మోడీ వ్యూహానికి మోకరిల్లిన.. రాహుల్.. తేజస్వి.. !
''బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మాదే విజయం. ఈ సారి గెలుపుగుర్రం మాదే. వచ్చీ రాగానే రెండు మాసాల్లోనే ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాం. ఇంటికో ఉద్యోగి వస్తాడు.;
''బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మాదే విజయం. ఈ సారి గెలుపుగుర్రం మాదే. వచ్చీ రాగానే రెండు మాసాల్లోనే ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాం. ఇంటికో ఉద్యోగి వస్తాడు. ప్రస్తుతకాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తాం. ప్రతి ఇంటికీ ఫలాలు అందిస్తాం. ప్రతి నెలా రూ.3000 మహిళల ఖాతాలో వేస్తాం.''- ఇవీ ఇతమిత్థంగా బీహార్ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు.. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని మహాగఠ్ బంధన్ ఇచ్చిన భారీ హామీలు. ఇవి సాకారం అవుతాయా? అన్న ప్రశ్నను పట్టించుకోలేదు.
ఇదేసమయంలో.. ``బీజేపీ చేస్తున్న మత దాడి నుంచి.. విధ్వంసాల నుంచి రక్షించుకునేందుకు యువత కు తుపాకులు ఇస్తాం'' అని కూడా మహాగఠ్ బంధన్‌లో కీలకమైన ఆర్జేడీ పార్టీ నాయకులు ప్రచారం చేశా రు. అయితే.. ఇవేవీ ప్రజలకు ఎక్కలేదు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నుంచి బీజేపీ అగ్రనాయకులు.. జేపీ నడ్డా, అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా పలువులు చేసిన ప్రసంగాలకు ఫిదా అయ్యారు. ``ఇంటికో ఉద్యోగం కాదు.. ఇంటికో పరిశ్రమను అందిస్తాం. ఇంటికో లక్షాధికారిని చేస్తాం'' అన్న హామీని బీహారీలు విశ్వసించినట్టుగా ఉన్నారు.
దీంతో గతంలో ఎన్నడూ చవి చూడని పరాభవం.. ఆర్జేడీకి.. అసలు ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేసి న కాంగ్రెస్‌కు మరింత నేల చూపులు చూడాల్సిన దుస్థితి దాపురించింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఎన్నికలకు ముందు ఓట్ చోరీ యాత్ర చేపట్టారు. అదేవిధంగా బీహార్‌లో 65 లక్షల ఓట్లు దొంగించారని కూడా ఆరోపించారు. అయినా.. ఆయన ప్రయత్నాలు సఫలం కాలేదు. ఇదేసమయంలో మోడీ ప్రయోగించిన.. ''ల్యాప్ టాప్ కావాలా? తుపాకీ కావాలా?`` అన్న నినాదం గ్రామ గ్రామానికి చేరింది. ఫలితం... మోడీనే ఊహించనంతగా ఓటరు పోటెత్తారు. ఎన్డీయేకు కలలో కూడా ఊహించని విధంగా పట్టం కట్టారు.
ఈ ఫలితం సాధారణమేమీ కాదు.. అసాధారణం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌కు.. ఆ పార్టీకి కూడా పెద్ద శరాఘాతమేనని అంటున్నారు పరిశీలకులు. కేవలం 27-28 స్థానాలకు మహాగఠ్ బంధన్ పరి మితమైన దరిమిలా.. ప్రధాన ప్రతిపక్షం దక్కినా.. అది బొటాబొటిగానే ఉండనుంది. కానీ.. ఇక్కడ తెలుసుకోవాల్సినవి.. తేల్చుకోవాల్సినవి.. చాలానే ఉన్నాయి. తమ కంచుకోటల్లోకి బీజేపీ చొచ్చుకు వచ్చేసింది. అంతేకాదు.. ముస్లిం మైనారిటీలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లోనూ కమల వికాసం సాధ్యమైంది. ఇవన్నీ.. రాహుల్‌కు, తేజస్వికి పెద్ద పాఠాలేనని చెప్పాలి.
ముఖ్యంగా అభివృద్ధి మంత్రం.. ఇంటికో పారిశ్రామిక వేత్త నినాదం ముందు మహాగఠ్ బంధన్ ఇచ్చిన ఓట్ చోరీ అంశం పేలవంగా మారింది. అంతేకాదు.. ప్రస్తుత పరిస్థితిని అర్ధం చేసుకోవడంలోనూ యువ నేతలు తేజస్వి, రాహుల్ వెనుకబడ్డారు. నితీష్‌ను ఆరోగ్య కారణాలు చూపి ఏవగించిన తీరు ఆయనపై సింపతీని పెంచేసింది. ఇది మరీ ముఖ్యంగా భారీ విజయానికి కారణమన్న విశ్లేషణలు వస్తున్నాయి. ఎలా చూసుకున్నా.. బీహార్ విజయం.. నరేంద్ర మోడీ వ్యూహం.. ముందు తేజస్వి, రాహుల్ మోకరిల్లక తప్పలేదు.