ప్రాంతీయ పార్టీలకు కాలం చెల్లినట్లేనా ?
అలాగే ఢిల్లీది అదే తీరు. యూపీలో కూడా బీజేపీ ఏలుబడి సాగుతోంది. ఇక దక్షిణాదినే కొంత మేర ప్రాంతీయ ప్రభ కనిపిస్తోంది. అయితే ఇక్కడ కూడా ప్రాంతీయ పార్టీలు పడుతూ లేస్తూ ఉన్నాయి.;
ప్రాంతీయ పార్టీలు అంటే భారత దేశం లాంటి సమాఖ్య వ్యవస్థలో స్థానిక గొంతుక. ఒక బలమైన వేదిక. గట్టిగా చెప్పాలంటే ఆయా ప్రాంతీయుల ఆత్మ విశ్వాసం. వారి ఆత్మ గౌరవం. తమ సమస్యలను తాము పరిష్కరించుకోవడానికి తమ ప్రాంతాలలో ఎన్నుకున్న రాజకీయం అది. దాని ద్వారా తాము జాతీయ స్రవంతిలో భాగంగా ఉంటూనే తమ సొంత అస్తిత్వం కాపాడుకుంటూ తమ సమస్యల సాధన కోసం తమ హక్కుల కోసం ఎందాకైనా పోరాడేందుకు సిద్ధం కావడం అన్న మాట.
తొలి నాళ్ళ నుంచే :
భారత దేశం బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్ర్యం పొందాక సంస్థానాలుగా ఉండేది. అవి అయిదారు వందలుగా ఉండేవి. వాటిని రాష్ట్రాలుగా చేసిన వారు సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇక బ్రిటిష్ వారు రాక ముందు ఈ దేశం అంతా చిన్న రాజ్యాలుగా ఉంటూ ఉండేది. ఇక స్వాతంత్ర్యం తరువాత అయితే పలు రాష్ట్రాలు భాషా సంస్కృతి ప్రాతిపదికన ఏర్పాటు అయ్యాయి. ఇవన్నీ సమాఖ్య స్పూర్తిని గౌరవిస్తూనే తమ రాష్ట్రాల ప్రయోజనాల కోసం పనిచేసే ప్రాంతీయ రాజకీయ వేదికలను గట్టిగా కోరుకున్నాయి. అలా అరవై దశకంలో ద్రవిడ వాదం నుంచి పుట్టుకొచ్చింది డీఎంకే. 1962లో దక్షిణాదిన తమిళనాడులో డీఎంకే ప్రాంతీయ పార్టీగా పుట్టింది. ఆ తరువాత దేశంలో మెల్లగా చాలా చోట్ల అనేక ప్రాంతీయ పార్టీలు పుట్టుకుని వచ్చాయి. చాలా ప్రాంతీయ పార్టీలు దేశ రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించాయి.
గర్జించిన నేతలుగా :
ఒక ఎంజీఆర్, ఎన్టీఆర్, ఫరూఖ్ అబ్దుల్లా, ఒక జయలలిత, రామకృష్ణ హెగ్డె, తరువాత కాలంలో చంద్రబాబు మమతా బెనర్జీ, కేసీఆర్, అరవింద్ కేజ్రీవాల్, ములాయం సింగ్ యాదవ్, శరద్ పవార్, లాలూ ప్రసాద్ యాదవ్, దేవేగౌడ, నవీన్ పట్నాయక్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది నేతలు దేశ రాజకీయాలను కీలక మలుపు తిప్పారు. ఎన్టీఆర్ వంటి వారు అయితే కేంద్రం మిథ్య రాష్ట్రాలు నిజం అని కూడా నినదించారు. అంతలా ప్రాంతీయ గొంతుకలు జాతీయ వేదికల మీద ప్రతిధ్వనించాయి. అయితే బీజేపీ 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చాక పరిస్థితులు మారుతున్నాయి. మెల్లగా ప్రాంతీయ రాజకీయం కనుమరుగు అవుతోంది. బీహార్ లో లాలూకి చెక్ పెట్టి ఢిల్లీలో కేజ్రీవాల్ ని కంట్రోల్ చేస్తూ ఇపుడు బెంగాల్ లో కలకత్తా కాళీమాతగా ఉండే మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ కి కూడా భారీ షాక్ ఇచ్చేసింది బీజేపీ.
మింగేస్తున్నాయా :
దీంతో ప్రాంతీయ పార్టీలను జాతీయ పార్టీలు మింగేస్తున్నాయా అన్న చర్చ సాగుతోంది. బీహార్ లో చూసినా బెంగాల్ లో చూసినా ప్రాంతీయ రాజకీయం పోయి జాతీయ పార్టీ అయిన బీజేపీ చేతిలోకి అధికారం వచ్చింది. అలాగే ఢిల్లీది అదే తీరు. యూపీలో కూడా బీజేపీ ఏలుబడి సాగుతోంది. ఇక దక్షిణాదినే కొంత మేర ప్రాంతీయ ప్రభ కనిపిస్తోంది. అయితే ఇక్కడ కూడా ప్రాంతీయ పార్టీలు పడుతూ లేస్తూ ఉన్నాయి.
బీజేపీ టార్గెట్లు :
ఇక బీజేపీ చూస్తే తన తరువాత టార్గెట్లుగా తెలంగాణా, అలాగే పంజాబ్ లని ఎంచుకోబోతోంది అని అంటున్నారు. తెలంగాణలో ఒక ప్రాంతీయ పార్టీగా ఉన్న బీఆర్ఎస్ ని ఓడించి కాంగ్రెస్ గద్దెనెక్కింది. కాంగ్రెస్ ని ఓడించి బీజేపీ అధికారం అందుకుంటే అక్కడ కూడా ప్రాంతీయ పార్టీల కధ సమాప్తం అవుతుందా అన్న చర్చ సాగుతోంది. ఇక పంజాబ్ లో ఆప్ ప్రాంతీయ పార్టీగా అధికారంలో ఉంది. అక్కడ బీజేపీ పాగా వేస్తే కనుక ప్రాంతీయ శకం ముగిసినట్లే. ఓవరాల్ గా చూస్తే కనుక ప్రాంతీయ పార్టీలకు చేటు కాలం వచ్చిందని అంటున్నారు. మమతా బెనర్జీ ఓటమి మీద రకరకాలైన విశ్లేషణలు ఉన్నాయి. విమర్శలు కూడా ఉన్నాయి. కానీ ఒక్క మాట నిజమని అంటున్నారు. ప్రాంతీయ పార్టీలకు బలమైన గొంతుక లేకుండా పోయింది అన్నదే అసలైన విశ్లేషణ. బీజేపీ లేదా కాంగ్రెస్ అనే జాతీయ పార్టీల రాజకీయం కొనసాగుతుందా లేక ప్రాంతీయ పార్టీలకు కొత్త ఊపిరులు అందుతాయా లేదా అన్నది చూడాలి మరి.