మన దగ్గర నుంచి బ్యాంకులు గుంజిన పెనాల్టీలు రూ.26,170 కోట్లు!

ఖాతా తెరిచే సమయంలోనే మినిమమ్ బ్యాలెన్స్ నిబంధనలు, పెనాల్టీల వివరాలను స్పష్టంగా వెల్లడిస్తున్నామని బ్యాంకింగ్ అధికారులు పేర్కొంటున్నారు.

Update: 2026-07-29 05:17 GMT

దేశంలో బ్యాంకింగ్ సేవలు ఉపయోగిస్తున్న సాధారణ ఖాతాదారులపై 'మినిమమ్ బ్యాలెన్స్' భారం ఏ స్థాయిలో ఉందో స్పష్టం చేసే షాకింగ్ గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. బ్యాంకు ఖాతాల్లో నిర్దేశిత కనీస సొమ్మును నిర్వహించలేకపోయినందుకు గాను గత నాలుగేళ్ల కాలంలో ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు కలిసి వినియోగదారుల నుంచి అక్షరాలా రూ.26,170.37 కోట్లు పెనాల్టీల రూపంలో వసూలు చేశాయి. రాజ్యసభలో సభ్యులు అడిగిన ఒక ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇస్తూ ఈ విషయాలను వెల్లడించారు.

ప్రైవేట్ బ్యాంకులదే పైచేయి

కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన నివేదిక ప్రకారం.. కనీస బ్యాలెన్స్ లేనందున పడే జరిమానాల భారం ప్రైవేట్ రంగ బ్యాంకుల్లోనే అత్యధికంగా ఉంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు పెనాల్టీల రూపంలో రూ.2,137.92 కోట్లు వసూలు చేశాయి. ప్రైవేట్ రంగ బ్యాంకులు ఏకంగా రూ.4,948.71 కోట్లు ఖాతాదారుల నుంచి రాబట్టాయి. ఈ గణాంకాలను పరిశీలిస్తే, ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోలిస్తే ప్రైవేట్ బ్యాంకులు తమ వినియోగదారులపై విధించే కనీస నిల్వ నిబంధనలు, చార్జీలు ఎంత కఠినంగా ఉన్నాయో అర్థమవుతోంది.

ప్రభుత్వ బ్యాంకుల్లో ఎస్‌బీఐ టాప్

ప్రభుత్వ రంగ బ్యాంకుల జాబితాను గమనిస్తే దేశంలోనే అతిపెద్ద బ్యాంకైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఈ ఛార్జీల వసూళ్లలో మొదటి స్థానంలో నిలిచింది. ఒక్క 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే ఎస్‌బీఐ కనీస బ్యాలెన్స్ లేని ఖాతాదారుల నుంచి రూ.477.27 కోట్ల జరిమానా వసూలు చేసినట్లు కేంద్రం స్పష్టం చేసింది. మిగిలిన ప్రభుత్వ బ్యాంకులు కూడా తమ వద్ద ఉన్న మార్గదర్శకాలకు అనుగుణంగానే ఖాతాదారుల నుంచి ఛార్జీలను రాబట్టాయి.

సామాన్యులపై అదనపు భారం.. నిపుణుల సలహాలు

ఖాతా తెరిచే సమయంలోనే మినిమమ్ బ్యాలెన్స్ నిబంధనలు, పెనాల్టీల వివరాలను స్పష్టంగా వెల్లడిస్తున్నామని బ్యాంకింగ్ అధికారులు పేర్కొంటున్నారు. అయినప్పటికీ పట్టణాలు, నగరాల్లో నివసించే నిరుపేదలు.. తక్కువ ఆదాయం ఉన్న సాధారణ ఖాతాదారులు తరచూ కనీస నిల్వ నిర్వహించలేక తమ డిపాజిట్లను జరిమానాల రూపంలో నష్టపోతున్నారు. దీనిపై స్పందించిన ఆర్థిక నిపుణులు ఖాతాదారులకు పలు సూచనలు చేస్తున్నారు. తమ ఖాతా రకం, దానికి అవసరమైన కనీస నిల్వ, పెనాల్టీ విధానాలపై స్పష్టత కలిగి ఉండాలి. అనవసర చార్జీల నుండి తప్పించుకోవడానికి 'జీరో బ్యాలెన్స్' సదుపాయం ఉండే బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ వైపు మారడం శ్రేయస్కరం.

రాజ్యసభలో బయటపడిన ఈ గణాంకాలు బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న పెనాల్టీ విధానాలపై మరోసారి తీవ్ర చర్చకు తెరలేపాయి. సేవల నిర్వహణకు ఈ రుసుములు అవసరమని బ్యాంకులు వాదిస్తున్నప్పటికీ సామాన్యులపై పడుతున్న భారాన్ని తగ్గించేలా ప్రభుత్వం, ఆర్బీఐ విధానపరమైన మార్పులు చేయాలని విశ్లేషకులు భావిస్తున్నారు.

Tags:    

Similar News