రెస్టారెంట్‌లో కేక్ కటింగ్ బిల్ రూ.9000.. గుండె జారిన కస్టమర్
తాజాగా బెవర్లీ హిల్స్‌లోని ఒక లగ్జరీ రెస్టారెంట్‌లో ఎదురైన చేదు అనుభవం ఇప్పుడు నెటిజన్ల మధ్య హాట్ టాపిక్‌గా మారింది.
నేటి సోషల్ మీడియా యుగంలో ఒక రెస్టారెంట్ బిల్లులోని చిన్నపాటి వివరాలు కూడా ఒక్కోసారి అంతర్జాతీయంగా పెద్ద చర్చకు దారితీస్తుంటాయి. తాజాగా బెవర్లీ హిల్స్‌లోని ఒక లగ్జరీ రెస్టారెంట్‌లో ఎదురైన చేదు అనుభవం ఇప్పుడు నెటిజన్ల మధ్య హాట్ టాపిక్‌గా మారింది. అక్కడ ఒక సాధారణ డిన్నర్ బిల్లులో వేసిన అదనపు సర్వీస్ ఛార్జీలు చూసి సదరు కస్టమర్ షాక్ తిన్నారు. ఆ బిల్లు రశీదు కాస్తా ఇంటర్నెట్‌లో వైరల్ కావడంతో అసలు రెస్టారెంట్లలో ఇలాంటి హిడెన్ ఛార్జీల వసూళ్లు ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు మొదలయ్యాయి.
ప్రముఖ ఫుడ్ ఇన్‌ఫ్లుయెన్సర్ జస్టిన్ లవ్ సుశి సోషల్ మీడియాలో దీనిని పోస్ట్ చేయడంతో వివాదం మొదలైంది. ఆమె బెవర్లీ హిల్స్‌లోని పోజా అనే రూఫ్‌టాప్ రెస్టారెంట్‌కు తన స్నేహితులతో కలిసి డిన్నర్ కోసం వెళ్లారు. అక్కడ వారు తిన్న ఆహారానికి మొత్తం బిల్లు 1100 డాలర్లు (సుమారు రూ.90,000 పైమాటే) దాటింది. అయితే ఆ బిల్లులో ప్రత్యేకంగా చేర్చిన `కేక్ కటింగ్` ఫీజు చూసి ఆశ్చర్యపోయారు. బయటి నుండి తెచ్చిన కేక్ కట్ చేసినందుకు గానూ ఆ రెస్టారెంట్ యాజమాన్యం అదనంగా ఏకంగా 110 డాలర్లు (సుమారు రూ.9,000) బిల్లులో వేసింది.
రెస్టారెంట్‌లో డిన్నర్ చేసిన గ్రూప్‌లోని ఒక్కో వ్యక్తికి 10 డాలర్ల చొప్పున లెక్కగట్టి మొత్తం 11 మందికి కలిపి ఈ 110 డాలర్ల భారీ ఛార్జీని వసూలు చేశారు. ఈ బిల్లు రశీదు సోషల్ మీడియాలో పోస్ట్ అవ్వడంతో నెటిజన్లు భిన్నాభిప్రాయాలతో రెండు గ్రూపులుగా విడిపోయారు. కొందరు కేవలం కేక్ మీద ఒకసారి చాకుతో గీత గీయడానికి తొమ్మిది వేల రూపాయలు వసూలు చేయడం పిచ్చితనం! అని మండిపడగా.. బయటి నుండి కేకులు తెచ్చినప్పుడు పెద్ద పెద్ద హోటళ్లలో ఇటువంటి ఫీజులు సహజమేనని మరికొందరు సమర్థించారు. ఈ క్రమంలో ``ఇలాంటి దోపిడీ చేసే రెస్టారెంట్‌ను బ్లాక్ లిస్ట్‌లో పెట్టండి`` అనే కామెంట్లు కూడా వెల్లువెత్తాయి.
ఈ రచ్చ కాస్తా వేరే హోటల్ యాజమాన్యాల దృష్టికి కూడా వెళ్లడంతో పారదర్శకతపై సరికొత్త చర్చ మొదలైంది. కస్టమర్ల అనుమతి లేకుండా వారికి ముందే నియమాలు చెప్పకుండా ఇలాంటి ఛార్జీలు వేయడం ముమ్మాటికీ తప్పని అభిప్రాయపడ్డారు. తమ వద్ద కేవలం ఒక వ్యక్తికి 5 డాలర్లు మాత్రమే తీసుకుంటామని.. పెద్ద పార్టీలకైతే ఒక పరిమితి ఉంటుందని గుర్తు చేశారు. కస్టమర్‌కు ముందే సమాచారం ఇవ్వకుండా సర్వీస్ చేసినప్పుడు... వారు ఆ డబ్బును వెనక్కి డిమాండ్ చేసే హక్కు ఉంటుందని స్పష్టం చేశారు.
చివరికి సోషల్ మీడియాలో విమర్శలు ముదరడంతో `పోజా` రెస్టారెంట్ యాజమాన్యం దిగివచ్చి బహిరంగంగా క్షమాపణలు చెప్పింది. కస్టమర్ కేక్ తీసుకువచ్చినప్పుడే ఈ ఫీజు గురించి ముందే సమాచారం ఇచ్చి ఉండాల్సిందని అంగీకరించింది. తమ పొరపాటుకు ప్రాయశ్చిత్తంగా సదరు ఇన్‌ఫ్లుయెన్సర్‌కు ఆ 110 డాలర్ల కేక్ కటింగ్ ఫీజును రీఫండ్ చేస్తామని ప్రకటించింది. అంతేకాకుండా భవిష్యత్తులో ఇలాంటి వివాదాలు రాకుండా ఉండేందుకు తమ రెస్టారెంట్ పాలసీని మారుస్తూ కేక్-కటింగ్ ఫీజును ఒక వ్యక్తికి 10 డాలర్ల నుండి 5 డాలర్లకు తగ్గిస్తున్నట్లు వెల్లడించింది.