ఢిల్లీలో బాబు మూడు రోజుల మకాం...చాలా మ్యాటరుందిట !

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిలీ పర్యటన పెట్టుకున్నారు. ఆయన ఈసారి టూర్ ప్రత్యేకంగా నిలుస్తోంది.;

Update: 2025-07-08 03:45 GMT

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిలీ పర్యటన పెట్టుకున్నారు. ఆయన ఈసారి టూర్ ప్రత్యేకంగా నిలుస్తోంది. ఎందుకంటే ఈ తడవ ఆయన ఏకంగా మూడు రోజుల పాటు హస్తినలో మకాం వేయబోతున్నారు. ఇక బాబు ఢిల్లీ షెడ్యూల్ వివరాలలోకి వెళ్తే ఈ నెల 14న ఢిల్లీకి సీఎం చంద్రబాబు బయలుదేరి వెళ్తారు అలా మొదలవుతున్న ఆయన పర్యటన ఈ నెల 16 వరకు ఢిల్లీలో కొనసాగనుంది. ఇక ఈ పర్యటనలో చంద్రబాబు ప్రధాని మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అవుతారని తెలుస్తోంది.

బాబు ఢిల్లీ పర్యటన వివరాలు చూస్తే చాలా మ్యాటర్ ఉందని అంటున్నారు. ఒక వైపు ఈ నెల 21 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలు అవుతున్నాయి. ఈసారి సమావేశాలలో జమిలి ఎన్నికల బిల్లుని ప్రవేశపెడతారు అని అంటున్నారు. జమిలి ఎన్నికలు అంటే చాలా సీరియస్ వ్యవహారమే.

ఏపీలో చూస్తే 2029 ఎన్నికలు అనుకుని షెడ్యూల్ అలా ప్లాన్ చేసుకుని అమరావతి పోలవరం వంటి వాటితో పాటు ఇతర కార్యక్రమాలు ఒక యాక్షన్ ప్లాన్ గా సిద్ధం చేసుకున్నారు. అయితే ఒక ఏడాది ఏణ్ణర్ధమో ఎన్నికలు తోసుకుని ముందుకు వస్తే చేయాల్సింది చాలా ఉంటుంది. అన్నీ యుద్ధ ప్రాతిపదికన చేయాలి. దాంతో నిధులు చాలా అవసరం అవుతాయి.

మరో వైపు చూస్తే ఏపీకి నిధుల అవసరం ఉంది. అలాగే ఇంకా రాజకీయంగా అనేక అంశాలు ఉన్నాయి. దాంతో బాబు ఢిల్లీలో ప్రధాని మోడీని కలసి కీలక అంశాలనే చర్చిస్తారు అని అంటునారు. జూన్ 21న విశాఖ వచ్చిన మోడీ అంతర్జాతీయ యోగా డేలో పాల్గొన్నారు. ఆ తరువాత బాబు ఢిల్లీ వెళ్ళి మోడీని కలవడం ఇదే ప్రథమం. దాంతో ఉభయులూ అనేక అంశాలు చర్చిస్తారు అని అంటున్నారు.

ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా బాబు అపాయింట్మెంట్ ఉంది. దాంతో ఆయనతో కూడా చాలా ముఖ్యమైన విషయాలనే చర్చిస్తారు అని అంటున్నారు. అలాగే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తోనూ బాబు భేటీ అవుతారు అని అంటున్నారు. ఇక జలశక్తి శాఖ మంత్రితో భేటీ అయి పోలవరం బనకచర్ల ప్రాజెక్ట్ మీద చర్చిస్తారు అని అంటున్నారు. ఇలా ఏపీకి సంబంధించి అనేక అంశాలను ఆయా కేంద్ర మంత్రుల వద్ద ప్రస్తావించి ఏపీకి రావాల్సినవి కావాల్సినవి రాబట్టే ప్రయత్నం చేస్తారు అని అంటున్నారు.

మరో వైపు బాబు మూడు రోజుల పాటు హస్తినలో ఉంటున్నారు అంటే రాజకీయంగా కూడా ఈసారి పర్యటన ప్రాధాన్యత కలిగినదే అని అంటున్నారు. మొత్తానికి బాబు మార్క్ వ్యూహాలు అమలులోకి వచ్చేక కానీ ఎవరికీ తెలియవు. సో బాబు ఢిల్లీ టూర్ మ్యాటర్ అయితే చాలా ఉందనే అంటున్నారు.

Tags:    

Similar News