తెలంగాణలో కమల వికాశం సాధ్యమే..? ఇలా చేయాల్సిందే..!
పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు భారత రాజకీయ యవనికపై కొత్త చర్చకు తెరలేపాయి.;
పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు భారత రాజకీయ యవనికపై కొత్త చర్చకు తెరలేపాయి. ఆ రాష్ట్రంలో ఒక సామాన్య మహిళ సాధించిన విజయం సృష్టించిన ప్రకంపనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తున్నాయి. ఒక యుద్ధం ముగియగానే మరో యుద్ధానికి సన్నద్ధమవ్వడం రాజకీయ వ్యూహకర్తల నైజం. ఈ క్రమంలోనే అందరి చూపు ఇప్పుడు దక్షిణ భారతం వైపు, ముఖ్యంగా భాగ్యనగర వేదికగా సాగుతున్న పరిణామాల వైపు మళ్లింది. అగ్రరాజకీయ పీఠంపై కన్నేసిన ఒక జాతీయ పార్టీ, తన తదుపరి లక్ష్యాన్ని అత్యంత స్పష్టంగా ప్రకటించడంతో తెలంగాణ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అధికారం చేపట్టిన పార్టీలు ఒకవైపు, కోల్పోయిన వైభవాన్ని వెతుక్కునే శక్తులు మరోవైపు.. వెరసి తెలంగాణ గడ్డ ఇప్పుడు రాజకీయ సమీకరణాలకు అడ్డాగా మారింది.
తదుపరి లక్ష్యం తెలంగాణ: బీజేపీ
పశ్చిమ బెంగాల్ విజయ ఉత్సాహంతో ఉన్న బీజేపీ, ఇప్పుడు తన నెక్ట్స్ టార్గెట్ ను ఫిక్స్ చేస్తూ ఒక ట్వీట్ చేసింది. తదుపరి లక్ష్యం తెలంగాణే అని అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ కావడమే కాకుండా, రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. బెంగాల్ తరహా వ్యూహాలను ఇక్కడ కూడా అమలు చేయాలని, ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో కార్యాచరణ రూపొందించాలని రాష్ట్ర నాయకత్వానికి అగ్రనాయకత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దక్షిణాదిలో కర్ణాటక తర్వాత పటిష్టమైన పట్టు సాధించేందుకు తెలంగాణను సరైన వేదికగా కమలం పార్టీ భావిస్తోంది.
నాయకత్వ లోపం..
తెలంగాణలో బీజేపీకి కేడర్ పరంగా ఎంతో బలం ఉంది. గత రెండు అసెంబ్లీకి జరిగిన పోలింగ్ ను పరిశీలిస్తే ఓట్ షేరింగ్ శాతం పెరుగుతూ వస్తోంది. అయినప్పటికీ, నాయకత్వ స్థాయిలో కొన్ని లోపాలు ఉన్నాయని పార్టీ అంతర్గత విశ్లేషణలో తేలింది. క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు పోరాడటానికి సిద్ధంగా ఉన్నా, నడిపించే విషయంలో అగ్ర నాయకత్వం ఆశించిన స్థాయిలో దూకుడు ప్రదర్శించడం లేదని భావిస్తున్నారు. ముఖ్యంగా నాయకుల మధ్య ఐక్యత, సమన్వయ లోపం వంటివి పార్టీ ఎదుగుదలకు అడ్డంకిగా మారాయి. పార్టీలోని లోపాలపై కార్యకర్తలు బహిరంగంగానే అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర అగ్ర నాయకత్వంలో ఐక్యత పెరగాలని, అప్పుడే అధికార పార్టీలను ఢీకొనడం సాధ్యమవుతుందని కేడర్ గట్టిగా నమ్ముతోంది.
బీఆర్ఎస్ పుంజుకోవడం.. కాంగ్రెస్ బలం
తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు బీజేపీకి సవాల్‌గా మారాయి. ఇటీవల జరిగిన జగిత్యాల సభ, బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కేసీఆర్ చేసిన ప్రసంగం ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఊపు తీసుకొచ్చింది. రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న అనుభవం, క్షేత్ర స్థాయిలో పట్టు బీఆర్ఎస్‌కు బలం పెంచుతున్నాయి. మరోవైపు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం వల్ల సహజంగానే ఆ పార్టీకి పాలనాపరమైన అనుకూలత ఉంది. ఈ రెండు బలమైన శక్తులను ఒకేసారి ఎదుర్కోవాలంటే కేవలం మాటలతో సరిపోదని, వ్యూహాత్మకమైన అడుగులు వేయాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కార్యకర్తల ఆకాంక్ష..
రాష్ట్ర నాయకత్వ పరిస్థితి అలా ఉండగా.. సాధారణ కార్యకర్తలు పార్టీ నుంచి తీవ్రమైన పోరాటాన్ని కోరుకుంటున్నారు. ప్రత్యర్థి పార్టీలు దూకుడుగా వెళ్తున్న తరుణంలో, బీజేపీ కూడా అంతే వేగంగా ప్రజల్లోకి వెళ్లాలని ఆశిస్తున్నారు. ప్రజా సమస్యలపై నిరంతర పోరాటాలు, ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం వంటి కార్యక్రమాల ద్వారానే ఉనికిని చాటుకోవచ్చని భావిస్తున్నారు. బెంగాల్‌లో సామాన్యుల నుంచి నాయకులను తయారు చేసినట్లే, ఇక్కడ కూడా స్థానిక సమస్యలపై స్పందించే నాయకత్వాన్ని ప్రోత్సహించాలని డిమాండ్ వినిపిస్తోంది.
రాబోయే రోజుల్లో కమలనాథుల వ్యూహం?
తెలంగాణను గెలుచుకోవాలనే లక్ష్యం గొప్పదే అయినా, ఎంత వరకు సాధ్యమవుతుందనేది వారి వ్యూహాలపై ఆధారపడి ఉంటుంది. ఇతర పార్టీల నుంచి బలమైన నాయకులను ఆహ్వానించడం, క్షేత్రస్థాయిలో బూత్ కమిటీలను మరింత బలోపేతం చేయడం వంటి పద్ధతులతో పాటు, తెలంగాణ సెంటిమెంట్‌ను ఎలా డీల్ చేస్తారనేది ఆసక్తికరం. ఏది ఏమైనా, ‘టార్గెట్ తెలంగాణ’ అనే నినాదంతో బీజేపీ యుద్ధం ప్రకటించింది. మరి త్రిముఖ పోరులో కమలం ఏ మేరకు ప్రభావం చూపుతుందో కాలమే నిర్ణయించాలి.