కొత్త విషయం... క్రైమ్ డిటెక్టివ్ లుగా 'దుప్పట్లో శత్రువులు'!
తాము వీటిని ‘దుప్పట్లో శత్రువు’ అని పిలుస్తామని.. అయితే అవి భవిష్యత్తులో నేరాలను పరిష్కరించడంలో డిటెక్టివ్ లు గా మారతాయని అన్నారు.;
మంచంపై నల్లులు కనిపిస్తే ఆ చికాకే వేరు.. అవి కనిపించిన మరుక్షణం వాటిని చంపేయడమే తక్షణ కర్తవ్యం! అయితే... ఇకపై నల్లులను అలా చూడరంట! ఆ నల్లులు భవిష్యత్తులో అనేక క్రైమ్ కేసుల్లో కీలక డిటెక్టివ్ లుగా మారే అవకాశం ఉందని చెబుతూ.. వాటిపై పరిశోధనలు మొదలుపెట్టారు మలేసియాకు చెందిన శాస్త్రవేత్తలు. ఈ సమయంలో పలు కీలక విషయాలు వెల్లడించారు.
అవును... భవిష్యత్తులో అనేక క్రైమ్ కేసుల్లో నల్లులు కీలక డిటెక్టివ్ లుగా మారే అవకాశం ఉందని చెబుతూ.. వాటిపై మలేసియా శాస్త్రవేత్తలు కీలక పరిశోధనలు చేస్తున్నారు. నేరం జరిగిన ప్రదేశంలో అప్పటికే ఇవి అక్కడ ఉంటే.. బాధితులు, అనుమానితులను గుర్తించేందుకు ఇవి సహాయపడతాని గుర్తించినట్లు ఉత్తర పెనాంగ్ లోని సైన్స్ యూనివర్సిటీ ఆఫ్ మలేషియా (యూఎస్ఎం) బృందం పేర్కొంది.
తాజాగా ఈ విషయాలపై స్పందించారు శాస్త్రవేత్త అబ్దుల్ హఫీజ్ అబ్ మజీద్. ఇందులో భాగంగా.. యూఎస్ఎం స్కూల్ ఆఫ్ బయోలాజికల్ సైన్సెస్ ప్రయోగశాలలో తమ బృందం సుమారు ఐదు సంవత్సరాలపాటు నల్లులపై అధ్యయనం చేసినట్లు తెలిపారు. తాము వీటిని ‘దుప్పట్లో శత్రువు’ అని పిలుస్తామని.. అయితే అవి భవిష్యత్తులో నేరాలను పరిష్కరించడంలో డిటెక్టివ్ లు గా మారతాయని అన్నారు.
ఇవి మానవుల రక్తాన్ని పీల్చిన తర్వాత సుమారు 45 రోజుల వరకూ వారి డీఎన్ఏ ను నిలుపుకోవలగని తెలిపారు. తమ ప్రయోగశాల ఉష్ణోగ్రత 23° నుండి 24° సెల్సియస్ వరకు స్థిరంగా ఉంచడంతో.. కీటకాలు ప్రతి ఆహార సమయంలోనూ 1.5 నుండి 5.3 మైక్రోలీటర్ల రక్తాన్ని పీలుస్తాయని తెలిపారు. ఇది ఒక బిందువు కంటే తక్కువ అని హఫీజ్ వివరించారు.
ఇదే క్రమంలో.. దోమలు, ఈగలు లాగా ఈ నల్లులు ఎగరలేవని.. పైగా, అవి రక్తం తాగిన తర్వాత అంతగా కదలలేవని.. అవి తిన్న ప్రదేశం నుంచి 20 అడుగుల లోపు మాత్రమే కదలవలని.. అదే వాటిని ప్రత్యేకంగా చేస్తుందని.. అందుకే, ఎగిరిపోయే దోమలతో పోలిస్తే ఇవి ఫోరెన్సిక్ సాధనంగా ఉపయోగించడానికి సరైనవని తాము చెప్పగలమని హఫీజ్ వెల్లడించారు.
అదేవిధంగా... నేర స్థలంలో ఉన్న నల్లుల్లో ఉన్న డీఎన్ఏ ద్వారా బాధితులు లేదా నిందితుల జెండర్, కంటి రంగు, చర్మం రంగు, జుట్టు వంటి విషయాలు బయటపడతాయని తెలిపారు. పైగా ఇవి దుప్పట్లు, దిండులలో దాక్కొని ఉంటాయి కాబట్టి నిందితులకు సాక్ష్యాలను నాశనం చేసే అవకాశం కూడా ఉండదని హఫీజ్ తెలిపారు.