అమెరికాలో భూకంపం.. భయంతో ప్రజల పరుగులు

ఈ భూకంపం బర్కిలీతో పాటు.. శాన్‌ఫ్రాన్సిస్కో, 161 కిలోమీటర్ల దూరంలో ఉన్న సలినాస్ వంటి ప్రాంతాలలో కూడా స్పష్టంగా కనిపించింది.;

Update: 2025-09-23 06:52 GMT

అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో బే ప్రాంతానికి సమీపంలో ఉన్న బర్కిలీ పట్టణంలో సోమవారం ఉదయం 3 గంటల సమయంలో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై 4.3 తీవ్రతతో నమోదైన ఈ భూప్రకంపనలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేశాయి. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని, ప్రాథమికంగా ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. అయితే ఈ భూకంపం కారణంగా దుకాణాల్లో వస్తువులు కింద పడ్డాయి, కొన్ని కిటికీల అద్దాలు పగిలిపోయాయి.

* భూప్రకంపనల ప్రభావం:

ఈ భూకంపం బర్కిలీతో పాటు.. శాన్‌ఫ్రాన్సిస్కో, 161 కిలోమీటర్ల దూరంలో ఉన్న సలినాస్ వంటి ప్రాంతాలలో కూడా స్పష్టంగా కనిపించింది. ఉదయం వేళలో నిద్రలో ఉన్న ప్రజలు అకస్మాత్తుగా ఇళ్లు కదులుతుండడంతో భయంతో మేల్కొని వీధుల్లోకి పరుగులు తీశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలలో ఇళ్లు, వస్తువులు కదులుతున్న దృశ్యాలు భయానకంగా ఉన్నాయి.

* ప్రభుత్వ చర్యలు

ప్రభుత్వం ఈ ఘటనపై తక్షణమే స్పందించింది. భూకంప కేంద్రం బర్కిలీకి ఆగ్నేయంగా 1.6 కిలోమీటర్ల దూరంలో.. భూమికి 7.7 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు. ప్రజలు ఆందోళన చెందకూడదని, తాజా సమాచారం కోసం ప్రభుత్వం పర్యవేక్షణ కొనసాగిస్తున్నదని అధికారులు తెలిపారు.

కొన్ని రైల్వే మార్గాలలో రైళ్లను తాత్కాలికంగా తక్కువ వేగంతో నడిపించారు. ఈ భూకంపం వల్ల ఎలాంటి పెద్ద నష్టం జరగకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలోని ప్రజలు భయాందోళనలో ఉన్నప్పటికీ, అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు.

Tags:    

Similar News