చండీగఢ్.. ప్లాన్డ్ సిటీ.. అన్ ప్లాన్డ్ క్యాపిటల్.. అందుకే రగడ
భారతదేశంలో అత్యంత ప్రణాళికతో నిర్మించిన నగరం ఏదంటే..? మనం చెప్పుకోవాల్సినది చండీగఢ్.;
భారతదేశంలో అత్యంత ప్రణాళికతో నిర్మించిన నగరం ఏదంటే..? మనం చెప్పుకోవాల్సినది చండీగఢ్. మరి ఇదే సమయంలో భారత దేశంలో అన్ ప్లాన్డ్ క్యాపిటల్ ఏదంటే కూడా చండీగఢే అనాలి. మన దేశంలో ప్రస్తుతం రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉన్న ఏకైక నగరం ఇదే. (నిరుటి దాక తెలంగాణ, ఏపీలకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని). కాగా, చండీగఢ్ ఎవరిది? అటు పంజాబ్ దా? ఇటు హరియాణాదా? అనే పంచాయితీ ఇంతవరకు తేలలేదు. కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న ఈ నగరం తమదంటే తమదని రెండు రాష్ట్రాలు గట్టిగా వాదిస్తున్నాయి. దీని పక్కనున్న పంచకుల హరియాణాలోది కాగా, మోహాలీ పంజాబ్ లో ఉంది. ఇక చండీగఢ్... దేశ రాజధాని ఢిల్లీకి 260 కిలోమీటర్ల దూరంలో ఉంది. పంజాబ్-హరియాణ ఉమ్మడి రాజధాని అయిన ఈ నగరంలో చట్టాలు చేసే అధికారాన్ని కేంద్రం నుంచి రాష్ట్రపతి పరిధిలోకి తీసుకొచ్చేలా రాజ్యాంగ అధికరణ 131 సవరణ బిల్లు మంటలు పుట్టిస్తోంది. ఈ బిల్లును పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టాలని భావించారు. ఇది ఆమోదం పొందితే గనుక చండీగఢ్ ఆర్టికల్ 240 పరిధిలోకి వస్తుంది. ఇందులోనూ పెద్ద దుమారం రేగుతోంది.
హరియాణా మౌనం.. పంజాబ్ భగ్గు..
హరియాణలో బీజేపీనే అధికారంలో ఉంది. దీంతో చండీగఢ్ కు సంబంధించిన అంశంపై ఆ రాష్ట్రంలోని పార్టీలు మాట్లాడడం లేదు. కానీ, పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో రెండో పెద్ద పార్టీ. ప్రాంతీ పార్టీ అకాళీదళ్ కు సొంత బలం ఉంది. కానీ, బీజేపీకి ఉనికి లేదు. అందుకనే రాజ్యాంగ అధికరణ 131 సవరణ బిల్లులపై పంజాబ్ సీఎం మాన్, ఆప్ అధినేత కేజ్రీవాల్, అకాళీ దళ్ నిప్పులు చెరుగుతున్నాయి. చండీగఢ్ ను తమ నుంచి లాక్కునే ప్రయత్నం చేస్తున్నారంటూ దుమ్మెత్తి పోస్తున్నాయి. ఎప్పటికీ చండీగఢ్ తమదే అని అంటున్నాయి.
ఏమిటీ ఆర్టికల్ 240?
భారత దేశంలో 29 రాష్ట్రాలు, చండీగఢ్ సహా ఏడు కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. వీటిలో అండమాన్-నికోబార్, దాద్రా-నగర్ హవేలీ, డయ్యూ-డామన్ దీవులు చట్ట సభలు లేని కేంద్రపాలిత ప్రాంతాలు. వీటికి సంబంధించి చట్టాలు చేసే అధికారాన్ని రాష్ట్రపతికి కల్పించింది రాజ్యాంగంలోని ఆర్టికల్ 240. చట్ట సభలున్న కేంద్రం పాలిత ప్రాంతం అయినప్పటికీ వీటిలోకి చండీగఢ్ నూ తేవాలని కేంద్రం ఆలోచన చేసింది. రాజ్యాంగం ఆర్టికల్ 131ను సవరిస్తూ బిల్లు తేవాలని భావించింది. ఈ బిల్లు ఆమోదం పొందితే చండీగఢ్ పాలనా బాధ్యతలు పంజాబ్ గవర్నర్ నుంచి రాష్ట్రపతికి వెళ్తాయి. కాగా, చండీగఢ్ అధికారాలకు కత్తెర వేసేలా ఉన్న ఈ నిర్ణయంపై పంజాబ్ పార్టీలు నిప్పలు చెరగడంతో కేంద్రం వెనక్కుతగ్గింది.
లాహోర్ ను కోల్పోయి.. కొత్త నగరాన్ని కట్టుకుని..
దేశ విభజన సమయంలో పంజాబ్ రెండు ముక్కలైంది. లాహోర్ వంటి చారిత్రక నగరంతో పాకిస్థాన్ లో ఒక పంజాబ్ ఏర్పడింది. భారత్ లో మిగిలిన పంజాబ్ కు రాజధాని లేదు. ఈ నేపథ్యంలోనే కొత్త రాజధాని నిర్మాణం చేపట్టారు. స్విట్జర్లాండ్-ఫ్రాన్స్ కు చెందిన వాస్తు శిల్పి లె కార్బుసియన్ సారథ్యంలో అలా చండీగఢ్ నిర్మాణమైంది. 1953లో పూర్తయింది. 1966 నవంబరు 1న పంజాబ్-హరియాణ రాష్ట్రాలు ఏర్పడ్డాయి. మొదట్లో సీనియర్ అధికారి చండీగఢ్ పాలనను చూసినా 1984 తర్వాత పంజాబ్ గవర్నర్ కు బాధ్యతలు ఇచ్చారు. 2016లో దీనిని మార్చాలని చూసినా నిరసనలు రావడంతో కేంద్రం వెనక్కుతగ్గింది.
-పంజాబీ ప్రాంతాలతో పంజాబ్ ను, హిందీ మాట్లాడే ప్రాంతాలతో హరియాణా (అప్పటివరకు కేంద్ర పాలితం)ను ఏర్పాటుచేసినా చండీగఢ్ ను కొత్తగా కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించారు.
-1986లోనే చండీగఢ్ ను పంజాబ్ కు ఇచ్చేలా, పంజాబ్ లోని కొన్ని ప్రాంతాలను హరియాణాకు ఇచ్చేలా ప్రయత్నం జరిగినా ఒప్పందాలు అమలుకాలేదు. అలా.. ప్లాన్డ్ సిటీ.. అన్ ప్లాన్డ్ క్యాపిటల్ గా మిగిలిపోయింది.