బీజేపీతో పొత్తు అంటే ప్రాంతీయ పార్టీలు గల్లంతేనా ?
తేడా అంటే ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలకు భిన్నంగా ఆలోచిస్తూ జాతీయ వాదం మీద పనిచేసే పార్టీగా నైతిక నిష్టను పాటించే రాజకీయ సంస్థగా పూర్వ నాయకులు పదే పదే గర్వంగా ప్రకటించేవారు
బీజేపీని తేడా గలిగిన పార్టీ అని ఆ పార్టీ నేతలు ఎంతో గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. తేడా అంటే ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలకు భిన్నంగా ఆలోచిస్తూ జాతీయ వాదం మీద పనిచేసే పార్టీగా నైతిక నిష్టను పాటించే రాజకీయ సంస్థగా పూర్వ నాయకులు పదే పదే గర్వంగా ప్రకటించేవారు. అయితే గతంలోని బీజేపీకి ప్రస్తుతం బీజేపీకి చాలా తేడావే ఉందని ప్రత్యర్ధులు సెటైర్లు వేస్తున్నారు. ఇతర పార్టీలతో తేడా కాదు బీజేపీ గత తరం నాయకుల పోకడలతో పోలిస్తే ఇప్పటి బీజేపీ తేడాగా సాగుతోందని విమర్శించే వారు ఉన్నారు. ఎందుకంటే బీజేపీ ఈ రోజున అన్ని అవలక్షణాలను అధికారం ఎక్కిన తరువాత అలవరచుకుందని వారి భావన.
వాజ్ పేయి హయాంలో :
బీజేపీ వరిష్ట నాయకుడు అటల్ బిహారీ వాజ్ పేయి అయితే బీజేపీని ఒక ఉన్నత సంస్థగా తీర్చిదిద్దారు. అద్వానీ తోడుగా ఆయన పార్టీని నియమ నిష్టలతోనే అధికారానికి తేగలిగారు. 1998లో వాజ్ పేయి ఒక్క ఓటుతో ఓటమి చవిచూసిన సందర్భం అందరికీ గుర్తు ఉంటుంది. ఆయన కనుక నాడు కాస్తా నిష్టను పక్కన పెడితే ప్రభుత్వం కుప్ప కూలేది కాదు అని అంటారు. 1999 ఎన్నికల నాటికి జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఎన్డీయేని ఏర్పాటు చేశారు వాజ్ పేయి. 23 పార్టీలతో కలసి అధికారం పంచుకున్నారు. మిత్రులు అందరికీ ఎంతగానో విలువ ఇచ్చేవారు. అపుడు కూడా ఆయన తలచుకుంటే తమతో జట్టు కట్టిన పార్టీలను నిలువునా చీల్చేసి అధికారం మరింతగా పటిష్టం చేయలేదు. కానీ ఒకరిద్దరు ఎంపీలు ఉన్న పార్టీలను సైతం ఆయన గౌరవించారు అని చెబుతారు.
చీల్చుడు రాజకీయం :
ప్రస్తుతం చీల్చుడు రాజకీయం దేశంలో సాగుతోంది అని అంటున్నారు. పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ విషయం తీసుకుంటే 20 మందికి పైగా ఎంపీలను అలాగే 50 మందికి పైగా ఎమ్మెల్యేలను వేరు వర్గంగా చేయడం వెనక బీజేపీ చాణక్య రాజకీయం ఉందని అంటారు. అలాగే మహారాష్ట్రలో శివసేన నుంచి ఏక్ నాధ్ షిండేను ప్రోత్సహించి అడ్డంగా చీల్చేశారు, ఇపుడు ఆ మిగిలిన పార్టీ ఎంపీలను ఎమ్మెల్యేలను కూడా తమ వైపునకు తిప్పుకునేందుకు షిండే అమలు చేస్తున్న వ్యూహాల వెనక బీజేపీ ఉందని అంటున్నారు. పంజాబ్ లో అకాలీదళ్ బీజేపీతో దశాబ్దాల పొత్తు పెట్టుకుని చివరికి ఆ పార్టీ అక్కడ నామరూపాలు లేకుండా పోయిందని గుర్తు చేస్తున్నారు.
నితీష్ కుమార్ ఎక్కడ :
బీహార్ లో నితీష్ కుమార్ పెద్ద నాయకుడు. ఓబీసీ వర్గానికి చెందిన ఈ నేత ఇపుడు మాజీ సీఎం అయిపోయారు. ఎన్డీయే భేటీలలో ఎక్కడా కనిపించడం లేదు. ఇక ఆయన పార్టీ సంగతి బీహార్ లో ఏమవుతుంది అన్నది రానున్న రోజులే చెప్పాలని అంటున్నారు. ఒకనాడు బీజేపీతో జట్టు కట్టిన బీఎస్పీ యూపీలో ఇపుడు ఉనికి పోరాటం చేస్తోంది. ఇక ఒడిషాకు వస్తే బిజూ జనతాదళ్ తో పొత్తు పెట్టుకుని మెల్లగా 2000 సంవత్సరంలో ఒడిషా రాజకీయాల్లో బీజేపీ ఎంట్రీ ఇచ్చింది. ఈ రోజున బీజేపీ అక్కడ అధికారంలో ఉంది. బిజీ జనతాదళ్ కి లోక్ సభలోనే ఎంపీలు 2024లో గెలవని పరిస్థితి ఉంది. బిజూ జనతాదళ్ కూడా ఉనికి పోరాటం చేస్తోంది.
దేవెగౌడ కి చెక్ :
ఇక దక్షిణాదికి వస్తే కనుక కర్ణాటకలో జేడీఎస్ తో పొత్తు పెట్టుకుని ఆ బీజేపీ బలపడుతోంది. 2024 ఎన్నికల్లో మొత్తం 28 ఎంపీలకు గానూ 25 దాకా గెలుచుకుంది. మరో వైపు చూస్తే మాజీ ప్రధాని దేవేగౌడకు నిన్నటిదాకా ప్రాధాన్యత ఇచ్చిన బీజేపీ ఆయన రాజ్యసభ సభ్యత్వం ముగియగానే తీసి పక్కన పెట్టేసింది అని ప్రత్యర్ధులు విమర్శిస్తున్నారు. కుమారస్వామికి ఈ రోజున కేంద్ర మంత్రి పదవి ఉండొచ్చు కానీ జేడీఎస్ పరిస్థితి కర్ణాటకలో ఇబ్బందికరమే అని అంటున్నారు. తమిళనాడులో అన్నా డీఎంకేతో పొత్తు పెట్టుకుని బీజేపీ ఎంత బలపడిందో తెలియదు కానీ ఈ రోజున అన్నా డీఎంకే అన్న పార్టీ చరిత్ర పుటలలోకి వెళ్ళేలా ఉందని గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీలో బీజేపీతో టీడీపీ జనసేన పొత్తులో ఉన్నాయి. దాంతో ఈ పార్టీల గురించి కూడా చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. చిత్రమేంటి అంటే ఈ మూడు పార్టీల ఓటు బ్యాంక్ ఒక్కటే. దాంతో బీజేపీ ఏపీలో బలపడాలి అనుకుంటే కనుక ఏపీలో కూడా కీలక పరిణామాలు సంభవించే చాన్స్ ఉందని అంటున్నారు.