జపాన్‌కు ‘చుక్కలు చూపిస్తాం’.. కిమ్ చెల్లెమ్మ వార్నింగ్ రిపోర్ట్
అసలు నిన్నటివరకు సైలెంట్‌గా ఉన్న జపాన్ ఒక్కసారిగా రక్షణ బడ్జెట్‌ను విపరీతంగా పెంచేసి.. సైనిక శక్తిని విస్తరించడం ఉత్తర కొరియాకు అస్సలు మింగుడు పడటం లేదు.
తూర్పు ఆసియాలో మరో కొత్త ఎపిసోడ్ ఘనంగా మొదలైంది. ఈసారి స్క్రిప్ట్ రాయడమే కాకుండా డైలాగులు కూడా దంచికొట్టింది మరెవరో కాదు.. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ముద్దుల సోదరి.. ఆ దేశపు అఫీషియల్ కోప దేవి కిమ్ యో జోంగ్. పసిఫిక్ సముద్ర తీరంలో జపాన్ ఇటీవల చేస్తున్న హడావుడిని చూసి సహనం నశించిన ఈ ‘అక్కా గారు’.. మాతో పెట్టుకుంటే జపాన్ అంతు చూస్తాం అంటూ సరాసరి టోక్యో వైపు ఒక గట్టి వార్నింగ్ షాట్ విసిరేశారు. అసలు నిన్నటివరకు సైలెంట్‌గా ఉన్న జపాన్ ఒక్కసారిగా రక్షణ బడ్జెట్‌ను విపరీతంగా పెంచేసి.. సైనిక శక్తిని విస్తరించడం ఉత్తర కొరియాకు అస్సలు మింగుడు పడటం లేదు.
అసలు కథేంటంటే.. జపాన్ బాబులు ఈమధ్య మేమంతా చాలా సైలెంట్ కేవలం ఆత్మరక్షణే మా ధ్యేయం అనే పాత పాడుబడిన ట్యాగ్ పక్కన పడేసి సరికొత్త సైనిక విన్యాసాలకు తెరలేపారు. అంతటితో ఆగకుండా ఇటీవల ఒక డిఫెన్స్ వైట్ పేపర్ విడుదల చేసి అందులో చైనా, రష్యాలతో పాటు ఉత్తర కొరియాను కూడా తమ హిట్ లిస్ట్‌లో అంటే ప్రధాన భద్రతా సవాళ్లుగా చేర్చేశారు. దీంతో తీవ్రంగా అవమానపడిన కిమ్ యో జోంగ్ తమ అధికారిక వార్తా సంస్థ కేసీఎన్ఏ వేదికగా నిప్పులు చెరిగారు. పసిఫిక్ మహాసముద్రంలో నిల్చొని అమెరికా నుంచి కొనుగోలు చేసిన 'టామాహాక్' క్రూయిజ్ క్షిపణులను తమ ఇంటి ముందే పరీక్షించడం ఏంటని ఆమె నిలదీశారు. జపాన్ చేస్తున్నది కేవలం ఆత్మరక్షణ కాదని అవసరమైతే పొరుగు దేశాలపై ముందస్తు దాడులు చేయడానికి స్కెచ్ వేస్తోందని ఆరోపించారు.
ఇక తూర్పు ఆసియాలో అమెరికా, జపాన్, దక్షిణ కొరియా అనే ముగ్గురు మిత్రులు కలిసి రోజూ ఉదయాన్నే జాయింట్ మిలిటరీ డ్రిల్స్ చేస్తూ పసిఫిక్ రీజియన్‌లో విపరీతంగా సందడి చేస్తున్నారు. ఈ త్రయం వైఖరిపై కిమ్ యో జోంగ్ తనదైన మార్క్ లాజిక్‌తో విరుచుకుపడ్డారు. మీరు రోజుకో పెద్ద క్షిపణి పరీక్ష చేస్తే అది అమాయకపు రక్షణ చర్య అవుతుందా అదే మేం సరదాగా ఒక మిస్సైల్ టెస్టేస్తే మాత్రం ప్రాంతీయ ప్రశాంతతకు భంగం కలిగించడమేనా అని ప్రశ్నించారు. జపాన్ గనుక తన ప్రస్తుత వైఖరిని ముందస్తు దాడుల ప్లాన్లను మార్చుకోకపోతే టోక్యో నగరానికే తీవ్ర భద్రతా ముప్పు ఏర్పడేలా తాము కూడా "ప్రత్యేక సైనిక ప్రత్యామ్నాయాలను" అమలు చేయాల్సి వస్తుందని నార్త్ కొరియా తరఫున ఒక స్వీట్ వార్నింగ్ పంపేశారు.
అటు జపాన్ ఏమో అమెరికా అండ చూసుకుని రొమ్ము విరుస్తోంది, ఇటు ఉత్తర కొరియా ఏమో రోజుకో రకం మిస్సైల్‌ను గాల్లోకి వదులుతూ వినోదాన్ని అందిస్తోంది. ఈ ఇద్దరి సైనిక ప్రదర్శనలు, ఘాటు మాటల యుద్ధం చూస్తుంటే తూర్పు ఆసియా ప్రాంతంలో భద్రత అనేది ఒక రకం కామెడీ సర్కస్‌లా మారిపోయిందని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు పెదవి విరుస్తున్నారు. మరి కిమ్ చెల్లెమ్మ ఇచ్చిన ఈ భారీ బెదిరింపులకు టోక్యో సైలెంట్ అయిపోతుందా లేక "సరే చూసుకుందాం" అని అమెరికాతో కలిసి మరో క్షిపణి టెస్ట్ చేస్తుందో వేచి చూడాలి.