శిక్ష వేసిన న్యాయమూర్తికే వార్నింగ్.. యూపీ కోర్టులో కలకలం
ఉత్తరప్రదేశ్ (యూపీ)లోని స్థానిక కోర్టులో ఇద్దరు నేరస్థులు రెచ్చిపోయారు. హత్య కేసులో నేరం రుజువు అవడంతో జీవిత ఖైదుకు గురైన ముద్దాయిలు తమకు శిక్షలు విధించిన న్యాయమూర్తికి కోర్టు హాలులోనే వార్నింగ్ ఇచ్చారు.;
ఉత్తరప్రదేశ్ (యూపీ)లోని స్థానిక కోర్టులో ఇద్దరు నేరస్థులు రెచ్చిపోయారు. హత్య కేసులో నేరం రుజువు అవడంతో జీవిత ఖైదుకు గురైన ముద్దాయిలు తమకు శిక్షలు విధించిన న్యాయమూర్తికి కోర్టు హాలులోనే వార్నింగ్ ఇచ్చారు. తమనే జైలుకు పంపుతావా? నీ అంతు చూస్తామంటూ ఆ ఇద్దరు ముద్దాయిలు పోలీసులు, న్యాయవాదులు, కక్షిదారుల సమక్షంలోనే బెదిరింపులకు దిగడం హాట్ టాపిక్ గా మారింది. ఈ సంఘటన తీవ్ర కలకలం రేపింది. నేరస్తుల బెదిరింపులతో జడ్జి హడలిపోయారు. పోలీసులు ఆయనకు భద్రత పెంచారు. ఇటీవల కాలంలో ఈ తరహా సంఘటనలు పెరిగిపోవడం న్యాయమూర్తులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోందని చెబుతున్నారు.
ఉత్తరప్రదేశ్‌లో జడ్జీల రక్షణ, కోర్టుల భద్రతపై ఆందోళనలను రేకెత్తించే సంఘటన వెలుగుచూసింది. 2024లో నమోదైన హత్య కేసుపై బిజ్నోర్ కోర్టులో గురువారం విచారణ జరిగింది. 2024 మే నెలలో ధాంపూర్ ప్రాంతంలో పుఖ్‌రాజ్ అనే వ్యక్తిని కారుతో తొక్కి హతమార్చారని జైదీప్, పింటూ చౌహాన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు అనంతరం కోర్టులో సాక్ష్యాలను చూపడంతో నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ సెషన్స్ జడ్జి నిజేంద్ర కుమార్ తీర్పునిచ్చారు. తీర్పు వినగానే నిందితులు ఇద్దరూ ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయారు.
కోర్టు హాల్‌లోనే జడ్జిని ఉద్దేశించి.. "నీ ఇల్లు ఎక్కడో మాకు తెలుసు, నిన్ను వదిలిపెట్టం" అంటూ బహిరంగంగానే హెచ్చరించారు. ఈ హఠాత్పరిణామంతో కోర్టులో ఉన్న న్యాయవాదులు, సిబ్బంది విస్తుపోయారు. కోర్టు గదిలోనే సాక్షాత్తూ న్యాయమూర్తికే ప్రాణహాని తలపెడతామంటూ నిందితులు బెదిరింపులకు దిగడం కలకలం రేపింది. న్యాయమూర్తికే నేరుగా ప్రాణహాని హెచ్చరికలు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. జడ్జి నిజేంద్ర కుమార్ కి తక్షణమే భద్రతను పెంచినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై విడిగా కేసు నమోదు చేయనున్నామని ప్రకటించారు.
ఇటీవలి కాలంలో జడ్జీలపై దాడులు చేస్తామని బెదిరింపులు ఎక్కువవడం ఆందోళన కలిగిస్తోందని అంటున్నారు. చట్టాన్ని పరిరక్షించే న్యాయమూర్తులకే భద్రత లేకపోతే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ సంఘటన నేపథ్యంలో గతంలో ఢిల్లీలోని సాకేత్ కోర్టులో ఒక మహిళా జడ్జిని కోర్టు రూమ్‌లోనే నిందితుడు బెదిరించిన ఘటనను అంతా గుర్తు చేస్తున్నారు. కేసు విచారణ సమయంలో నిందితుడు అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా మహిళా న్యాయమూర్తిపై భౌతిక దాడికి ప్రయత్నించాడు. అదేవిధంగా ఝార్ఖండ్ రాష్ట్రంలోని ధన్‌బాద్ లో ఓ కేసు విచారణలో నిందితులకు శిక్ష వేధించిన జడ్జి ఉత్తమ్ ఆనంద్ హత్యకు గురయ్యారు. బిజ్నోర్ ఘటన తర్వాత ఈ కేసులపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. న్యాయమూర్తులకు భద్రత పెంచడంతోపాటు బెదిరింపులకు దిగేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.