ఆ బిగ్ లక్కీ హ్యాండ్.. బీజేపీకి కాబోయే జాతీయ అధ్యక్షుడు?
నితిన్ గడ్కరీ.. రాజ్ నాథ్ సింగ్.. అమిత్ షా.. ఇలా బీజేపీలో అధ్యక్షులుగా అందరు అగ్ర నాయకుల వంతు ముగిసింది.. జేపీ నడ్డా కూడా పొడిగింపుపై ఉన్నారు;
నితిన్ గడ్కరీ.. రాజ్ నాథ్ సింగ్.. అమిత్ షా.. ఇలా బీజేపీలో అధ్యక్షులుగా అందరు అగ్ర నాయకుల వంతు ముగిసింది.. జేపీ నడ్డా కూడా పొడిగింపుపై ఉన్నారు. వరుసపెట్టి రాష్ట్రాల్లో విజయాలు సాధిస్తూ.. కేంద్రంలోనూ మూడోసారి అధికారంలో కొనసాగుతూ దేశంలో హవా సాగిస్తోంది కమలం పార్టీ. నిజానికి నిరుడు ఈ రోజుల్లోనే బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి ఎన్నిక జరగాలి. వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో కొత్త అధ్యక్షుడిగా రాబోయేది ఎవరు? అనే ఆసక్తి నెలకొంది. అదే సమయంలో మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పేరు ఖాయమైందనే కథనాలు వచ్చాయి. కానీ, ఆయన్ను కేంద్రంలో కీలకమైన వ్యవసాయ శాఖకు మంత్రిగా నియమించారు. ఇక ఇప్పుడు మరి కాబోయే అధ్యక్షుడు ఎవరు..?
సోమవారం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల ఎన్నిక పూర్తయింది. మరో నాలుగు రాష్ట్రాలకూ సారథి ఎవరనేది తేలే అవకాశం ఉంది. ఆ పార్టీ రాజ్యాంగం మేరకు జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ ప్రారంభానికి ముందే కనీసం 19 రాష్ట్రాల శాఖలకు అధ్యక్షుడిన ఎన్నుకోవాలి. ఇప్పటికి 16 మంది కొత్త అధ్యక్షులు అయ్యారు. మంగళవారం మరో మూడు రాష్ట్రాలకూ ప్రకటించే వీలుంది.
ఇక మిగిలింది జాతీయ అధ్యక్షుడి ఎన్నికే. ప్రస్తుతం జేపీ నడ్డా ఆ బాధ్యతల్లో ఉన్నారు. కేంద్ర మంత్రిగానూ విధులు నిర్వర్తిస్తున్నారు. కాబట్టి నడ్డా మళ్లీ కొనసాగడం కష్టమే. చౌహాన్ తో పాటు గడ్కరీ కూడా ఇప్పటికే జాతీయ అధ్యక్ష బాధ్యతలు చూశారు. అందుకని హరియాణా మాజీ సీఎం ఖట్టర్, ధర్మేంద్ర ప్రధాన్ తో పాటు భూపేంద్ర యాదవ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
వీరిలో భూపేంద్రకే ఎక్కువ చాన్స్ ఉన్నట్లు స్పష్టం అవుతోంది. ఈయన ఇంచార్జిగా వ్యవహరించిన పలు రాష్ట్రాల్లో బీజేపీ తిరుగులేని విజయం సాధించింది. గత ఏడాది మహారాష్ట్ర ఎన్నికల్లో అఖండ విజయానికి తెరవెనుక సారథి భూపేంద్రనే. యూపీ, రాజస్థాన్, బిహార్ లలో పార్టీ ఎన్నికల బాధ్యుడిగా విజయంలో తనవంతు పాత్ర పోషించారు ఆయన. అందుకనే భూపేంద్ర యాదవ్ నే పార్టీ జాతీయ అధ్యక్షుడు చేస్తారని ఢిల్లీ బీజేపీ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి.
భూపేంద్ర వయసు 56 ఏళ్లే. రాజస్థాన్ కు చెందినవారు. కేంద్ర పర్యావరణ, అడవులు, కార్మిక శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు.