాబు.. అధికారికంగా ప్రధాని మోదీని ఎప్పుడో ఆహ్వానించారు. ఈ మేరకు ప్రధాని టూర్ ఏర్పాట్లు కూడా ఓకే అయ్యాయి. అయితే, పీఎం మోదీని వ్యక్తిగత హోదాలో మరోసారి ఆహ్వానించాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. అమరావతి తనకు ఎంత ముఖ్యమన్న విషయాన్ని ప్రధానికి తెలియజేయడానికి కుటుంబంతో సహా వెళ్లి ఆహ్వానించాలని డిసైడ్ అయ్యారని అంటున్నారు. దీంతో తొలిసారిగా సీఎం చంద్రబాబు వెంట భువనేశ్వరి ఢిల్లీ వెళ్లి.. ప్రధాని మోదీని ఆహ్వానించనున్నారని చెబుతున్నారు.

మే 2న అమరావతికి రానున్న ప్రధాని పర్యటనకు ఏపీ ప్రభుత్వం చకచక ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాని చేతుల మీదుగా లక్ష కోట్ల రూపాయల విలువైన పనులకు శంకుస్థాపన చేయించడంతోపాటు 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని సన్నాహాలు చేస్తోంది. ప్రధాని సభకు వచ్చే జనాలు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. వాహనాల పార్కింగు, రాకపోకలకు అనువైన రోడ్లను రెడీ చేస్తున్నారు. ఈ పనులను మున్సిపల్ మంత్రి నారాయణ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

Tags:    

Similar News