సుప్రీం స్టే ఇచ్చినా బెజవాడలో 42 ఇళ్లు కూల్చేశారా?
విజయవాడలోని భవానీపురం బోజినగర్ కరెంటు ఆఫీసు రహదారిలోని 42 ఇళ్లను అధికారులు కూల్చేశారు.;
ఓవైపు ఇళ్లను కూల్చేయాలంటూ కోర్టు ఇచ్చిన ఆదేశాలు.. మరోవైపు దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఇచ్చిన స్టే.. ఈ రెండింటిలో అధికారులు మాత్రం తాము అనుకున్నట్లే.. కోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా బెజవాడలోని 42 ఇళ్లను కూల్చేవారు. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ ను పరిగణలోకి తీసుకోకుండా ఇళ్లను కూల్చేసిన వైనంపై ఇంటి యజమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. పాతికేళ్లుగా నివాసం ఉంటున్న తమను ఇంత దారుణంగా వెళ్లగొడతారా? అంటూ బాధితులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. అసలేం జరిగిందంటే..
విజయవాడలోని భవానీపురం బోజినగర్ కరెంటు ఆఫీసు రహదారిలోని 42 ఇళ్లను అధికారులు కూల్చేశారు. శ్రీలక్ష్మీ రామ కో ఆపరేటివ్ సొసైటీ బిల్డింగ్ సొసైటీ స్థలదారులకు అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చింది. దీంతో 200 మంది పోలీసు బలగాలతో భవనాల్ని నేలమట్టం చేశారు. 2001లో అబ్దుల్ మజీద్ అనే వ్యక్తి 2.17 ఎకరాల భూమిని అమ్మాడు. దీన్ని పలువురు కొనుగోలు చేవారు. అందులో ఇళ్లు కట్టుకున్నారు.
ఇంటి పన్ను.. వాటర్ ట్యాక్స్ తోపాటు కరెంట్ బిల్లుల్ని చెల్లిస్తున్నారు. ఈ భూమి మీద కొందరు బ్యాంక్ లోన్ కూడా తీసుకున్నారు. అయితే.. 2017లో శ్రీలక్ష్మీ రామ కో ఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ వారు సదరు భూమి తమకు చెందినదిగా పేర్కొంటూ కోర్టును ఆశ్రయించారు. దీంతో విజయవాడ కోర్టు నుంచి ఇంటి యజమానులకు నోటీసులు అందాయి. ఈ వ్యవహారంలో సొసైటీకి అనుకూలంగా కోర్టు ఆదేశాలు ఇవ్వటంతో.. ఇళ్ల యజమానులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనికి స్పందించిన సుప్రీం కూల్చివేతలపై స్టే ఇస్తూ ఆదేశాలు ఇచ్చినట్లుగా ఇంటి యజమానులు పేర్కొంటున్నారు.
ఇళ్లను కూల్చివేతకు వచ్చిన అదికారులకు వీడియోలో సుప్రీం జారీ చేసిన స్టేను చూపించి.. తమకు కాస్త టైమిస్తే ఆ పత్రులను తీసుకొచ్చి చూపిస్తామని పేర్కొన్నారు.అయినప్పటికీ అధికారులు మాత్రం కూల్చివేత దిశగా అడుగులు వేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఒకదశలో ఘర్షణ వాతావరణం నెలకొంది. దశాబ్దాల తరబడి ఉంటున్న ఇళ్లను కూల్చేబబస్తున్న వైనంతో బాధితులు కన్నీరు మున్నీరయ్యారు. బుధవారం ఉదయం 10.45 గంటల వేళలో సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఆర్డర్ ను వీడియోలో చూపించినా కూల్చివేతలు ఆపలేదని మండిపడుతున్నారు. పాతికేళ్లుగా నివాసం ఉంటున్న ఇళ్లను ఉన్నపళంగా ఎలా కూలుస్తారని ప్రశ్నిస్తున్నారు.
తమకు న్యాయం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వద్ద నిరసన తెలిపారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ ప్లకార్డులు పట్టుకొని ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వద్ద ఆందోలన చేపట్టారు. మరి..దీనిపై ప్రభుత్వం ఏ విధంగా రియాక్టు అవుతుందన్నది ఒకఎత్తు అయితే.. తాము లాంటస్టే ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా కూల్చివేతలకు వెళ్లిన అధికారుల తీరుపై ఎలా రియాక్టు అవుతుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.