కాళేశ్వరం - బనకచర్ల వివాదం: లోకేష్ vs హరీష్ రావు నీటి ఫైట్
బనకచర్ల ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు, దానికి తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు ఇచ్చిన కౌంటర్లతో ఈ అంశం రాజకీయంగా వేడెక్కింది;
తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య జల వివాదం మళ్లీ రాజుకుంది. బనకచర్ల ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు, దానికి తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు ఇచ్చిన కౌంటర్లతో ఈ అంశం రాజకీయంగా వేడెక్కింది.
తెలంగాణకో నీతి.. మాకో నీతి? బనకచర్లపై లోకేశ్
గోదావరి వరద జలాలు సముద్రంలో కలిసిపోయే ముందు బనకచర్ల ప్రాజెక్టు కోసం వాడుకుంటే దానిలో తప్పేం ఉందని మంత్రి నారా లోకేశ్ ప్రశ్నించారు. సముద్రంలో వృధా అవుతున్న నీటిని ఉపయోగించడంలో తప్పేమీ లేదని స్పష్టం చేశారు. "తెలంగాణకు ఎలాంటి నష్టం జరుగుతుందో చెప్పండి. ఆ నీరు మన ప్రాంతానికి వాడుకుంటే అది తప్పేంటి?" అని లోకేశ్ ప్రశ్నించారు.కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్మించిందని గుర్తు చేశారు. "పరిశీలన చేయాల్సిన ప్రాజెక్టును మొదటగా కట్టేశారు. ఒక రాష్ట్రానికి ఓ నిబంధన, మరో రాష్ట్రానికి మరో నిబంధననా? ఇది ఏమిటి? ఇది ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం కాదా?" అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. "బనకచర్ల పథకం ద్వారా మేం తెలంగాణ నీటిని ఎత్తిపోసి వాడట్లేదు. కాళేశ్వరం ప్రాజెక్టుకు చెదలు వేసి నీరు దొంగలించటం జరగదు. ఒకవేళ కొన్ని సంవత్సరాలు వరదలు రాకపోతే, మిగులు జలాలు వస్తే మాత్రమే వాడుకుంటాం" అని లోకేశ్ స్పష్టం చేశారు.ఈ విషయంలో సమగ్రంగా చర్చ జరగాలని కోరుతూ, ఏపీ తరపున ఎప్పుడూ కాళేశ్వరం ప్రాజెక్టుకు అభ్యంతరం చెప్పలేదని తెలిపారు. టీడీపీ ఎప్పుడూ తెలుగు ప్రజల మేలు కోరికే పనిచేస్తుందని, తెలంగాణకు వ్యతిరేకంగా కాదని తెలిపారు.
హరీష్ రావు కౌంటర్
ఏపీ మంత్రి నారా లోకేష్‌పై తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా మండిపడ్డారు. కేంద్రం తమ వెనక ఉండటం వల్లే లోకేష్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. “బనకచర్ల కట్టి తీరుతాం అంటున్నారు, దాని అర్థం ఏంటి? ఎవరిని నమ్ముకుని ఇలాంటి మాటలు అంటున్నారు?” అని ప్రశ్నించారు. ఢిల్లీకి వెళ్లి అక్కడి నేతలతో లొంగిపోయే ధోరణి వల్లే రాష్ట్రానికి నష్టమని హరీష్ విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రానికి 'గురుదక్షిణ' చెల్లించాల్సిన పరిస్థితి కనిపిస్తోందని అన్నారు. బీజేపీ కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ఆ పార్టీ ఏమంటే అదే చేస్తున్నట్లు ప్రవర్తిస్తోందని ఎద్దేవా చేశారు. “మిగులు జలాలు వాడుకుంటున్నాం అంటే తప్పేంటి అంటున్నారు. నీళ్లు ఉన్నాయంటే DPRను కేంద్రం ఎందుకు తిరస్కరించింది? ఎవరు చూస్తూ ఊరుకోరు” అని హెచ్చరించారు. లోకేష్ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన హరీష్, “కాళేశ్వరం ప్రాజెక్టును మీరు అడ్డుకోలేదా? మీ నాన్న చంద్రబాబు నాడు ఆ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఏకంగా ఏడు లేఖలు రాశారు. మా ప్రాజెక్టులను అడ్డుకొని ఏపీ ప్రాజెక్టులకు లాభం తెచ్చుకోవాలని చూస్తున్నారు. ఇది జలద్రోహమే” అని మండిపడ్డారు. “బనకచర్లను మేము అడ్డుకుంటాం. మీరు కట్టాలంటే, మా వాటా ఇచ్చాక కట్టుకోండి. మేము కూడా కాళేశ్వరం కోసం పదిసార్లు మహారాష్ట్ర వెళ్లాం. ఉమ్మడి రాష్ట్రంలో నిర్ణయించిన నీటి కేటాయింపుల్ని ఎందుకు తర్కిస్తున్నారు?” అని ప్రశ్నించారు. “నువ్వు ఎలా కడతావ్ బాబూ? మా ప్రాజెక్టులకు వ్యతిరేకంగా మీ నాన్న రాసిన లేఖల్ని ముందుగా వెనక్కి తీసుకో. మేం మా హక్కుల కోసం పోరాడతాం. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడతారంటావు కానీ, బాబ్లీ ప్రాజెక్టుకు అప్పట్లో మీ నాన్న చేసిన పోరాటం కూడా అలాగే కదా?” అని ఎత్తిచూపారు.“నాలుగు కేంద్ర ప్రభుత్వ సంస్థలు మీ ప్రాజెక్టును తిరస్కరించాయి. నీరు మాకూ అవసరమే. అవసరమైతే సుప్రీంకోర్టుకైనా వెళ్లుతాం. బీజేపీ ఎంపీలు రాజీనామా చేస్తామంటే కేంద్రం వెనక్కి తగ్గుతుంది. ఎంపీ సీట్లు అర్ధం అయినా ఉన్నవారు పార్లమెంట్ స్తంభింప చేయాలి. గతంలో కేసీఆర్ 65-35 వాటాల కోసం కోరినా మీ ఇద్దరూ వినలేదు. ఇప్పుడేమైంది?” అని హరీష్ రావు ఘాటు ప్రశ్నలు సంధించారు.
రేవంత్ రెడ్డి నిశ్శబ్దంపై ప్రశ్నలు
లోకేష్ బనకచర్ల ప్రాజెక్టును కట్టి తీరుతామని ప్రకటిస్తున్నా, సీఎం రేవంత్ రెడ్డి స్పందించకపోవడంపై హరీష్ రావు అనుమానాలు వ్యక్తం చేశారు. దీని వెనుక ఏమైనా లోపాయికారీ ఒప్పందం ఉందా అని ప్రశ్నించారు. "మా రాష్ట్రంపై అభిప్రాయం చెప్పేటప్పుడు మిమ్మల్ని సైలెంట్‌గా చూస్తే అవతల పార్టీతో ఏమైనా లోపాయికారీ ఒప్పందమా?" అని హరీష్ రావు ప్రశ్నించారు.
-రాజకీయ, జల రాజకీయం మళ్లీ తెరపైకి
కేంద్ర అనుమతులు లేకుండానే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు అదే అంశాన్ని లోకేష్ చూపిస్తూ, తమ ప్రాజెక్టుకు కూడా కేంద్రం అనుమతులు ఇస్తుందని చెబుతున్నారు.
నదీ జలాలను పంచుకునే విషయంలో కేంద్రం, నదీ మండలి, సంబంధిత రాష్ట్రాల సమన్వయం అవసరం. కానీ, రాజకీయ నాయకులు ఈ సమస్యను రాజకీయంగా వాడుకుంటే, ప్రజలకు ప్రయోజనం ఉండదు. లోకేష్, హరీష్ రావుల మధ్య జరుగుతున్న ఈ మాటల యుద్ధం జల రాజకీయం ఎంత వేడెక్కిందో సూచిస్తోంది. ఇదే తీరు కొనసాగితే, బనకచర్ల-కాళేశ్వరం వివాదం జాతీయ స్థాయిలో చర్చకు దారి తీయవచ్చు.