కాబోయే సీఎం ట్యాగ్ తో కేటీఆర్ ?

ఇక చూస్తే కేసీఆర్ వయసు రిత్యా కూడా 2028 ఎన్నికల నాటికి సీఎం పదవి విషయంలో వెనక్కి తగ్గుతారు అని అంటున్నారు అప్పటికి ఆయనకు 75 ఏళ్ళు వస్తాయని చెబుతున్నారు.

Update: 2026-05-27 03:56 GMT

తెలంగాణాలో వరుస మూడు ఎన్నికల్లో విజయం మాదే అని ఒక వైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టిగానే చెబుతున్నారు. తెలంగాణా ప్రజల తీర్పు కూడా అలాగే ఇస్తారని ఆయన మూడు దశాబ్దాలుగా సంప్రదాయంగా వస్తున్న పొలిటికల్ ట్రాక్ రికార్డుని కూడా పదే పదే చెబుతున్నారు. ఇక కాంగ్రెస్ గతంలో ఎన్నడూ లేనంత బలంగా తెలంగాణాలో ఉందని ఆ మేరకు విపక్షాలలోనే వీక్ నెస్ ఉందని కాంగ్రెస్ భావిస్తోంది. ఇలా బస్తీ మే సవాల్ అని గడచిన రెండున్నరేళ్ళలో అన్ని ఎన్నికలను గెలిచి కాంగ్రెస్ టాప్ గేర్ లో ఉంది. అదే సమయంలో బీఆర్ఎస్ కి పుట్టెడు కష్టాలు వెంటాడుతున్నాయి. క్యాడర్ లో నిరాశ ఉంది. కేసీఆర్ అయితే ఫాం హౌజ్ కే పరిమితం అయిపోయారు. ఇక బీఆర్ఎస్ కాడెని కేటీఆర్ హరీష్ రావు ఈ ఇద్దరే మోస్తున్నారు.

కేటీఆర్ నే ముందు పెట్టి :

ఈ నేపథ్యంలో ఇంతదాకా వచ్చిన తరువాత ఎందుకీ గుద్దులాట అన్నది బీఆర్ఎస్ లో ఒక చర్చ సాగుతోందిట. అధినాయకత్వం అయితే ఎలాంటి శషబిషలకు తావు లేకుండా కేటీఅర్ ని సీఎం అభ్యర్ధిగా ప్రకటించి ఎన్నికలకు వెళ్ళాలని చూస్తోంది అని అంటున్నారు. ఈ విషయంలో ఇప్పటికే ఆలస్యం అయింది అని కూడా అంటున్నారని చెబుతున్నారు. ఎందుకు ఆంటే 2018లో అధికారంలోకి రెండవసారి బీఆర్ఎస్ వచ్చిన సమయంలోనే మధ్యలో కేటీఆర్ కి పగ్గాలు అప్పగిస్తే సీన్ వేరేగా ఉండేదని కూడా పార్టీ వర్గాలలో చర్చగా ఉంది అని అంటున్నారు. జరిగింది జరిగిపోయినా రేపటి ఎన్నికల్లో మాత్రం ఏ మాత్రం పొరపాట్లకు తావు ఇవ్వకుండా అడుగులు వేయాలని చూస్తున్నారు అని అంటున్నారు.

వ్యూహాత్మకంగానే :

ఇక చూస్తే కేసీఆర్ వయసు రిత్యా కూడా 2028 ఎన్నికల నాటికి సీఎం పదవి విషయంలో వెనక్కి తగ్గుతారు అని అంటున్నారు అప్పటికి ఆయనకు 75 ఏళ్ళు వస్తాయని చెబుతున్నారు. దాంతో రేవంత్ వర్సెస్ కేసీఆర్ అంటే ఏజ్ విషయం కూడా బీఆర్ ఎస్ కి మైనస్ అవుతుందా అన్నది ఒక డిస్కషన్ గా ఉంది అని అంటున్నారు. అదే కేటీఆర్ అయితే ఆయన ఏజ్ అప్పటికి 54 మాత్రమే ఉంటుంది కాబట్టి యువ రాజకీయ నేతగా ఆయనను ముందు పెట్టి పోరాడితే జెన్ జీ సహా అన్ని వర్గాల ఓటర్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నారు అని అంటున్నారు. ఇక కేసీఆర్ సైతం వివిధ కారణాల రిత్యా కేటీఆర్ నే సీఎం గా చేయాలని చూస్తున్నారు అని ప్రచారం అయితే సాగుతోంది.

పార్టీలో అన్నీ :

ఇక పార్టీలో చూస్తే అన్నీ ఆయనే అన్నట్లుగా పరిస్థితి ఉందని గుర్తు చేస్తున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఉన్నారు. మొత్తం పార్టీ వ్యవస్థను ఆయనే నడిపిస్తున్నారు. రేపటి ఎన్నికల్లో పార్టీ గెలిస్తే సీఎం గా ఆయనే అన్నట్లుగానే పూర్వ రంగం అంతా సిద్ధం చేశారు అని అంటున్నారు. ఈ నేపధ్యంలో కుటుంబ పరంగా ఇబ్బందులు పెరగకుండా ఉండాలన్నా కూడా కేటీఆర్ కే పగ్గాలు అని ఇప్పటి నుంచే ఒక క్లారిటీతో ముందుకు వెళ్ళడమే బెటర్ అన్న డెసిషన్ కి గులాబీ పెద్దాయన వచ్చారని అంటున్నారు.

హరీష్ రావు సంగతి :

ఇదిలా ఉంటే పార్టీలో సీనియర్ గా ఉన్న హరీష్ రావు సంగతి ఏమిటి అన్నది కూడా చర్చకు వస్తోంది. అయితే కుటుంబ సభ్యులు అంతా కలసి హరీష్ రావు కేటీఆర్ కి అండగా ఉండాలని కోరినట్లుగా దాని మీద ఒక అభిప్రాయానికి వచ్చినట్లుగా ప్రచారం సాగుతోంది. ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతానికి కేటీఆర్ కి పార్టీ పరంగా పూర్తి స్వేచ్చను కేసీఆర్ ఇచ్చారని అంటున్నారు దాంతో ఎన్నికలకు సంబంధించి అన్ని వ్యవహారాలు కేటీఆర్ నే చూస్తారు అని అంటున్నారు. అయితే ఎన్నికల ప్రచారంలో మాత్రం కేసీఆర్ పాలు పంచుకుంటారు అని ఈసారి ఆరు నూరు అయినా బీఆర్ఎస్ ని గెలిపించేందుకు పెద్దాయన ప్రతిన పూనారు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే కేటీఆర్ ని కాబోయే సీఎం అన్న ట్యాగ్ తో కొత్త సెక్షన్లు యూత్ ని ఆకట్టుకోవచ్చు అన్న బీఆర్ఎస్ ఆలోచనలు ఏ మేరకు ఫలిస్తాయన్నది చూడాల్సి ఉంది అని అంటున్నారు

Tags:    

Similar News