బీహార్ పోరు...హెలికాప్టర్లు మూడింతలు ఎగురుతాయట !

బీహార్ ఎన్నికలు దగ్గరలోకి వచ్చేశాయి. అక్టోబర్ చివరిలో కానీ నవంబర్ మొదటి వారంలో కానీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని అంటున్నారు.;

Update: 2025-09-09 04:00 GMT

బీహార్ ఎన్నికలు దగ్గరలోకి వచ్చేశాయి. అక్టోబర్ చివరిలో కానీ నవంబర్ మొదటి వారంలో కానీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని అంటున్నారు. గట్టిగా చూస్తే రెండు నెలల సమయం కూడా లేదు. ఇదిలా ఉంటే బీహార్ లో ఎన్నికల వేడి రాజుకుంది. ఈ మధ్యనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓటర్ అధికార యాత్ర పేరుతో ఏకంగా పదిహేను రోజుల పాటు బీహార్ లోని కీలక ప్రాంతాలను చుట్టేసి వచ్చారు. ఈ విధంగా ఎన్నికల ప్రచారానికి ఆయన శ్రీకారం చుట్టారు. మరో వైపు చూస్తే ఈ మధ్యనే అనేక ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోడీ బీహార్ నుంచి ప్రారంభించారు. బీహార్ ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం డబుల్ ఇంజన్ సర్కార్ వల్లనే సాధ్యపడుతుంది అని మోడీ చెప్పారు.

భారీ ఎత్తున ప్రచారం :

ఈసారి చూస్తే కనుక అధికారంలో ఉన్న ఎన్డీఎ సర్కార్ కి విపక్షంలో ఉన్న మహా ఘట్ బంధన్ కి మధ్య భీకరమైన పోరు సాగనుంది. ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాలని ఆర్జేడీ కాంగ్రెస్ కమ్యూనిస్టులతో ఉన్న మహా ఘట్ బంధం చూస్తూంటే తమ అధికారాన్ని మరో అయిదేళ్ళ పాటు నిలబెట్టుకోవాలని ఎన్డీయే చూస్తోంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కి ప్రధాని నరేంద్ర మోడీ తోడుగా ఉంటూ ఈసారి ఎన్నికల ప్రచారాని పరుగులు పెట్టిస్తారు అని బీజేపీ నేతలు చెబుతున్నారు. మాకు జనం తోనే నేరుగా అనుసంధానం ఉంది అయినా ధీటైన ప్రచారం చేస్తామని ఆర్జేడీ నేతలు చెబుతున్నారు.

రోజుకు ఇరవై హెలికాప్టర్లు !

ఇదిలా ఉంటే ఈసారి బీహార్ ఎన్నికల ప్రచారం కొంత పుంతలు తొక్కనుంది అని అంటున్నారు. రాజకీయ పార్టీలు అన్నీ కూడా ముందుగానే హెలి కాప్టర్లను బుక్ చేసుకోవడం బట్టి చూస్తూటే ప్రచారం అంతా గగన తలం నుంచే అని అంటున్నారు. 2020 ఎన్నికల్లో ఇంతటి హంగామా లేదని అంటున్నారు. పైగా అపుడు కరోనా ఉంది. దాంతో ఒక పద్ధతిలో మితంగానే ప్రచారం చేశారు. అప్పట్లో అయిదారు హెలికాప్టర్లు మొత్తం రాజకీయ పక్షాల నుంచి ఎగిరాయి. ఈసారి ఆ సంఖ్య మూడింతలు కాబోతోంది అని అంటున్నారు. ఒక్క ఎన్డీఎ నే దాదాపుగా పన్నెండు నుంచి పద్నాలుగు దాకా హెలి కాప్టర్లను వాడబోతోంది అని అంటున్నారు. ఇక విపక్ష మహా ఘట్ బంధన్ అయితే ఆరేడు హెలికాప్టర్లను వాడుతుందిట. అందులో కాంగ్రెస్ రెండు నుంచి మూడు అయితే మిగిలినవి ఆర్జేడీ వినియోగిస్తుంది అని అంటున్నారు.

ఎక్కువ కవర్ చేయాలనే :

బీహార్ లో ప్రతీ ప్రాంతాన్ని కవర్ చేయాలని అన్ని రాజకీయ పార్టీలు నిర్ణయించుకున్నాయి. రోజుకు కనీసం అయ్హిదారు సభలలో ప్రధాన నాయకులు పాల్గొనాలని కూడా యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. దాంతో ఈసారి బీహార్ అంతా ప్రచారంతో హోరెత్తిపోనుంది. ఇక నాయకులను సాధ్యమైనంత వేగంగా జనంలోకి తీసుకుని వెళ్ళడానికి హెలికాప్టర్లు బాగా ఉపయోగపడతాయని అంటున్నారు. అయితే వీటి వ్యయమే ప్రతీ రోజూ కనీసంగా పదిహేను లక్షల దాకా ఒక్క పార్టీకి ఉండొచ్చు అని అంటున్నారు. ఈ లెకక్న పదిహేను రోజుల ప్రచారానికి కోట్లు హెలికాప్టర్ల కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది అని అంటున్నారు. అత్యంత ఖరీదైన ఎన్నికగా ఈసారి బీహార్ నిలిచే అవకాశం ఉంది అని అంటున్నారు.

Tags:    

Similar News