బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. సున్నాలు.. ఒకట్లు.. ఇదేంది సారూ?
మొత్తం116 మున్సిపాలిటీల్లో 2582 వార్డుల్లో ఫలితాలు వెలువడగా.. కాంగ్రెస్ 1347 వార్డుల్లో విజయాన్ని సాధిస్తే.. బీఆర్ఎస్ 717వార్డుల్లోనే గెలుపొందింది.;
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రానికి జాతిపిత పార్టీ. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలి ముఖ్యమంత్రి.. నాన్ స్టాప్ గా తొమ్మిదిరన్నరేళ్ల పాటు తిరుగులేని అధిక్యాన్ని ప్రదర్శించిన పార్టీ.. విపక్ష నేతలు ముఖ్యమంత్రిని కలిసేందుకు వెళితే.. అపాయింట్ ఇవ్వకుండా గంటల తరబడి వెయిట్ చేయించి.. చివరకు కలిసేందుకు సైతం ఇష్టపడక.. వెళ్లిపొమ్మని చెప్పిన అధినేత మార్గదర్శకంలో నడిచే పార్టీకి దారుణ పరాభవం చోటు చేసుకుంది. అధికారం చేతిలో లేకున్నా తమకు తిరుగు లేదని చెప్పుకునే గులాబీ పార్టీకి ఇలాంటి పరిస్థితి రావటమా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
తాజాగా వెలువడిన మున్సిపల్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ గా మారింది. కొద్ది వారాల క్రితం జరిగిన పంచాయితీ ఎన్నికల ఫలితాలతో పోలిస్తే.. మున్సిపాలిటీల్లో వెలువడిన ఫలితాలు మరింత నిరాశాజనకంగా ఉండటం తెలిసింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తెలంగాణలో తిరుగులేని పార్టీగా తన అధిక్యతను ప్రదర్శించిన బీఆర్ఎస్.. తాజా ఎన్నికల ఫలితాల్లో కొన్నిచోట్ల అసలు ఖాతాలే తెరవని విచిత్రమైన పరిస్థితి.
కోస్గి.. మక్తల్.. ధర్మపురి.. భైంసా మున్సిపాల్టీల్లో ఖాతానే తెరవలేని దుస్థితి. ధర్మపురిలో మొత్తం 15 వార్డులు ఉంటే.. అన్ని కాంగ్రెస్ సొంతం చేసుకుంటే.. కోస్గీలో 16స్థానాలు ఉంటే.. కాంగ్రెస్ అన్నిచోట్ల గెలిచిన పరిస్థితి. ఇక.. 15 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ కు కేవలం ఒక్కవార్డు అంటే ఒక్క వార్డు మాత్రమే గెలుపొందిన పరిస్థితి. ఇంత దారుణంగా పార్టీ బలహీనమైంది ఎందుకు? అన్నది ప్రశ్న.
మొత్తం116 మున్సిపాలిటీల్లో 2582 వార్డుల్లో ఫలితాలు వెలువడగా.. కాంగ్రెస్ 1347 వార్డుల్లో విజయాన్ని సాధిస్తే.. బీఆర్ఎస్ 717వార్డుల్లోనే గెలుపొందింది. కాంగ్రెస్ 66 మున్సిపాలిటీలను సొంతం చేసుకుంటే..బీఆర్ఎస్ కేవలం 13 మున్సాపాలిటీలను సొంతం చేసుకుంది. పదమూడు మున్సిపాలిటీల్లోనూ సింగిల్ డిజిట్ కే పరిమితం కావటం. ఎల్లారెడ్డి, యాదగిరి గుట్ట, వడ్డేపల్లి, సుల్తానాబాద్, పెద్దపల్లి, నందికొండ, మంథని, మధిర, కొడంగల్, హాలియా, చొప్పదండి, భూత్పూర్, ఆత్మకూరు మున్సిపాలిటీల్లో ఒక్క వార్డు మాత్రమే గెలుపొందిన దుస్థితి. ఇదంతా చూస్తే.. ఎలాంటి గులాబీ పార్టీ మరెలాఅయ్యింది? అన్న భావన కలుగకమానదు. ఇప్పటికైనా గులాబీ బాస్ కేసీఆర్ కళ్లు తెరిచి.. తాను పెంచి పోషించి.. పెద్దది చేసిన పార్టీని జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఎంతైనా ఉందని చెప్పాలి.