గాడిద చాకిరీ బాడుగ పాలు.. ఏమిటీ షాకింగ్ నెంబర్స్!
ఇందులో భాగంగా... బెంగళూరులోని ఒక టెక్ ప్రొఫెషనల్ అక్కడ అద్దె మార్కెట్ ఏ స్థాయిలో ఉందో చెబుతూ ఓ పోస్ట్ పెట్టారు.;
సమయంతో సంబంధం లేకుండా నెలంతా కష్టపడి నాలుగు రూపాయలు సంపాదించి.. ఊరిలో ఉన్న తల్లి తండ్రులను చూసుకుంటూ, తనతో పాటు ఉంటున్న భార్యా పిల్లలను పోషించాలంటే మెట్రోపాలిటన్ సిటీల్లో అద్దెకు ఉండే సగటు జీవి(తం) ఊహించని స్థాయిలో అన్నట్లుగా ఇటీవల భారమైపోతోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన పలు విషయాలు షాకింగ్ గా మారుతున్నాయి.
అవును... నెలంతా కష్టపడితే ఒకటో తేదీన వచ్చే జీతం రాళ్లలో కనీసం 50% ఇంటికి అద్దెగా చెల్లించాల్సిన పరిస్థితులు నేటి మెట్రో నగరాల్లో నెలకొన్నాయని అంటున్నారు బాడుగ బాధితులు! సింగిల్ బెడ్ రూమ్ రూ.25వేలు, డబుల్ బెడ్ రూమ్ రూ.50,000, ట్రిపుల్ బెడ్ రూమ్ రౌండ్ ఫిగర్ రూ. లక్ష! తాజాగా నెట్టింట అత్యంత చర్చనీయాంశంగా మారిన విషయం ఇది.
ప్రధానంగా బెంగళూరు, ఢిల్లీ, ముంబై, చెన్నై నగరాల్లో అద్దెలు విపరీతంగా పెరిగిపోయాయని.. వాటి తాకిడి తట్టుకోలేక పదుల సంఖ్యలో కిలో మీటర్లు పక్క నున్న చిన్న చిన్న ప్రాంతాలకు వెళ్లి ఉండాల్సిన పరిస్థితి నెలకొందనే మాటలు ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ సమయంలో పలువురు నెటిజన్లు వారి బాడుగ కష్టాల గురించి సోషల్ మీడియాలో పోస్టులుగా పెట్టుకుని, ఓదార్పుకోసం చూస్తున్నారు!
ఇందులో భాగంగా... బెంగళూరులోని ఒక టెక్ ప్రొఫెషనల్ అక్కడ అద్దె మార్కెట్ ఏ స్థాయిలో ఉందో చెబుతూ ఓ పోస్ట్ పెట్టారు. ఇందులో భాగంగా... కుక్ టౌన్ లో ట్రిపుల్ బెడ్ రూమ్ ఇంటి యజమాని నెలకు ఒక లక్ష రూపాయలు అద్దె అడుగుతున్నారని చెబుతూ.. ప్రజలు మతి తప్పిపోయారా అని రాసుకొచ్చారు! ఒకే రోజు సుమారు అర డజనుకు పైగా ఇళ్లను చూసిన తర్వాత ఆయన అనుభవం ఇది.
ప్రస్తుతం కోరమంగళ ప్రాంతంలో డబుల్ బెడ్ రూమ్ కి రూ.50,000 చెల్లిస్తున్న అతడు.. వివాహం చేసుకున్న అనంతరం జనవరిలో ఆఫీసుకు దగ్గరగా కుక్ టౌన్ కు మారాలని భావించి, ఇళ్లు తనిఖీ చేయగా.. అదే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు రూ.75,000 - రూ.80,000 అద్దె అడుగుతున్నారని.. ట్రిపుల్ బెడ్ రూమ్ అయితే ‘రౌండ్ ఫిగర్’ అని బోర్డు పెడుతున్నారని సదరు టెకీ వాపోయరు.
అద్దె సంగతి ఇలా ఉంటే.. అడ్వాన్స్ సంగతి మరొకెత్తు అనే చెప్పుకోవాలి. ఇటీవల ఓ డూప్లెక్స్ ఇంటి ఓనరు.. అద్దెకు చేరాలంటే రూ.30 లక్షలు అడ్వాన్స్ ఇవ్వాలని బోర్డు పెట్టారు. దీంతో.. ఈ వ్యవహారం నెట్టింట సంచలనంగా మారింది. దీన్ని బట్టి అద్దె ఎంత ఉంటుందనేది ఒక అంచనాకు రావొచ్చని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. నెల మొత్తం గాడిద చాకిరీ బాడుగ పాలన్నమాట!