24 గంటల్లో ముంబైని ఖాళీ చేయాల్సిందే: హైకోర్టు సంచలన తీర్పు
ఈ సమయంలో తీవ్ర ఆగ్రహానికి గురైన బాంబే హైకోర్టు.. కొందరి స్వేచ్ఛ పేరుతో లక్షలాది ప్రజల స్వేచ్ఛను హరించమని రాజ్యాం గంలోని ఏ అధికరణ(ఆర్టికల్) చెబుతోందో వివరించాలని కోరింది.;
``ఉద్యమాలు.. నిరసనల పేరుతో ప్రజల జీవితాలపై ప్రభావం చూపిస్తే.. చూస్తూ ఊరుకునేది లేదు. మీ ఉద్యమాలు, నిరసనలు.. రోడ్లపై కాదు.. మీ ఇళ్లలో చేసుకోండి.``అని మహారాష్ట్రలోని బాంబే హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు.. 24 గంటల్లో(అంటే.. తీర్పు ఇచ్చే సమయానికి)గా.. రాజధాని బాంబే వీధులను ఖాళీ చేయాలని..ఎక్కడా నిరసన, ఉద్యమం పేరుతో ఎవరూ కనిపించడానికి, ఏ జెండా కనిపించడానికి కూడా వీల్లేదని తేల్చి చెప్పింది. వాస్తవానికి ఈ సందర్భంగా ఉద్యమ కారుల తరఫున న్యాయవాది.. ఆర్టికల్ 21(జీవించే హక్కు), 14(సమానత్వం), 19(భావప్రకటన స్వేచ్ఛ)లను పదే పదే కోర్టుకు వివరించారు.
ఈ సమయంలో తీవ్ర ఆగ్రహానికి గురైన బాంబే హైకోర్టు.. కొందరి స్వేచ్ఛ పేరుతో లక్షలాది ప్రజల స్వేచ్ఛను హరించమని రాజ్యాం గంలోని ఏ అధికరణ(ఆర్టికల్) చెబుతోందో వివరించాలని కోరింది. ఒకరి స్వేచ్ఛకోసం.. వంద మందిని బలి చేయడాన్ని కోర్టులు చూస్తూ ఊరుకునేది లేదని తెగేసి చెప్పింది. ఈ క్రమంలో లక్షల మంది రాష్ట్ర రాజధాని పౌరుల స్వేచ్ఛను, వారికి ఉన్న హక్కులను కాపాడాల్సిన అవసరం న్యాయస్థానంపై ఉందని పేర్కొంది. అందుకే.. నిరసలను మీ ఇళ్ల ముందు.. మీ వాకిలి ముందు చేసుకోవాలి.. అని పరుషంగా వ్యాఖ్యానించింది. 24 గంటల్లోగా .. ముంబైని ఖాళీ చేయాల్సిందేనని తేల్చి చెప్పింది.
ఏంటీ వివాదం?
గత ఏడాది చివరిలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ సమయంలో మరాఠాలకు 10 శాతం మేరకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పిస్తామని.. బీజేపీ నాయకులు హామీలు ఇచ్చారు.అ యితే.. ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు అయినా.. ఇప్పటి వరకు ఏ చర్య లూ తీసుకోలేదు. దీంతో మరాఠా సామాజిక వర్గం తరఫున ప్రముఖ సామాజిక ఉద్యమ కారుడు మనోజ్ జరాంగే.. ఉద్యమానికి రూపకల్పన చేశారు. గత నెల రోజులుగా ఉద్యమం సెగ తగులుతోంది. దీనిని తీవ్రతరం చేయడంతోపాటు వర్షాకాల అసెంబ్లీ సమావేశాలలోనే మరాఠాలకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించేందుకు.. ప్రభుత్వం రెడీ కావాలన్న డిమాండ్‌తో ఆయన నిరసనను పెంచారు. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా మరాఠాలు తరలి వచ్చారు.
ఇక, ఆదివారం.. సోమవారం.. మరాఠా సామాజిక వర్గం ప్రజలతో ముంబై దారులు మూసుకుపోయాయి. మనిషి కదిలేందుకు కూడా చోటులేనంతగా.. ఇసుక వేస్తే కూడా రాలనంతగా ముంబై వీధులు నిండిపోయాయి. దీంతో ఆఫీసులకు వెళ్లేవారు.. స్కూళ్లకు వెళ్లేవారు కూడా.. నానా యాతన పడ్డారు. ఇక, హైకోర్టుకు వెళ్లే దారిని కూడా నిరసన కారులు మూసేశారు. ఈ పరిణామాలను సుమోటోగా తీసుకున్న న్యాయస్థానం.. విచారణ చేపట్టింది. దీనికి ప్రతివాదులుగా అప్పటికప్పుడు జరాంగ్ ను చేర్చిన న్యాయస్థానం.. మధ్యాహ్నం 4 గంటల సమయంలో తీర్పు ఇచ్చింది. నిరసనలు, ఉద్యమాల పేరుతో ప్రజలకు అవరోధం కల్పిస్తే.. చూస్తూ కూర్చునేది లేదని.. మీ ఇళ్ల ముందు చేసుకోవాలని ఆదేశించింది.