ఏపీ బీజేపీ: వారిద్దరూ లాబీయింగ్ చేసేస్తున్నారు!
రాజకీయాల్లో లాబీయింగ్ కొత్తకాదు. నాయకులు తాము కోరుకున్న పదవులు దక్కించుకునేందుకు, కోరు కున్నవి సాధించేందుకు లాబీయింగ్ బాట పట్టడం కొన్ని దశాబ్దాలుగా ఉన్నదే.;
రాజకీయాల్లో లాబీయింగ్ కొత్తకాదు. నాయకులు తాము కోరుకున్న పదవులు దక్కించుకునేందుకు, కోరు కున్నవి సాధించేందుకు లాబీయింగ్ బాట పట్టడం కొన్ని దశాబ్దాలుగా ఉన్నదే. అయితే.. ఇది అన్ని పార్టీల్లోనూ సాధ్యం కాదు. ప్రాంతీయ పార్టీలకు మాత్రమే సాధ్యమనే వాదన వినిపిస్తుంది. కానీ, ఇప్పుడు ఈ తరహా రాజకీయం.. జాతీయ పార్టీ అయిన.. బీజేపీ వరకు పాకింది. తాము కోరుకున్న పదవులు దక్కించు కునేందుకు కమల నాథులు కూడా కేంద్రం స్థాయిలో లాబీయింగ్ చేసుకుంటున్నారు. పైకి అరెరె.. అలాంటిదేమీ లేదని అంటున్నా.. తెరచాటు రాజకీయం జోరుగా చేసేస్తున్నారు.
ఏపీలో మంత్రి వర్గ విస్తరణ లేదా.. ప్రక్షాళన ఉంటుందని తెలియగానే.. బీజేపీ సీనియర్లు.. ఇద్దరు.. ఢిల్లీ స్థాయిలో వ్యూహాత్మక రాజకీయాలకు తెరదీశారు. వీరు వ్యూహాత్మకమని చెబుతున్నా.. పొలిటికల్ పరిభాష లో లాబీయింగ్ అనే అంటారు కదా!?. చంద్రబాబు మంత్రి వర్గంలో చోటు కోసం.. ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ఎమ్మెల్యే, గతంలోనూ మంత్రి పదవిని అలంకరించిన.. కామినేని శ్రీనివాస్.. పెద్ద ఎత్తున చక్రం తిప్పేస్తున్నారు. ఆయన నియోజకవర్గాన్ని వదిలేసి రెండు వారాలైంది.
హైదరాబాద్‌లో తిష్ఠవేసి.. ఢిల్లీ పెద్దలను ప్రభావితం చేస్తున్నారు. ఈయన వ్యూహం అంతా.. చంద్రబాబు మంత్రి వర్గంలో చోటు కోసమే. ప్రస్తుతం బీజేపీ తరఫున సత్యకుమార్ యాదవ్ ఒక్కరే మంత్రిగా ఉన్నారు. మరో సీటు కోసం బీజేపీ పెద్దలే ఒత్తిడి చేస్తున్నారు. అయితే.. సత్యకుమార్‌తో స్థానిక టీడీపీ నాయకులకు పొసగడం లేదు. ఈయనను తప్పించాలని పెద్ద ఎత్తున డిమాండ్లు ఉన్నాయి. వాస్తవానికి సత్యను తప్పించాలని బీజేపీలోని ఓ వర్గం నాయకులు కూడా కోరుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో కొత్తగా వచ్చే సీటు, సత్యను పక్కన పెట్టగా వచ్చే మరోసీటు కలిపి రెండు స్థానాలను బీజేపీలోని ఇద్దరు కీలక నాయకులు కోరుకుంటున్నారు. ఒకరు కామినేని కాగా.. మరొకరు.. విశాఖ ఉత్తరం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. అయితే.. రాజుగారికి ఇవ్వద్దని టీడీపీకి చెందిన మరో సీనియర్ నేత.. ప్రయత్నాలు చేస్తున్నారు. ``ఆయన ఎమ్మెల్యేగా ఉంటేనే.. మాపై చాడీలు చెబుతున్నారు. రేపు మంత్రి అయితే.. మేం నియోజకవర్గంలో తిరిగే పరిస్థితి ఉండదు. `` అని బాహాటంగానే చెబుతూ.. గంట వాయించేస్తున్నారు.
మొత్తానికి చంద్రబాబు రెండు సీట్లు ఇస్తే.. అవితమకే దక్కేలా ఈ ఇద్దరు నాయకులు కూడా ఢిల్లీ స్థాయిలో పెద్దల వద్ద లాబీయింగ్ చేస్తున్నారు. వారి ప్రొఫైళ్లను.. ప్రజల కు చేసిన సేవలను కూడా వివరిస్తున్నారు. మరి ఈ లాబీయింగ్ ఏమేరకు పనిచేస్తుందో.. బీజేపీ పెద్దలు ఎవరిని కరుణిస్తారో చూడాలి. ఇదిలావుంటే.. రాష్ట్రంలో సత్య పరిస్థితి ఎలా ఉన్నా.. కేంద్రంలో ఆయనకు మంచి ఆశీస్సులే ఉన్నాయి. కాబట్టి ఆయనను తప్పించే అవకాశం లేదని కూడా ఒక టాక్ నడుస్తోంది. మరి చివరకు ఏం జరుగుతుందో చూడాలి.