మాకు భీమిలీ టికెట్ కావాలి

విశాఖ జిల్లాలో భీమునిపట్నం అసెంబ్లీ నియోజకవర్గం కీలకమైనది. ఇపుడు చూస్తే హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ మాదిరిగా ప్రాధాన్యత కలిగిన నియోజకవర్గం గా మారుతోంది.;

Update: 2025-12-16 03:57 GMT

విశాఖ జిల్లాలో భీమునిపట్నం అసెంబ్లీ నియోజకవర్గం కీలకమైనది. ఇపుడు చూస్తే హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ మాదిరిగా ప్రాధాన్యత కలిగిన నియోజకవర్గం గా మారుతోంది. ఐటీ కంపెనీలు అన్నీ ఒకే చోటకు వస్తున్నాయి. నగరం విస్తరించి ముందుకు సాగుతోంది. భోగాపురం ఎయిర్ పోర్టు పూర్తి అయి ఆరు లైన రోడ్డు పడితే ఏవియేషన్ వర్శిటీ వస్తే కనుక భీమిలీ స్వరూపమే మారిపోతుంది అన్న చర్చ ఉంది. ఈ నేపథ్యంలో రాజకీయంగా కూడా భీమిలీ మీద పట్టు సాధించేందుకు అనేక మంది ప్రయత్నాలు చేస్తున్నారు.

బలమైన సామాజిక వర్గం :

భీమిలీలో బలమైన సామాజిక వర్గంగా నాగవంశీకులు ఉన్నారు. వీరి జనాభా భీమిలీ పట్టణం, భీమిలీ మండలం, అలాగే పద్మనాభం మండలంలో ఎక్కువగా ఉంది. గతంలో చూస్తే వీరు రాజకీయంగా చక్రం తిప్పుతూ ఉండేవారు. నిజానికి ఈ సామాజిక వర్గం మున్సిపాలిటీగా భీమిలీ ఉన్నపుడు హవా చలాయించేది. కీలక పదవులు అందుకునేది. మండలంలోనూ వారి రాజకీయాలు ఒక స్థాయిలో సాగేవి. అయితే వారి ఆశలు మాత్రం ఎమ్మెల్యే ఎంపీ సీట్లలో నెగ్గలేదు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎమ్మెల్యే టికెట్ అలా :

వాస్తవానికి తెలుగుదేశం పార్టీ పెట్టిన కొత్తలో భీమునిపట్నం ఎమ్మెల్యే టికెట్ నాగవంశీ కుల కే దక్కింది. వారి నుంచి మునిసిపాలిటీలో వైస్ చైర్మన్ గా ఉన్న ఒక నాయకుడికి ఈ టికెట్ ఇవ్వాలని స్వయంగా అధినాయకత్వం నిర్ణయించింది. అయితే మధ్యలో జరిగిన అనేక ఇతర సామాజిక సమీకరణల మూలంగా ఆ టికెట్ జారిపోయింది. అప్పటి నుంచి ఎన్నికలు ఎపుడు వచ్చినా తమకు టికెట్ ఇవ్వాలని నాగవంశీకులు కోరుతూ వస్తున్నారు. తాజాగా భీమిలీలో రాష్ట్ర స్థాయి నాగవంశీకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు డిమాండ్లు వారి నుంచి వచ్చాయి.

అసెంబ్లీ లేదా పార్లమెంట్ :

నియోజకవర్గంలో బలంగా ఉన్న తమ సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యే లేదా ఎంపీ టికెట్ ని అర్హులు ఎవరికైనా ఇవ్వాలని వారు కోరుతున్నారు అలాగే విశాఖ కార్పోరేషన్ ఎన్నికల్లో మేయర్ పదవిని తమకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. తమలోనూ అనేక మంది సమర్ధులు ఉన్నారని అన్ని సామాజిక వర్గాలకు అవకాశాలు ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఎపుడూ ఒకటి రెండు కులాలకే పదవులు ఇస్తూ పోతే మిగిలిన వారికి సామాజిక న్యాయం జరిగేది ఎపుడు అని వారు నిలదీస్తున్నారు.

ప్రధాన పార్టీలకే :

నాగ వంశీకుల ఈ డిమాండ్ ప్రధాన పార్టీలకు సవాల్ గా మారనుంది అని అంటున్నారు. దాదాపుగా మూడు లక్షలకు పైగా జనాభా ఉన్న భీమిలీ అసెంబ్లీ ఏపీలోనే అతి పెద్దది. అంతే కాదు ఎన్నో బలమైన సామాజిక వర్గాలు ఉన్నాయి. అయితే వారికి ఎక్కడో ఒకచోట ఎమ్మెల్యే సీటు దక్కుతోంది. కానీ నాగవంశీకులకు మాత్రం ఎకామిడేట్ చేయలేకపోతున్నారు అని అంటున్నారు దాంతో ఈసారి వారు గట్టిగానే పట్టుబడుతున్నారు. స్థానిక ఎన్నికల నుంచి సార్వత్రిక ఎన్నికల దాకా వారు పట్టు పెంచుకోవాలని చూస్తున్నారు. మరి ఇది ప్రధాన రాజకీయ పార్టీలకు సవాల్ అని అంటున్నారు.

Tags:    

Similar News