నితీష్ సీఎం కానీ...కొత్త చిక్కులు ?

బీహార్ సీఎం ఎవరు అన్నది ఇపుడు జాతీయ స్థాయిలో ఆసక్తి రేపుతున్న అంశం. ఎందుకంటే బీహార్ తో ధూం ధాం గా ఎన్డీయే గెలిచింది.;

Update: 2025-11-16 07:30 GMT

బీహార్ సీఎం ఎవరు అన్నది ఇపుడు జాతీయ స్థాయిలో ఆసక్తి రేపుతున్న అంశం. ఎందుకంటే బీహార్ తో ధూం ధాం గా ఎన్డీయే గెలిచింది. మొత్తం బీహార్ రాజకీయ చరిత్రలోనే కనీ వినీ ఎరగని విధంగా అత్యద్భుతమైన విజయాన్ని సాధించింది. ఏకంగా 202 సీట్లతో అప్రతిహతమైన గెలుపుని సొంతం చేసుకుంది. ఇక ఫలితాలు వచ్చి రెండు రోజులు గడిచిపోయాయి. బీహార్ కొత్త సీఎం ఎవరు అన్నది మాత్రం ఇంకా సస్పెన్స్ గానే ఉంది. సహజంగానే చూస్తే కనుక నితీష్ కుమార్ బీహార్ సీఎం కావాలి. అయితే ఎన్నికల ముందు వచ్చిన వార్తలను కనుక క్షుణ్ణంగా పరిశీలన చేస్తే బీజేపీకి తమ పార్టీ నుంచి ఒకరిని సీఎం గా చేయాలని ఆశలు ఉన్నాయని అర్థం అవుతోంది. అయితే అది అనుకున్నత ఈజీగా జరిగేనా అన్నదే ఇక్కడ కీలకమైన పాయింట్.

నితీష్ అవసరం :

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రెండు ఊత కర్రల సాయంతో నడుస్తోంది అన్నది అందరికీ తెలిసిందే ఒకటి ఏపీలోని టీడీపీకి ఉన్న 16 మంది ఎంపీల మద్దతుతో, రెండవది బీహార్ లో నితీష్ కుమార్ నాయకత్వంలోని జేడీయూకి ఉన్న 12 మంది ఎంపీల బలంతో. బీహార్ లో కనుక బీజేపీ ఏమైనా రాజకీయ ప్రయోగాలు చేస్తే కనుక ఆ ప్రభావం కచ్చితంగా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం మీద పడుతుంది. వ్యూహాలలో నితీష్ ని సైతం ఎవరూ తక్కువ అంచనా వేయడానికి అయితే లేదు. ఆయన తిమ్మిని సైతం బమ్మిగా చేయగలరు. ఈ నేపధ్యంలో నితీష్ కుమార్ విషయంలో బీజేపీ ఆచీ తూచీ అడుగులు వేయాల్సి ఉంది.

బీజేపీ ప్లాన్స్ :

ఆ విధంగానే ప్రస్తుతం బీజేపీ ఆలోచనలు సాగుతున్నాయని అంటున్నారు. బీజేపీ ముఖ్యమంత్రి పదవిని తీసుకుంటే నితీష్ కుమార్ నుంచి ఏ రకమైన సహకారం దక్కుతుంది అన్నది ఒక ప్రశ్న. అందుకే ఆ రకమైన ప్రయత్నాలను ప్రస్తుతానికి పక్కన పెట్టి నితీష్ కుమార్ కే పగ్గాలు అప్ప్పగించే యోచనలో బీజేపీ పెద్దలు ఉన్నట్లుగా చెబుతున్నారు. అయితే బీహార్ లో పాలన మొత్తం తమ అధీనంలో ఉండేలా తమ కనుసన్ననలో సాగేలా మాత్రం బీజేపీ పక్కా ప్లాన్ ని అయితే రెడీ చేస్తోంది.

ఇవీ బలాలు :

బీహార్ విషయంలో తీసుకుంటే బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఆ పార్టీకి 89 సీట్లు దక్కాయి. జేడీయూకు 85 సీట్లు లభించాయి. ఇక మిత్ర పార్టీలు అయిన ఎల్జేపీకి 19, ఆర్ఎల్ఎంకు నాలుగు సీట్లు, హెచ్ఏఎం(ఎస్) కు అయిదు సీట్లు స్థానాలు లభించాయి. బీహార్ లో సర్కార్ ఏర్పాటు చేయాలీ అంటే 122 మ్యాజిక్ ఫిగర్. ఈ లెక్కన జేడీయూతో సంబంధం లేకుండా బీజేపీ ఇతర మిత్రులను కలుపుకుని సర్కార్ ని ఏర్పాటు చేయాలంటే ఈ బలానికి కేవలం అయిదు సీట్ల దూరంలోనే ఆగిపోతుంది అయితే బీజేపీ తలచుకుంటే ఆ అయిదారు సీట్లను పూడ్చుకోవడం ఏమంత కష్టం అయితే కాదు. కానీ ముందే చెప్పుకున్నట్లుగా నితీష్ కుమార్ ని పక్కన పెడితే అది కేంద్రంలోనే గట్టిగా సెగలూ పొగలూ రేగే చాన్స్ ఉంది. అందుకే ఆయనకే సీఎం పీఠం అప్పగించడం బీజేపీకి అనివార్యమే కాదు, రాజకీయ వ్యూహంలో భాగం కూడా అని అంటున్నారు.

పేరుకే సీఎం గా :

ఇక బీహార్ సీఎం గా ఐదవసారి నితీష్ కుమార్ పీఠమెక్కేందుకు బీజేపీ నుంచి క్లియరెన్స్ అయితే ఇస్తారనే అంటున్నారు. అయితే నితీష్ కుమార్ మాత్రం మునుపటి మాదిరిగా పూర్తి స్వేచ్చగా ఏ మేరకు పనిచేయగలరు అన్నదే మరో ప్రశ్న. బీజేపీ అత్యంత బలంగా ఉంది. మిత్రులు కూడా ఆ పార్టీతోనే ఉంటారు. నితీష్ కుమార్ పేరుకు సీఎం గా ఉన్న ప్రధాన నిర్ణయాలు అన్నీ బీజేపీ ద్వారానే జరిగిపోతాయని ప్రచారం సాగుతోంది. ఇక నితీష్ కుమార్ సీఎం పదవి కూడా దిన దిన గండంగా ఉండబోతోందా అన్నది మరో చర్చ. ఎందుకు అంటే బీజేపీ నితీష్ కుమార్ ని వద్దు అనుకున్నపుడు ఏమైనా చేసే సీన్ అయితే బీహార్ లో ఉంది. పైగా గతంలో అనేక రాష్ట్రాలలో బీజేపీ ఎత్తులు వ్యూహాలు అందరూ చూసినవే. దాంతో నితీష్ చాలా జాగ్రత్తగానే బీజేపీతో వ్యవహరించాల్సి ఉందని అంటున్నారు.

అప్పటిదాకానేనా :

అయితే ఎంతగా తగ్గి వ్యవహరించినా నితీష్ కుమార్ ముఖ్యమంత్రిత్వం గరిష్టంగా మూడేళ్ళ ముచ్చటగానే ముగిసే అవకాశం ఉందని అంటున్నారు. 2029 ఎన్నికలలో కనుక బీజేపీ పూర్తి మెజారిటీని సాధించి కేంద్రంలో మరోమారు అధికారంలోకి వస్తే అపుడు బీహార్ లో బీజేపీ సీఎం కచ్చితంగా వస్తారు అని అంటున్నారు. ఎందుకంటే బీహార్ లో ఎన్నికలు తిరిగి 2030 నవంబర్ లోనే జరుగుతాయి. బీజేపీ సీఎం అక్కడ నుంచి మరో ఏణ్ణర్ధం పాటు పాలించే వెసులుబాటు ఉంటుంది. ఇలా అనేక రకాలైన ఆలోచనల నడుమ బీహార్ కొత్త సీఎం గా నితీష్ కే ఎక్కువ చాన్స్ ఉంది అని అంటున్నారు. ఏదైనా అనూహ్య పరిణామం చోటు చేసుకుంటే తప్ప బీహార్ కి అయిదో సారి సీఎం గా నితీష్ ప్రమాణం చేయడం ఖాయం అని అంటున్నారు.

Tags:    

Similar News