బండారు ఫ్యూచ‌రేంటి.. టీడీపీలో చ‌ర్చ‌.. !

తన కేడర్ను బలోపేతం చేసుకోవడంతో పాటు పార్టీ కార్యకర్తలకు నాయకులకు ముఖ్యంగా ఎస్సీ సామాజిక వర్గానికి ఆయన అండగా ఉన్నారు.;

Update: 2026-05-09 10:30 GMT

బండారు శ్రావణి. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని సింగనమల ఎస్సి నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో తొలిసారి విజయం దక్కించుకున్న యువ నాయకురాలు. అయితే ఇప్పుడు ఆమెకు పెద్ద దిగులు పట్టుకుంది. వచ్చే ఎన్నికల నాటికి ఈ నియోజకవర్గ టికెట్ తనకి ఇస్తారా ఇవ్వరా అనేది ఆమె ఆలోచన. దీనిపై తరచుగా ఆమె సమీక్షలు చేస్తున్నారు. తన అనుచర వర్గంతో పాటు, తనకు అనుకూలంగా ఉన్న పార్టీ రాష్ట్రస్థాయి సీనియర్ నాయకులతో కూడా ఈ విషయంపై ఆరాతీస్తున్నారు.

ఇదంతా అత్యంత రహస్యంగా చేస్తున్నారు. ఎక్కడ బయటపడటం లేదు. ఏ విషయాన్ని బయటకు రాకుండా చూసుకుంటున్నారు. దీనికి ప్రధాన కారణం.. ఈ నియోజకవర్గానికి చెందిన బలమైన నాయకుడు... టిడిపిలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న ఎం.ఎస్.రాజు. ఈయన ప్రస్తుతం మడకశిర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో నుంచి పోటీ చేశారు. అయితే ఇది ఆయన సొంత నియోజకవర్గం కాదు. సింగనమల.. ఎమ్మెస్ రాజుకు సొంత నియోజకవర్గం. ఆయన రాజకీయాలన్నీ సింగనమలలోనే చేశారు.

తన కేడర్ను బలోపేతం చేసుకోవడంతో పాటు పార్టీ కార్యకర్తలకు నాయకులకు ముఖ్యంగా ఎస్సీ సామాజిక వర్గానికి ఆయన అండగా ఉన్నారు. దీంతో ఈ నియోజకవర్గ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలన్నది ఎమ్మెస్ రాజు ప్రధాన లక్ష్యంగా ఉంది. ఈ విషయాన్ని ఆయన ఎక్కడా చెప్పడం లేదు. కానీ తెర వెనుక మాత్రం ఈ ప్రయత్నాలు జోరుగా సాగిస్తున్నారు. మడకశిర ఎమ్మెల్యేగా ఉన్న ఎమ్మెస్ రాజు వారానికి రెండుసార్లు సింగనమలలో పర్యటించడం, తన వారితో మీటింగ్‌లు పెట్టడం, వారికి విందులు ఏర్పాటు చేయడం ప్రతి పండక్కి ఇక్కడికే రావడం ఏ ఫంక్షన్ కు ఆహ్వానం అందినా ఆయన తప్పకుండా హాజరు కావడం వంటివి ఎమ్మెల్యే బండారు శ్రావణికి.. ఇబ్బందికరంగా మారింది.

దీంతో వచ్చే ఎన్నికల నాటికి ఏం జరుగుతుందన్నది ఎమ్మెల్యే శ్రావణి కి ఆందోళనగా ఉందని అని అంటున్నారు. వాస్తవానికి ఎమ్మెస్ రాజుకు పార్టీలో మంచి పేరుంది. ఆయనకు మంచి నాయకుడు అన్న గుర్తింపు కూడా అధినేత వద్ద కనిపిస్తోంది. దీంతో రాజు వచ్చే ఎన్నికల నాటికి సింగనమల నియోజకవర్గం కోరుకుంటే ఖచ్చితంగా ఆయనకు ఆ నియోజకవర్గాన్ని కేటాయిస్తారు అన్న వాదన వినిపిస్తోంది. దీనికి తోడు వచ్చే ఎన్నికల్లో వైసిపి ఈ నియోజకవర్గ నుంచి మాజీ మంత్రి సాకే శైల‌జానాథ్‌ కి అవకాశం ఇస్తే అప్పుడు పోటీ మరింత తీవ్రంగా ఉంటుందన్న అంచనాలు టిడిపిలో ఉన్నాయి.

దీంతో బలమైన పోటీని తట్టుకోగలిగే స్థాయిలో బండారు శ్రావణి ప్రయత్నం చేయాలి. అంతేకాదు కార్యకర్తలకు నాయకులకు మరింత చేరువ కావాలి. ఇటీవల కాలంలో ఈ ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. అయినప్పటికీ ఎక్కడో ఒక విధమైన ఆందోళన ఆమెలో కనిపిస్తోందని స్థానికంగా మీడియా సైతం రాస్తుండడం విశేషం.

Tags:    

Similar News