సిగరెట్ పొగతో సుపరిపాలన... ఎమ్మెల్యే వీడియో వైరల్!

ఈ నేపథ్యంలో.. ఈ వీడియో ఆన్‌ లైన్‌ లో విస్తృత వ్యతిరేకతకు దారితీసింది. ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలను అనుసరిస్తోందని ఆరోపిస్తున్నారు.;

Update: 2026-01-19 18:30 GMT

పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన నేతలు పోయి.. జనం ఎలా నడుచుకోకూడదో వాళ్లను చూస్తే చాలు అని చెప్పుకునే చాలామంది నేతలు పాలకులుగా ఉన్న రోజులు ఇవి! పబ్లిక్ ప్లేస్ లో, పది మందీ వచ్చి వెళ్లే ఆస్పత్రిలో ఓ ఎమ్మెల్యే సిగరెట్ కాలుస్తూ కనిపించడం ఇప్పుడు వైరల్ గా మారింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోన్న వేళ.. సదరు ఎమ్మెల్యే వ్యవహారంపై నెటిజన్లు, ప్రతిపక్ష పార్టీల నేతలు ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు.

అవును... బీహార్ లోని ఓ ఆస్పత్రిలో జేడీయూ ఎమ్మెల్యే అనంత్‌ సింగ్‌ సిగరెట్‌ తాగిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి. పట్నాలోని ఇందిరా గాంధీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఐజీఐఎంఎస్)లో ఆయనను వైద్య పరీక్షల కోసం తీసుకువెళ్లినప్పుడు అక్కడ సిగరెట్‌ తాగినట్లు తెలుస్తోంది. ఇలా అధికార పార్టీ ఎమ్మెల్యేగా గౌరవప్రదమైన స్థానంలో ఉన్న వ్యక్తి ఈ విధంగా ప్రవర్తించడంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో.. ఈ వీడియో ఆన్‌ లైన్‌ లో విస్తృత వ్యతిరేకతకు దారితీసింది. ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలను అనుసరిస్తోందని ఆరోపిస్తున్నారు. ఈ సమయంలో.. ఆర్జేడీ ప్రతినిధి ప్రియాంక భారతి ఈ క్లిప్‌ ను 'ఎక్స్‌'లో షేర్ చేస్తూ.. నితీష్ కుమార్ నే తృత్వంలోని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అనంత సింగ్, సుపరి పాలనను పొగలో ముంచెత్తుతున్నారని ఆమె అన్నారు. నితీష్ జీ ముద్దుల విలన్ ఆసుపత్రిలో సిగరెట్ తాగుతూ రీల్స్ తయారు చేస్తున్నాడని ఎద్దేవా చేశారు.

కాగా... బీహార్‌ లో జన్ సురాజ్ పార్టీ మద్దతుదారు దులార్ చంద్ యాదవ్ హత్య కేసులో అనంత్ సింగ్‌ ను పోలింగ్‌ కు ముందు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ.. 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మోకామా నియోజకవర్గం నుండి పోటీ చేసిన అనంత్ సింగ్ విజయం సాధించారు. జెడి(యు) టికెట్‌ పై పోటీ చేసిన సింగ్.. ఆర్జేడీకి చెందిన వీణా సింగ్‌ పై 28,206 ఓట్ల తేడాతో గెలుపొందారు.

బీహార్ రాజకీయాల్లో ప్రభావవంతమైన, వివాదాస్పద బలవంతుల కోటగా మొకామా నియోజకవర్గం చాలా కాలంగా ప్రసిద్ది చెందింది. అనంత్ సింగ్ తో పాటు అతని సోదరుడు దిలీప్ సింగ్, సూరజ్‌ భాన్ సింగ్‌ లు ఈ నియోజకవర్గం నుండి ఉద్భవిస్తున్న అత్యంత ప్రముఖ వ్యక్తులుగా నిలుస్తున్నారు.




Tags:    

Similar News