నితీష్ ఉప ప్రధాని?: బీజేపీ భారీ స్కెచ్!?
బీహార్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లో పెను మార్పులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. 243 అసెంబ్లీ స్థానాలు ఉన్న అతి పెద్ద రాష్ట్రంలో పాగా వేసేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది.;
బీహార్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లో పెను మార్పులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. 243 అసెంబ్లీ స్థానాలు ఉన్న అతి పెద్ద రాష్ట్రంలో పాగా వేసేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. అధికారంలోకి వచ్చేందుకు అనుకూ ల సమీకరణలన్నీ పరిశీలిస్తోంది. ఇప్పటికే ఎన్డీయే కూటమిగా సుశాన్‌బాబు(మంచిపాలనా దక్షుడు)గా పేరున్న సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూతో జట్టుకట్టిన కమల నాథులు.. ప్రస్తుత ఎన్నికల పర్వంలో తమ సత్తా చాటేందుకు ప్రయత్ని స్తున్నారు. అయితే.. అధికారంలోకి రావడం ఖాయమని భావిస్తున్న కమల నాథులు.. కీలకమైన సీఎం సీటుపైనే కన్నేశారు.
ఎందుకంటే.. ఎంత అధికారంలోకి వచ్చినా.. ముఖ్యమంత్రి పీఠమే కీలకమన్న విషయం తెలిసిందే.మహారాష్ట్రలోనూ శివసేన (షిండే)తో జట్టుకట్టి అధికారంలోకి వచ్చిన బీజేపీ ముఖ్యమంత్రి పీఠంపై మంకుపట్టుబట్టి.. చివరకు ఆయనను ఒప్పించి. డిప్యూ టీ సీఎం పదవికి పరిమితం చేసింది. ఈ క్రమంలోనే బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చో బెట్టింది. ఇప్పుడు ఇదే ఫార్ములలో బీహార్‌లోనూ రాజకీయాలు చేయాలని అనుకున్నా.. సుశాన్ బాబు అంత తేలికగా ఒప్పు కొనే ఘటం కాదు. పైగా తన సొంత సామాజిక వర్గం `కుర్మి` కూడా నితీష్‌ను డిప్యూటీ సీఎంగా చూడాలని అనుకోవడం లేదు.
అలాగని నితీష్‌తో వైరం పెట్టుకుంటే.. కేంద్రంలోనే కూలిపోయే ప్రమాదం కమల నాథులను వెంటాడుతోంది. ప్రస్తుతం 12 మంది ఎంపీలే నితీష్‌కు ఉన్నా..వారు లేకపోతే.. మోడీ సర్కారు డోలాయమానంలో పడుతుంది. కాబట్టి.. సీఎం సీటుపై బీజేపీకి ఆశలు ఉన్నా.. దానిని దక్కించుకునేందుకు మాత్రం నేరుగా ఢీ అంటే చపల చిత్తుడైన నితీష్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యం లేదు. ఈ నేపథ్యంలో బీజేపీ కోరిక నెరవేరాలంటే.. ముందున్న ఏకైక మార్గం.. ఒక్కటే. అదే.. నితీష్‌ను జాతీయ రాజకీయాల్లోకి తీసుకుని.. ఆయనకు దీటైన పదవిని అప్పగించడమే!. అది కూడా.. నితీష్ గౌరవానికే కాదు.. కుర్మి సామాజిక వర్గానికి కూడా మేలు చేసేలా ఉండాలి.
ఈ క్రమంలోనే ఉప ప్రధాని పోస్టుకు నితీష్ పేరును పరిశీలిస్తున్నట్టు బీజేపీ జాతీయ వర్గాల్లో అంతర్గత చర్చ సాగుతోంది. తాజా గా ఈ విషయంపై ఒక నిర్ణయం తీసుకునే దిశగా ప్రధాని స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు. దీనికి ఎలానూ.. నితీష్ ఓకే చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే.. వయసు రీత్యా, అనారోగ్య సమస్యల రీత్యా.. ఆయన సీఎంగా కంటే కూడా.. ఉప ప్రధానిగా ఉంటే కొంత వరకు నెట్టుకురావడంతోపాటు.. దేశవ్యాప్తంగా కూడా పేరు మార్మోగుతుంది. ఇదేసమయంలో బీజేపీతో కలిసి అధికారంలోకి తన కుమారుడు లేదా కుమార్తెను తీసుకువచ్చి.. ఉప ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టే అవకాశం కూడా ఉంటుంది.
సో.. ఏతావాతా ఎలా చూసుకున్నా.. అటు బీజేపీకి, ఇటు నితీష్‌కు కూడా ఉభయ కుశలోపరిగా ఉంటుందన్న వాదన బలంగా వినిపిస్తోంది. అంతేకాదు.. నితీష్‌ను ఉప ప్రధానిగా ప్రకటిస్తే.. ఆయన వర్గంతోపాటు.. మహిళలు కూడా బీజేపీ కూటమికి పూర్తిగా మద్దతు ఇచ్చే అవకాశం ఉందన్న చర్చ కూడా సాగుతోంది. సో.. ఎలా చూసుకున్నా.. రాజకీయాల్లో వ్యూహాలు అలానే ఉంటాయి మరి. ఏదైనా జరగొచ్చు. చూడాలి మరి మోడీ మంత్రాంగం.. నితీష్ తంత్రాంగం ఎలాంటి కీలక మలుపు తిరుగుతుందో!.