బ్రిక్స్ క్లబ్.. పెరిగే జనం.. తరిగే డాలర్ పెత్తనం!

ప్రపంచ రాజకీయాల్లో ఇప్పుడు కొత్త రకమైన 'క్యూ' కనిపిస్తోంది. ఒకప్పుడు అమెరికా డాలర్ కనిపిస్తే చాలు జోహార్లు అర్పించిన దేశాలన్నీ, ఇప్పుడు ‘మాకు ఈ డాలర్ వద్దు.. బ్రిక్స్ దోస్తీ ముద్దు’ అంటూ ఆ దేశాల కూటమి ముందు క్యూ కడుతున్నాయి.

Update: 2026-05-12 11:30 GMT

ప్రపంచ రాజకీయాల్లో ఇప్పుడు కొత్త రకమైన 'క్యూ' కనిపిస్తోంది. ఒకప్పుడు అమెరికా డాలర్ కనిపిస్తే చాలు జోహార్లు అర్పించిన దేశాలన్నీ, ఇప్పుడు ‘మాకు ఈ డాలర్ వద్దు.. బ్రిక్స్ దోస్తీ ముద్దు’ అంటూ ఆ దేశాల కూటమి ముందు క్యూ కడుతున్నాయి. ఐఎంఎఫ్ (IMF) తాజాగా విడుదల చేసిన ఏప్రిల్, 2026 గణాంకాలను చూస్తుంటే, ఇది కేవలం ఒక కూటమిలా కాకుండా.. అమెరికా, యూరప్ దేశాలకు నిద్రలేకుండా చేసే ఒక 'ప్రత్యామ్నాయ ప్రపంచం'లా కనిపిస్తోంది. చైనా భారీ జీడీపీ నుంచి మొదలుకొని, పాలస్తీనా వంటి చిన్న దేశాల వరకు అందరూ ఈ క్లబ్‌లో మెంబర్‌షిప్ కోసం తహతహలాడుతుండటం చూస్తుంటే.. భవిష్యత్తులో వైట్ హౌస్ కంటే 'బ్రిక్స్' ఆఫీసు ముందే రద్దీ ఎక్కువగా ఉండేలా కనిపిస్తోంది.

చైనా - ఇండియా: కూటమిలో రెండు భారీ ఇంజిన్లు!

బ్రిక్స్ సభ్య దేశాల జీడీపీ లెక్కలు చూస్తుంటే, చైనా ఏకంగా $20.85 ట్రిలియన్లతో అందనంత ఎత్తులో కూర్చుంది. దానికి పోటీగా భారతదేశం కూడా $4.15 ట్రిలియన్లతో తన సత్తా చాటుతోంది. ఈ రెండు దేశాలు కలిస్తేనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సగానికి పైగా వాటా ఉండేలా ఉంది. బ్రెజిల్, రష్యా కూడా చెరో రెండున్నర ట్రిలియన్లతో తమ ఉనికిని చాటుకుంటున్నాయి. ఇక్కడ ఒక వింత ఉంది.. ఒకవైపు రష్యాపై ఇన్ని ఆంక్షలు ఉన్నా, దాని జీడీపీ మాత్రం నిలకడగా ఉండటం పాశ్చాత్య దేశాలకు మింగుడుపడని నిజం. సంక్షేమ పథకాలు, అప్పులతో కుస్తీ పడుతున్న దక్షిణాఫ్రికా, ఈజిప్ట్ వంటి దేశాలు కూడా ఈ భారీ ఇంజన్ల అండ చూసుకునే ధైర్యంగా అడుగులు వేస్తున్నాయి.

అప్పుల తిప్పలు.. బ్రిక్స్ ఆశలు!

ఈ జాబితాలో ఇండోనేషియా ($1.54 ట్రిలియన్) వంటి బలమైన ఆర్థిక వ్యవస్థలు పూర్తి సభ్యులుగా మారుతుంటే, పాకిస్థాన్ ($410 బిలియన్), శ్రీలంక ($98 బిలియన్) వంటి దేశాలు మాత్రం దరఖాస్తు పట్టుకొని ధీనంగా ఎదురుచూస్తున్నాయి. పాకిస్థాన్ పరిస్థితి చూస్తుంటే.. ‘సభ్యత్వం ఇస్తే ఇయ్యండి కానీ, ముందు ఏవైనా లోన్లు ఉంటే చూడండి’ అని అడిగేలా ఉంది. అప్పుల ఊబిలో ఉన్న దేశాలన్నీ బ్రిక్స్‌ను ఒక 'ఏటీఎం'లా చూస్తుంటే, అసలు సభ్య దేశాలు మాత్రం దీన్ని ఒక 'పొలిటికల్ వెపన్' (రాజకీయ ఆయుధం)లా వాడుకోవాలని ప్లాన్ చేస్తున్నాయి. ఇక సౌదీ అరేబియా లాంటి ధనిక దేశాలు కూడా చేరితే, బ్రిక్స్ దగ్గర ఆయిల్ కు, డబ్బుకు అస్సలు కొదవ ఉండదు.

భాగస్వామ్య దేశాల ‘వ్యూహాత్మక’ సందడి

నైజీరియా నుంచి వియత్నాం వరకు దాదాపు 10 దేశాలు భాగస్వామ్య హోదాలో ఉంటూ లోపలికి రావడానికి గేట్ల దగ్గర వేచి చూస్తున్నాయి. వియత్నాం ($527 బిలియన్), మలేషియా ($516 బిలియన్) వంటి ఆగ్నేయాసియా పులులు ఈ కూటమిలో చేరితే, ఇక ఆసియా ఖండం మొత్తం బ్రిక్స్ గుప్పిట్లోకి వెళ్లడం ఖాయం. ఒకప్పుడు అభివృద్ధి చెందిన దేశాల జీ-7 (G7) గ్రూపును చూసి భయపడిన ప్రపంచం, ఇప్పుడు బ్రిక్స్ ప్లస్ (బ్రిక్స్+) వైపు ఆశగా చూస్తోంది. ఈ కూటమిలో డేటా లేని క్యూబా, సిరియా వంటి దేశాలు కూడా ఉన్నాయంటే, ఇక్కడ ఆర్థిక స్థితి కంటే 'అమెరికా వ్యతిరేకత' అనే గూడు పుఠాణీనే ఎక్కువగా పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది.

చిన్న దేశాల ‘పెద్ద’ కలలు

కేవలం $3.49 బిలియన్ల జీడీపీ ఉన్న సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ నుంచి, అంతర్యుద్ధాలతో అల్లాడుతున్న ఆఫ్ఘనిస్తాన్ వరకు అందరూ ఈ జాబితాలో ఉన్నారు. వీరందరికీ బ్రిక్స్ లో చేరడం అంటే ఏదో మంత్రదండం దొరికినట్లే అన్నంత ఆశ ఉంది. చైనా ఇచ్చే పెట్టుబడులు, భారత్ ఇచ్చే సాంకేతికత తమ దేశాలను మార్చేస్తాయని వారు నమ్ముతున్నారు. అయితే, ఇంత మంది ఒకే గూటి కింద చేరితే.. ఒకరి అభిప్రాయాలు ఒకరికి నచ్చుతాయా? లేక ఇది కేవలం ఫోటో షూట్లకే పరిమితం అవుతుందా? అన్నది భవిష్యత్తు తేల్చాలి.

మొత్తానికి, బ్రిక్స్ విస్తరణ చూస్తుంటే.. ‘డబ్బు ఉన్నవాడు, అప్పు ఉన్నవాడు, యుద్ధం చేస్తున్నవాడు.. అందరూ కలిశారు. ఇక డాలర్ గారే జాగ్రత్తగా ఉండాలి’ అనిపిస్తోంది. ఐఎంఎఫ్ రిపోర్ట్ ప్రకారం ఈ కూటమి ఇలాగే పెరిగితే, ఇక ప్రపంచం ఢిల్లీ-బీజింగ్ చుట్టూ తిరగడం ఖాయం!

Tags:    

Similar News