నీళ్ల కోసం జగన్ అన్నకు కాల్ చేశా... కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు తెలుగు రాష్ట్రాల్లో విపక్ష పార్టీలైన వైసీపీ, బీఆర్ఎస్ మధ్య స్నేహ బంధం ఎంత ధృడంగా కొనసాగుతుందో మరోసారి వెల్లడైంది.;
రెండు తెలుగు రాష్ట్రాల్లో విపక్ష పార్టీలైన వైసీపీ, బీఆర్ఎస్ మధ్య స్నేహ బంధం ఎంత ధృడంగా కొనసాగుతుందో మరోసారి వెల్లడైంది. ఇటీవల కాలంలో బీఆర్ఎస్ కార్యక్రమాల్లో వైసీపీ జెండాలు మెరుస్తున్నాయి. దీంతో రెండు రాష్ట్రాల్లోని విపక్ష పార్టీలు పరస్పర ప్రయోజనాల కోసం పనిచేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. శుక్రవారం తెలంగాణ భవన్ లో జరిగిన సమావేశంలో కృష్ణా నీటి కోసం తాను జగనన్నకు కాల్ చేశానంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికర చర్చకు తెరలేపాయి.
ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణ జలాల పంపిణీపై ఎప్పటి నుంచో పంచాయితీ కొనసాగుతోంది. తెలంగాణలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కృష్ణా జలాల పంపిణీని రాజకీయంగా వాడుకునే ప్రయత్నాలు చేస్తుంటారని విశ్లేషిస్తున్నారు. ప్రధానంగా కృష్ణా నది రెండు రాష్ట్రాల్లో ప్రవహిస్తుంటుంది. తొలుత ఏపీలో ప్రవేశించే కృష్ణా తెలంగాణ మీదుగా తిరిగి ఏపీకి వెళుతుంది. దీంతో ఎగువ, దిగువ ప్రాంతాల్లో ఉన్న ఏపీతో జలాల పంపిణీపై తెలంగాణకు పలు అభ్యంతరాలు ఉన్నాయి. ప్రధానంగా కృష్ణా నీటిని రాయలసీమ ప్రాంతానికి తరలించే విషయంపై తెలంగాణ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తుంటాయని గుర్తు చేస్తున్నారు.
ప్రస్తుతం ఉభయ రాష్ట్రాల్లో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై పెద్ద రాజకీయ యుద్ధమే జరుగుతోంది. ఈ ప్రాజెక్టును రెండు రాష్ట్రాల్లో రాజకీయ వివాదానికి కేంద్రంగా చేయడంతో హాట్ డిబేట్ సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలోని అలంపూర్ నియోజకవర్గంలో పొలాలకు నీరు విడుదల చేయాలని కోరుతూ తాను ఏపీ మాజీ సీఎం జగన్ కు ఫోన్ చేశానంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. తాము అధికారంలో లేకపోయినా తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం పరితపిస్తూ ఉంటామని చెప్పుకునేందుకు కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేసినా రాజకీయ ప్రత్యర్థులు ఆ మాటలను తమకు అనుకూలంగా వినియోగించుకునే ప్రయత్నం చేయడానికి ఆస్కారం ఇచ్చినట్లు ఉందని విశ్లేషిస్తున్నారు.
తాము అధికారంలో లేనప్పుడు తెలంగాణకు నీరు విడుదల చేయమని జగన్ ను కోరినట్లు కేటీఆర్ వెల్లడించారు. అయితే 2023 డిసెంబరులో బీఆర్ఎస్ ప్రభుత్వం గద్దె దిగింది. ఆ తర్వాత ఆరు నెలలకు జగన్ కూడా అధికారం కోల్పోవాల్సివచ్చింది. అంటే 2024 జనవరి - జూన్ మధ్య కాలంలో కృష్ణా నీటి కోసం కేటీఆర్ జగన్ తో మాట్లాడినట్లు భావిస్తున్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కోసం తాము రాయలసీమ లిఫ్ట్ పనులు ఆపించేశామని బీఆర్ఎస్ పార్టీ చెబుతోంది. అలాంటి పరిస్థితుల్లో కృష్ణా జలాలను కిందకు వదలమని కేటీఆర్ ఎందుకు అడగాల్సివచ్చిందనేది ఇక్కడ ప్రశ్నర్థకంగా మారిందని అంటున్నారు.
అయితే ఇక్కడ జల వివాదాలు కన్నా, జగన్ తో రాజకీయ బంధంపైనే ఎక్కువ చర్చ జరుగుతోందని అంటున్నారు. రాష్ట్ర విభజన తర్వాత వైసీపీ, బీఆర్ఎస్ మధ్య రాజకీయంగా స్పష్టమైన అవగాహనతో పనిచేస్తున్నట్లు భావించాల్సివుందని అంటున్నారు. రెండు పార్టీలు అధికారంలో ఉండగా, ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పకపోయినా, ఇటీవల కాలంలో రెండు పార్టీల మధ్య స్నేహ సంబంధాలను ఎప్పటికప్పుడు బహిర్గతం చేసుకునేలా ప్రయత్నిస్తుండటమే ఆసక్తి రేపుతోంది. ఇక కేటీఆర్ వ్యాఖ్యలపై తెలంగాణ ప్రభుత్వ వర్గాలు ఎలా స్పందిస్తాయో చూడాల్సివుంది. అటు ఏపీలో కూడా జగన్మోహనరెడ్డిని ఇరుకన పెట్టేలా ఏపీ ప్రభుత్వం అడుగులు వేయొచ్చని అంటున్నారు.