పేలనున్న బెటెల్‌గేస్‌.. భూమికి ఏమన్నా ప్రమాదమా..?

బెటెల్‌గేస్‌ ఓ సాధారణ నక్షత్రం కాదు. ఇది 'రెడ్‌ సూపర్‌జెయింట్‌' అంటే తన ఇంధనాన్ని దాదాపుగా ఖర్చుచేసుకొని, జీవిత చరమాంకానికి చేరిన అతి భారీ తార.;

Update: 2026-01-07 08:30 GMT

అంతరిక్షంలో మరో అద్భుత ఘటనకు వేళ సమీపిస్తోంది. ఆకాశ వీధిలో ఓ మహా తార తన జీవితాంతానికి చేరువవుతోంది. శాస్త్రవేత్తల దృష్టిని దశాబ్దాలుగా ఆకర్షిస్తున్న ‘బెటెల్‌గేస్‌’ నక్షత్రం త్వరలోనే సూపర్‌నోవాగా మారి పేలిపోనుందన్న అంచనాలు బలపడుతున్నాయి. ఓరియన్‌ నక్షత్రమండలంలో అత్యంత ప్రకాశవంతమైన తారగా గుర్తింపు పొందిన బెటెల్‌గేస్‌ ఇప్పుడు అంతరిక్ష రహస్యాలను విప్పే కీలక స్టార్ గా మారింది.

బెటెల్‌గేస్‌ ప్రత్యేకతలు..

బెటెల్‌గేస్‌ ఓ సాధారణ నక్షత్రం కాదు. ఇది 'రెడ్‌ సూపర్‌జెయింట్‌' అంటే తన ఇంధనాన్ని దాదాపుగా ఖర్చుచేసుకొని, జీవిత చరమాంకానికి చేరిన అతి భారీ తార. సాధారణంగా ఇలాంటి నక్షత్రాలు చివరి దశలో సూపర్‌నోవాగా పేలి, అనంతరం న్యూట్రాన్‌ స్టార్‌ లేదా బ్లాక్‌ హోల్‌గా మారతాయి. బెటెల్‌గేస్‌ కూడా అదే దారిలో సాగుతోందన్న సంకేతాలను హబుల్‌ టెలిస్కోప్‌ తాజాగా మరింత స్పష్టంగా చూపిస్తోంది.

శాస్త్రవేత్తలు ఆకర్షిస్తున్న తార..

ఈ నక్షత్రం శాస్త్రవేత్తలకు అంత ఆసక్తికరంగా ఎందుకు మారిందంటే ఇంత భారీ తార అయినప్పటికీ, ఇది కొన్ని సందర్భాల్లో తోకచుక్కలా కనిపించడం. బెటెల్‌గేస్‌ ఒక వైపు నుంచి వాయువులు, ధూళి పదార్థాలు విస్తృతంగా బయటికి వెళ్లి, సుదూరాల వరకు తోక మాదిరిగా వ్యాపించి ఉండడం దీనికి కారణం. ఈ దృశ్యం అంతరిక్ష శాస్త్రవేత్తలను చాలాకాలంగా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కొందరు శాస్త్రవేత్తలు, ఇది ఇప్పటికే అంతరించిపోయిన మరో నక్షత్రం ప్రభావాన్ని కూడా తనలో కలుపుకున్నదై ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

భారీ నక్షత్రాలు తమ చుట్టూ ఉన్న అంతరిక్ష వాతావరణంతో ఎలా ప్రతిస్పందిస్తాయో తెలుసుకోవడానికి బెటెల్‌గేస్‌ ఒక 'లైవ్‌ ల్యాబ్‌'లా మారిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ నక్షత్రం నుంచి వెలువడుతున్న పదార్థాలు, వాటిపై పనిచేస్తున్న గురుత్వాకర్షణ శక్తులు, ఇతర నక్షత్రాల ప్రభావం అన్నీ కలిసి సంక్లిష్టమైన దృశ్యాన్ని సృష్టిస్తున్నాయి. హబుల్‌ టెలిస్కోప్‌ తీసిన తాజా పరారుణ చిత్రాలు ఈ విషయాలను మరింత స్పష్టంగా చూపించాయి.

బెటెల్ గేస్ పై చర్చ..

ప్రస్తుతం శాస్త్రవేత్తల మధ్య ఎక్కువగా చర్చకు వస్తున్న అంశం బెటెల్‌గేస్‌ ‘తోక’. ఈ తోక అస్తవ్యస్తంగా వంకర తిరుగుతూ కనిపించడం వెనుక మరో నక్షత్రం గురుత్వ ప్రభావం ఉండొచ్చని వారు భావిస్తున్నారు. ఆ నక్షత్రం ప్రత్యక్షంగా హబుల్‌ కంటికి చిక్కకపోయినా, దాని ప్రభావం మాత్రం బెటెల్‌గేస్‌ నుంచి బయటికి వస్తున్న పదార్థాలపై స్పష్టంగా కనిపిస్తోందని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. ప్రతి అణువు, ప్రతి వాయు సమూహం ఒక బలమైన లాగుడుకు లోనవుతూ విచిత్రమైన ఆకారాలు దాలుస్తోందని వారు చెబుతున్నారు.

ఈ పరిశీలనలకు అంత ప్రాధాన్యం ఎందుకంటే బెటెల్‌గేస్‌ ప్రవర్తనను సరిగా అర్థం చేసుకుంటే, ఇప్పటి వరకు మిస్టరీగా ఉన్న అనేక ఆస్ట్రోఫిజిక్స్‌ ప్రశ్నలకు సమాధానాలు దొరికే అవకాశం ఉంది. భారీ నక్షత్రాలు సూపర్‌నోవాగా పేలినప్పుడు, వాటి నుంచి వెలువడే మూలకాలు కొత్త నక్షత్రాలు, గ్రహాల ఏర్పాటుకు బీజం వేస్తాయి. అంటే మనలాంటి గ్రహాల ఆవిర్భావానికి కూడా ఇలాంటి విస్ఫోటనాలే కారణమవుతాయి.

కొన్నేళ్లుగా గందరగోళానికి గురి చేస్తున్న వైనం..

నిజానికి బెటెల్‌గేస్‌ ప్రవర్తన గత కొన్ని ఏళ్లుగా శాస్త్రవేత్తలను గందరగోళానికి గురిచేస్తూనే ఉంది. 2019–20 మధ్య కాలంలో ఈ తార ఒక్కసారిగా తీవ్రంగా కాంతిని కోల్పోయి దాదాపు కనుమరుగైనట్టుగా కనిపించింది. ఆ సంఘటన అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపింది. అప్పుడే ఇది సూపర్‌నోవాగా మారబోతోందా అన్న చర్చలు జోరందుకున్నాయి. అయితే ఆ మసకబారుడు వెనుక కారణాలు క్రమంగా వెలుగులోకి వచ్చాయి.

పేలుడుపై స్పష్టత ఇవ్వలేమన్న సైంటిస్టులు..

ఇప్పటికీ ఒక విషయం మాత్రం స్పష్టం బెటెల్‌గేస్‌ తన అంతిమ దశకు చేరుకుంటోంది. అది రేపు పేలుతుందా, లేక మరో వెయ్యేళ్ల తర్వాతనా అన్నది ఖచ్చితంగా చెప్పలేమని శాస్త్రవేత్తలే అంటున్నారు. కానీ అది సూపర్‌నోవాగా మారే క్షణం మానవాళికి ఒక అరుదైన ఖగోళ దృశ్యాన్ని అందించనుంది. ఆ పేలుడు మన భూమికి ప్రమాదం కాకపోయినా, అంతరిక్షాన్ని అర్థం చేసుకునే మన ప్రయత్నాలకు మాత్రం అమూల్యమైన సమాచారం అందించనుంది.

అంతరిక్షంలో జరుగుతున్న ఈ నిశ్శబ్ద నాటకం, విశ్వం ఎంత విస్తృతమో, మన అవగాహన ఎంత పరిమితమో మరోసారి గుర్తు చేస్తోంది. బెటెల్‌గేస్‌ కథ ముగింపు దశకు చేరువవుతున్న కొద్దీ, కొత్త ప్రశ్నలు, కొత్త ఆశ్చర్యాలు పుట్టుకొస్తూనే ఉన్నాయి.

Tags:    

Similar News