చీపురుపల్లిలో బొత్సపై పైచేయి.. ఏం జరిగింది?

చీపురుపల్లి పట్టణాన్ని రెండుగా చీల్చే ఈ వంతెన నిర్మాణంపై గత ప్రభుత్వంలో పెద్దగా శ్రద్ధ పెట్టలేదని విమర్శలు చేస్తున్నారు.;

Update: 2026-01-03 16:30 GMT

వైసీపీ మాజీ మంత్రి, మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణపై కూటమి ప్రభుత్వం పైచేయి సాధించేలా ప్రచారం చేస్తోంది. బొత్స సొంత నియోజకవర్గం చీపురుపల్లిలో నిర్మాణం పూర్తయిన రైల్వే ఓవర్ బ్రిడ్జిపై కూటమి ప్రభుత్వం చేస్తున్న హంగామాపై విస్తృత చర్చ జరుగుతోంది. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలకు కీలకమైన చీపురుపల్లి ఆర్వోబీని వైసీపీ అధికారంలో ఉండగా, మొదలుపెట్టారు. అయితే నిర్మాణ పనుల్లో జాప్యం కారణంగా దాదాపు ఐదేళ్లుగా పనులు సాగాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలలకు పనులు పూర్తికావడంతో ఆ క్రెడిట్ తమదేనంటూ ప్రచారం చేసుకుంటోంది. ఈ విషయంలో బొత్స అనుచరులు ప్రభుత్వ హంగామాను జీర్ణించుకోలేకపోతున్నట్లు చెబుతున్నారు. ఈ విషయాన్ని బొత్స దృష్టికి తీసువెళ్లినట్లు చెబుతున్నారు.

విశాఖ-పాలకొండ ప్రధాన రహదారిలో చీపురుపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి ఉంటుంది. 60 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ బ్రిడ్జి శిథిలావస్థకు చేరడంతో 2022లో రాకపోకలను నిలిపివేశారు. దీనివల్ల శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు చెందిన పది అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలు ప్రధాన రహదారి మార్గాన్ని కోల్పోయినట్లైంది. విజయవాడ నుంచి విశాఖ వరకు నాలుగైదు గంటల్లో వచ్చే ఆయా ప్రాంతాల వారు... విశాఖ నుంచి స్వస్థలాలకు వెళ్లడానికి అంతే సమయం పడటంతో పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కేవలం రెండు గంటల్లో గమ్యస్థానాలకు వెళ్లాల్సిన వారు, చీపురుపల్లి రైల్వే బ్రిడ్జి నిర్మాణం కారణంగా చుట్టూ తిరిగి వెళ్లాల్సిరావడంతో అదనంగా మరో రెండు మూడు గంటలు ప్రయాణం చేయాల్సివచ్చేది.

చీపురుపల్లి పట్టణాన్ని రెండుగా చీల్చే ఈ వంతెన నిర్మాణంపై గత ప్రభుత్వంలో పెద్దగా శ్రద్ధ పెట్టలేదని విమర్శలు చేస్తున్నారు. అప్పట్లో బొత్స మంత్రిగా ఉండగా, చీపురుపల్లికే చెందిన బెల్లాన చంద్రశేఖర్ ఎంపీగా ఉండేవారు. ఈ బ్రిడ్జి నిర్మాణానికి రైల్వే రూ.14 కోట్లు మంజూరు చేసింది. చీపురుపల్లి పట్టణంలో అప్రోచ్ రోడ్డు నిర్మాణంపై వివాదం కారణంగా అప్పటి వైసీపీ ప్రభుత్వం పనులను త్వరగతిన పూర్తి చేసేలా కాంట్రాక్టరును ఒత్తిడి చేయలేకపోయిందని అంటున్నారు. రైల్వే వంతెన నిర్మాణానికి నిధులు ఇచ్చినా, అప్రోచ్ రోడ్డుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించాల్సి ఉండటం కూడా వైసీపీకి చెందిన నేతలు వెనక్కి తగ్గేలా చేసిందని అంటున్నారు.

ఇలా నిర్మాణం జాప్యం కావడం వల్ల చీపురుపల్లి, పాలకొండ, రాజాం, బొబ్బిలి, పార్వతీపురం, ఎచ్చెర్ల, ఆమదాలవలస నియోజకర్గాలకు చెందిన ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సివచ్చిందని చెబుతున్నారు. ఎంతో ప్రధానమైన బ్రిడ్జిని కేవలం ఏడాదిలోగానే పూర్తిచేయాల్సివుంది. అయితే స్థానిక ప్రజాప్రతినిధులు ఒత్తిడి చేయకపోవడంతో కాంట్రాక్టర్ తన ఇష్టం వచ్చినట్లు పని చేయడం వల్ల నిర్మాణం పూర్తి కాడానికి దాదాపుగా ఐదేళ్లు సమయం పట్టిందని అంటున్నారు. ఈ నెల 10న బ్రిడ్జి ప్రారంభానికి ముహూర్తం నిర్ణయించారు.

అయితే ఈ అవకాశాన్ని కూటమి ప్రభుత్వం చక్కగా వినియోగించుకుంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల తర్వాత పనులు పరుగులు పెట్టించి ప్రధానమైన రైల్వే వంతెనను పూర్తి చేయగలిగామని చాటుకుంటుంది. దాదాపు మూడేళ్లు జాప్యం జరగడం వల్ల ఈ విషయంలో ప్రభుత్వ ప్రచారాన్ని వైసీపీ అడ్డుకోలేకపోతోందని అంటున్నారు. బ్రిడ్జి నిర్మాణం తమ గొప్పగా కూటమి నేతలు చెప్పుకుంటోంది. బొత్స సొంత నియోజకవర్గంలో చిన్న బ్రిడ్జి పూర్తి చేయించలేకపోయారంటూ విమర్శలు గుప్పిస్తోంది. అప్రోచ్ రోడ్డుకు నిధులు విడుదల చేయించలేకపోయారంటూ బొత్సను ఇరుకన పెడుతున్నారు. అయితే కూటమి విమర్శలపై తగిన సమాధానం లేక వైసీపీ నేతలు కూడా ఈ విషయంలో ఎలాంటి ప్రకటనలు చేయలేకపోతున్నారని అంటున్నారు.

Tags:    

Similar News