గ్రేట్ ఈము వార్‌: సైన్యంపైనా మెషీన్ గ‌న్స్ పైనా గెలిచిన ప‌క్షుల క‌థ‌!

చరిత్రలో రాజ్యాల మధ్య, రాజుల మధ్య యుద్ధాలు జరగడం గురించి చ‌దివి తెలుసుకున్నాం.;

Update: 2026-05-01 23:30 GMT

చరిత్రలో రాజ్యాల మధ్య, రాజుల మధ్య యుద్ధాలు జరగడం గురించి చ‌దివి తెలుసుకున్నాం. కానీ ఒక దేశ సైన్యం ఏకంగా పక్షులపై యుద్ధం ప్రకటించి.. ఆ యుద్ధంలో ఓడిపోయిందంటే నమ్మశక్యంగా లేదు కదా! ఈ వింత సంఘటన 1932లో ఆస్ట్రేలియాలో జరిగింది. దాదాపు 20 వేల ఈము పక్షులు వ్యవసాయ భూములపై దాడి చేసి పంటలను నాశనం చేస్తుంటే.. వాటిని అదుపు చేయడానికి అప్పటి ప్రభుత్వం ఏకంగా సైన్యాన్ని రంగంలోకి దించింది. దీనినే చరిత్రలో `గ్రేట్ ఈము వార్` అని పిలుస్తారు.

మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఆస్ట్రేలియాలో స్థిరపడిన మాజీ సైనికులు గోధుమ సాగు చేపట్టారు. అయితే భారీ సంఖ్యలో వచ్చిన ఈము పక్షులు పొలాల్లోని కంచెలను తెంచుకుంటూ లోపలికి ప్రవేశించి పంటను తినేయడం మొదలుపెట్టాయి. రైతుల అభ్యర్థన మేరకు రక్షణ మంత్రి జార్జ్ పియర్స్, మేజర్ మెరెడిత్ నేతృత్వంలో మెషిన్ గన్లతో కూడిన సైనిక దళాన్ని ఆ పక్షులను అంతం చేయడానికి పంపారు. పక్షులపై సైన్యం విజయం సాధించడం చాలా సులభమని అందరూ భావించారు.

అయితే యుద్ధం మొదలైన తర్వాత సీన్ రివర్స్ అయ్యింది. సైనికులు కాల్పులు జరుపుతుంటే ఈము పక్షులు తమ వేగం చాకచక్యంతో తప్పించుకున్నాయి. అవి చిన్న చిన్న గుంపులుగా విడిపోయి సైన్యాన్ని తికమక పెట్టాయి. ఒకేసారి వేల సంఖ్యలో బుల్లెట్లు దూసుకెళుతున్నా.. ఆ పక్షుల మొండితనం, వేగవంతమైన కదలికల ముందు అధునాతన ఆయుధాలు కూడా పనిచేయలేదు. కొన్ని పక్షులకైతే బుల్లెట్లు తగిలినా అవి అలాగే పరుగెత్తడం చూసి సైనికులే ఆశ్చర్యపోయారు.

దాదాపు కొన్ని వారాల పాటు జరిగిన ఈ పోరాటంలో సైన్యం వేల సంఖ్యలో బుల్లెట్లను ఖర్చు చేసింది. కానీ చనిపోయిన పక్షుల సంఖ్య చాలా తక్కువ. పక్షుల తెలివితేటల ముందు సైన్యం వ్యూహాలు ఫలించలేదు. పైగా మీడియాలో ఈ విషయం హాస్యాస్పదంగా మారడంతో ప్రభుత్వం చివరకు తన సైన్యాన్ని వెనక్కి పిలిపించుకోవాల్సి వచ్చింది. ఆ విధంగా ఒక దేశ అధికారిక సైన్యం పక్షుల చేతిలో ఓటమిని ఒప్పుకోవాల్సి వచ్చింది.

మానవ చరిత్రలో అత్యంత విచిత్రమైన ఈ సంఘటన ఇప్పటికీ ఒక పెద్ద ఆశ్చర్యంగా మిగిలిపోయింది. సైన్యంపై పక్షులు సాధించిన ఈ ఘనవిజయం ప్రకృతి శక్తిని చాటిచెబుతుంది.

Tags:    

Similar News