పరకామణి కేసులో భూమనకు సిట్ పిలుపు.. హైటెన్షన్ లో వైసీపీ?
పరకామణి చోరీ కేసులో విచారణకు రమ్మంటూ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది.;
పరకామణి చోరీ కేసులో విచారణకు రమ్మంటూ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ రోజు సాయంత్రమే ఆయన విచారణకు హాజరుకావాల్సివుంది. హైకోర్టు ఆదేశాలతో పరకమాణిలో చోరీపై సీఐడీ సిట్ దర్యాప్తు జరుపుతోంది. వచ్చేనెల 2లోగా ఈ వ్యవహారంపై హైకోర్టుకు నివేదిక సమర్పించాల్సివుంది. విచారణ సమయంలోనే కీలక సాక్షి, చోరీ కేసులో ఫిర్యాదుదారు, అప్పటి ఏవీఎస్వో సతీష్ కుమార్ మరణంతో సిట్ దర్యాప్తునకు కొన్నాళ్లు బ్రేకులు పడ్డాయి. ఈ పరిస్థితుల్లో మళ్లీ విచారణ మొదలుపెట్టిన సిట్ అప్పటి విజిలెన్స్ విభాగంలో పనిచేసిన అధికారులతోపాటు టీటీడీ చైర్మనుగా ఉన్న భూమన కరుణాకరరెడ్డిని విచారించేందుకు నిర్ణయించింది.
పరకామణిలో చోరీపై దర్యాప్తు చేస్తున్న సిట్ గత రెండు రోజులుగా టీటీడీ వీజీవో గిరిధర్ తోపాటు మరికొందరిని ప్రశ్నించారు. సీఐడీ అదనపు డీజీ రవిశంకర్ అయ్యాన్నార్ స్వయంగా కేసు విచారణను పర్యవేక్షిస్తున్నారు. ఏవీఎస్వో మరణం తర్వాత ఈ కేసులో ఎలా ముందుకు వెళతారన్న చర్చల నేపథ్యంలో అప్పటి టీటీడీ చైర్మనుతోపాటు ఇతర అధికారులకు నోటీసులు జారీ చేయడంపై ఉత్కంఠ కనిపిస్తోంది. పరకామణిలో 920 అమెరికన్ డాలర్లను చోరీ చేస్తూ పట్టుబడిన రవికుమార్ పై 2023 ఏప్రిల్ లో కేసు నమోదైంది. ఈ కేసును రాజీ చేసుకోవడం వివాదానికి దారితీసింది. ఎవరి సూచనలతో కేసును రాజీ చేసుకున్నారనేదే ఈ కేసులో కీలకాంశంగా భావిస్తున్నారు. ఆ విషయం చెప్పాల్సిన ఏవీఎస్వో హత్యకు గురికావడంతో కేసుపై చిక్కుముడి పడిందని అంటున్నారు.
అయితే, ఎవీఎస్వో హత్య జరిగిన తర్వాత కొద్దిరోజులు దర్యాప్తును నిలిపేసిన సిట్.. మళ్లీ విచారణను స్టార్ట్ చేయడం, టీటీడీ మాజీ చైర్మను, వైసీపీ నేత భూమనను ప్రశ్నించాలని నిర్ణయించడం తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ఈ విషయంలో భూమనను ఏ అంశాలపై ప్రశ్నిస్తారనేది ఉత్కంఠ రేపుతోంది. పరకామణి చోరీ సమయంలో భూమన చైర్మనుగా లేరని చెబుతున్నారు. కానీ, కేసు రాజీ సమయంలో ఆయనే చైర్మనుగా ఉన్నారని అధికార పార్టీ వాదిస్తోంది. ఈ అంశంలో తనకు ఎలాంటి సంబంధం లేదని భూమన వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో సిట్ ఆయనను ప్రశ్నించాలని అనుకోవడం వేడిపుట్టిస్తోంది.
గతంలో తిరుపతి ఎమ్మెల్యేగా పనిచేసిన భూమన కరుణాకరరెడ్డి 2023 ఆగస్టులో టీటీడీ చైర్మనుగా నియమితులయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేవరకు ఆయనే చైర్మనుగా పనిచేశారు. అయితే కరుణాకరరెడ్డి చైర్మనుగా బాధ్యతలు స్వీకరించకముందు చోరీ జరిగినా, ఆయన చైర్మనుగా ఉన్నప్పుడే చోరీ కేసు రాజీ జరిగింది. దీంతో భూమన పాత్రపై అనుమానాలు వ్యక్తం చేస్తూ అధికార పక్షం ఆరోపణలు చేస్తోంది. ఇన్నాళ్లు తనపై వస్తున్న ఆరోపణలను తోసిపుచ్చుతున్న భూమన.. అధికార పక్షంపై ఎదురుదాడి చేశారు. ఇప్పుడు ఈ విషయమై విచారణకు హాజరవుతున్నందున ఆయన ఏం చెబుతారు? అన్నది ఆసక్తి రేపుతోంది.