బండ్లన్న ఊర మాస్ స్పీచ్.. చంద్రబాబు బర్త్ డే సెలబ్రేషన్స్ లో సంచలనం

ముఖ్యమంత్రి చంద్రబాబు 76వ పుట్టిన రోజు వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు.;

Update: 2026-04-20 09:50 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబు 76వ పుట్టిన రోజు వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో నిర్వహించిన కార్యక్రమంలో నటుడు, నిర్మాత బండ్ల గణేష్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నవారిపై తీవ్రంగా ఫైర్ అయ్యారు. ట్విటర్ ఉందని ట్వీట్లు చేస్తున్నారని, అలాంటి విమర్శలు చేస్తున్నవారిని ఊరికే వదిలిపెట్టొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరుతున్నానని బండ్ల గణేష్ వ్యాఖ్యానించారు. ఇక చంద్రబాబు వ్యక్తిత్వం కోసం మాట్లాడుతూ బండ్ల గణేష్ చెప్పిన అంశాలు ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి.

హైదరాబాద్ లో నిర్వహించిన చంద్రబాబు పుట్టిన రోజు వేడుకల్లో నటుడు, నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడిన తీరు సోషల్ మీడియాను విశేషంగా ఆకట్టుకుంటోంది. చంద్రబాబు వ్యక్తిత్వం, అభివృద్ధిపై ఆయన చూపే శ్రద్ధను వివరించిన బండ్ల గణేష్, ముఖ్యమంత్రిపై విమర్శిస్తున్న వారిపై ఓ రేంజ్ లో చెలరేగిపోయారు. చంద్రబాబు బర్త్ డే సందర్భంగా ఒకటే కోరుతున్నానని, అన్యాయంగా మిమ్మల్ని విమర్శించేవారిని వదిలిపెట్టొద్దని బండ్ల గణేష్ వ్యాఖ్యానించారు.

‘‘మిమ్మిల్ని విమర్శిస్తుంటే మేము తట్టుకోలేకపోతున్నాం, ట్విటర్ ఉంది కదా? అని ట్వీట్ చేస్తున్నారు.’’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ‘‘మీరు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. నువ్వు వచ్చి చేయవయ్యా.. నువ్వు పది మందికి సాయం చేయ్, పది మందికి భవిష్యత్తు ఇవ్వు, పది మంది జీవితాలను నిలబెట్టు’’ అంటూ విమర్శలు చేస్తున్నవారిపై బండ్ల గణేష్ సీరియస్ అయ్యారు. చంద్రబాబు ఎన్నెన్నో కంపెనీలు తీసుకువచ్చారని, యువతకు ఉపాధి కల్పిస్తున్నారని అటువంటి నేతపై విమర్శలు చేయడానికి మీకు మనసు ఎలా వస్తుందని బండ్ల గణేష్ నిలదీశారు. పనిచేసే నేతను ప్రోత్సహించాలని హితవు పలికారు.

ఇక ఇదే సందర్బంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తొలిసారిగా సీఎం బాధ్యతలు తీసుకున్న తర్వాత సింగపూర్ పర్యటనలో చోటుచేసుకున్న ఒక ఆసక్తికరమైన విషయాన్ని బండ్ల గణేష్ వివరించారు. సింగపూర్ లో అధికారిక కార్యక్రమాలు ముగిసిన తర్వాత ఒక రోజు తన మిత్రుడితో కలిసి సింగపూర్ నగర పర్యటనకు వెళ్లారని, సిబ్బందిని విశ్రాంతి తీసుకోమని చెప్పి చంద్రబాబు ఒంటరిగా వెళ్దామని అనడంతో ఆయన సరదాగా గడిపేందుకు రెడీ అవుతున్నారని ఆ మిత్రుడు భావించారని బండ్ల గణేష్ చెప్పారు. కానీ, చంద్రబాబు తన మిత్రుడి ఆలోచనలకు భిన్నంగా సింగపూర్ నగరంలో శుభ్రత గురించి, నగరంలో క్లీన్ చేసే విధానం, చెత్త తరలింపు వంటి వాటిని పరిశీలించి ఆ రాత్రి 4 గంటల వరకు తిరిగారని బండ్ల గణేష్ తెలిపారు.

సింగపూర్ మాదిరిగా హైదరాబాద్ మారుస్తానని ఆ రోజు చంద్రబాబు చెప్పారని, తిరిగి వచ్చాక హైదరాబాద్ నగరాన్ని సింగపూర్ తరహాలో తీర్చిదిద్దారని బండ్ల గణేష్ తెలిపారు. నిరంతరం సీఎం చంద్రబాబు ప్రజల కోసమే ఆలోచిస్తారని ఏనాడు ఆయన తన కుటుంబ సభ్యుల కోసం, సొంత బావమరుదుల కోసం ఆలోచించలేదని చెప్పారు. తెలుగు ప్రజల భవిష్యత్తు కోసమే ఆలోచించారని, ప్రపంచాన్ని శాసించే విధంగా తెలుగు యువకులను తీర్చిదిద్దారని పేర్కొన్నారు. చంద్రబాబు వందేళ్లు పూర్తి చేసుకుంటారని, రాబోయే 25 ఏళ్లలో అమరావతిని విశ్వనగరంగా తీర్చిదిద్దుతారని బండ్ల గణేష్ వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News