ఇక స్టాలిన్ వంతు...తమిళనాడులో ఎస్‌ఐఆర్
తమిళనాడులో వారం రోజులలోనే ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ మేరకు మద్రాస్ హైకోర్టుకు కూడా తెలియచేసింది.;
బీహార్ లో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ అన్నది బీహార్ లో కొద్ది నెలల క్రితం ఎంతటి రాజకీయ దుమారం రేపిందో అందరికీ తెలిసిందే. ఎస్‌ఐఆర్ పుణ్యమాని ఏకంగా నెల రోజుల పాటు సాగిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వర్షార్పణం అయిపోయాయి. ఒక్క రోజు కూడా సజావుగా పార్లమెంట్ సాగలేదు. ప్రతీ రోజూ ఎస్‌ఐఆర్ మీద చర్చ జరపాలని విపక్షాలు వాయిదా తీర్మానం ఇస్తూనే ఉన్నాయి. ఇక బీహార్ లో అయితే మొత్తం విపక్షమే రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేసింది. దాని వల్ల ఉన్న ఓట్లు పోతున్నాయని కూడా ఆందోళన చెందుతూ విపక్షాలు కేంద్ర ప్రభుత్వం మీద ఈసీ మీద కూడా విరుచుకుపడ్డాయి.
నకిలీ ఓట్ల కోసమే :
అయితే దేశంలో నకిలీ ఓట్లను తొలగించాలని చూసేందుకే ఎస్‌ఐఆర్ అని కేంద్ర ఎన్నికల సంఘం చెబుతూ వచ్చింది. కానీ రాహుల్ గాంధీ వంటి వారు దీనిని ఏకంగా ఓట్ల చోరీగా అభివర్ణించారు. ఓటర్ అధికార యాత్ర పేరుతో రాహుల్ బీహార్ అంతా పదిహేను రోజుల పాటు తిరిగారు కూడా. ఎస్‌ఐఆర్ పేరుతో ప్రతిపక్ష ఓట్లను తొలగించడమే కాకుండా పెద్ద ఎత్తున రిగ్గింగ్ చేసేందుకు కుట్ర చేస్తున్నారు అని కూడా కాంగ్రెస్ ఆరోపించింది. కానీ ఈసీ మాత్రం దీనిని మంచి ప్రయత్నం కోసమే అని చెబుతోంది. అంతే కాదు దేశంలో మిగిలిన రాష్ట్రాలలో సైతం ఎస్‌ఐఆర్ నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తోంది.
వారం రోజుల్లోనే :
తమిళనాడులో వారం రోజులలోనే ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ మేరకు మద్రాస్ హైకోర్టుకు కూడా తెలియచేసింది. కోర్టుకు ఎందుకు ఈసీ ఈ విధంగా తెలియచేసింది అంటే చెన్నైలోని టి నగర్‌లో ఉన్న 229 పోలింగ్ బూత్‌లలో పూర్తిగా రీ వెరిఫిషన్ చేయాలని ఏఐడీఎంకే మాజీ ఎమ్మెల్యే బి సత్యనారాయణన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాని మీద ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మణింద్ర మోహన్ శ్రీవాస్తవ జస్టిస్ జీ అరుల్ మురుగన్ ధర్మాసనం విచారించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం న్యాయవాది నిరంజన్ రాజగోపాల్ కోర్టు దృష్టికి ఎస్‌ఐఆర్ ని తీసుకుని వచ్చారు. మరో వారం రోజుల్లో తమిళనాడులో ఎస్ఐఆర్ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు ఆయన కోర్టుకు నివేదించారు. ఈ విధంగా చేయడం ద్వారానే ఎమ్మెల్యే బి సత్యనారాయణన్ సమస్యలు పరిష్కారం లభిస్తుందని ఆయన చెప్పారు.
కాగా 2021 అసెంబ్లీ ఎన్నికల్లో టి నగర్ నుండి పోటీ చేసిన సత్యనారాయణన్ ఓటర్ల జాబితాను నిర్వహించడంలో వైఫల్యాలు ఉన్నాయని తన పిటిషన్ ద్వారా ఆరోపించారు. అంతే కాదు అసలైన ఓటర్లను పెద్దఎత్తున తొలగించడం వల్లే 2021 ఎన్నికల్లో 137 ఓట్ల తేడాతో తాను ఓడిపోయానని కూడా ఆయన చెబుతున్నారు. పేర్కొన్నారు.
ఎన్నికల వేళ ఎస్‌ఐఆర్ :
బీహార్ ఎన్నికల ముందు ఎస్‌ఐఆర్ ని నిర్వహిస్తే ఎంతటి దుమారం రేగిందో అందరికీ తెలిసిందే ఇపుడు చూస్తే 2026లో తమిళనాడులో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపధ్యంలో ఎస్‌ఐఆర్ నిర్వహిస్తామని ఈసీ పేర్కొనడంతో స్టాలిన్ ప్రభుత్వం ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అన్నది చూడాలని అంటున్నారు. అయితే దాదాపు 22 ఏళ్ల విరామం తర్వాత తమిళనాడులో ఓటరు జాబితా సవరణ చేపడుతున్నట్లుగా ఈసీ వెల్లడిస్తోంది. ఇక చూస్తే తమిళనాడుతో పాటుగా అస్సాం, కేరళ, పుదుచ్చేరి, పశ్చిమబెంగాల్ శాసనసభలకు 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఈ రాష్ట్రాల్లోనూ ఈసీ ఎస్ఐఆర్ ప్రక్రియను చేపట్టే అవకాశం ఉందని చెబుతున్నారు.
రచ్చ జరిగే అవకాశం :
ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వామ్య పక్షంగా డీఎంకే ఉంది. అంతే కాదు ఆ పార్టీ నాయకులు ఇప్పటికే ఎస్‌ఐఆర్ ని తీవ్రంగా వ్యతిరేకించాఉర్. దీని వల్ల ఓట్లలో భారీ మార్పులు చేసి అక్రమాలకు తావు ఇస్తారని కూడా విపక్షాలు అంటున్నాయి. డీఎంకే మంత్రి దురై మురుగన్ గతంలోనే ఎస్ఐఆర్ ప్రతిపాదనను వ్యతిరేకించారు. బీహార్ కంటే కూడా తాము ఇంకా ఎక్కువగా వ్యతిరేకిస్తామని కారణం తమిళనాడులో ప్రజలకు అవగాహన ఉంటుందని, తమను ఎవరూ మోసం చేయలేరని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో బీజేపీ మార్క్ పాలిటిక్స్ చెల్లదని కూడా ఇప్పటికే చెప్పేశారు. మరి ఎస్‌ఐఆర్ తో తమిళనాడు రాజకీయం పీక్స్ కి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.