మోడీ ఎదుట గుండె విప్పిన పవన్!

Update: 2023-11-07 18:09 GMT

పవన్ కళ్యాణ్ లో రాజకీయ నాయకుడి కంటే కూడా దేశాన్ని ప్రేమించే వ్యక్తి కనిపిస్తారు. ఆయనకు రాజకీయాల కంటే దేశం మీదనే ఇష్టం ఎక్కువ. అందుకే ఆయన రాజకీయ విధానాలు ఇతరులకు గందరగోళంగా అనిపించవచ్చు. కానీ పవన్ మాత్రం తాను అనుకున్న వారిని ప్రేమిస్తారు. తాను బలమైన నాయకత్వం అని నమ్మితే వారి వెంట ఉంటారు. ఈ విషయంలో ఎవరు ఏమనుకున్నా పవన్ వెనకాడరు.

అదే మరోసారి ఆవిష్కృతమైంది. తెలంగాణాలోని ఎల్బీ స్టేడియం లో జరిగిన బీసీ ఆత్మ గౌరవ సభలో పవన్ ప్రసంగం అంతా మోడీని కీర్తించడంతోనే ఎక్కువగా సాగింది. మోడీ అంటే తనకు ఎందుకు అంత ఇష్టమో వేలాది మంది జనం సాక్షిగా పవన్ చెప్పారు. మోడీ వంటి సమర్ధుడైన నాయకుడు ఈ దేశానికి మరోసారి కూడా కావాలని పవన్ గట్టిగానే చెప్పారు.

మోడీ పదేళ్ళలో సాధించిన విజయాలను ఆయన సభలో వివరంగా చెప్పారు. మూడు దశాబ్దాల అభివృద్ధిని కేవలం దశాబ్ద కాలంలోనే మోడీ చేసి చూపించారని అన్నారు 2004 నుంచి 2014 మధ్యలో దేశ అంతర్గత భద్రత అతి పెద్ద సమస్యగా మారిందని పవన్ గతాన్ని గుర్తు చేశారు. దేశంలో ప్రతీ చోటా ఉగ్ర దాడులు జరిగేవని, హైదరాబాద్ లో చూస్తే గోకుల్ చాట్ లుంబినీ పార్క్ పేలుళ్ళు తన లాంటి వారిని ఎంతో మందిని కలచివేశాయని అన్నారు

ఈ దేశానికి బలమైన నాయకుడు కావాలని తన లాంటి వారు ఎంతో మంది కలలు కంటే వచ్చిన వారు నరేంద్ర మోడీ అని ప్రధాని ఎదుటనే తన మనసు విప్పి పవన్ చెప్పారు. మోడీ నాయకత్వం మళ్లీ ఈ దేశానికి రావాలని మూడవసారి ఆయనే ప్రధాని కావాలని పవన్ కోరారు.

Read more!

ఈ దేశంలో రామాలయ నిర్మాణం కానీ 370 ఆర్టికల్ రద్దు కానీ మహిళా రిజర్వేషన్ బిల్లు కానీ మోడీ ప్రధానిగా ఉండబట్టే జరిగాయని అన్నారు. దేశం పదేళ్ల వ్యవధిలో ఏకంగా పదవ స్థానం నుంచి అయిదవ స్థానానికి ఆర్ధిక ప్రగతిలో ముందుకు దూసుకుని వచ్చిందని పవన్ అన్నారు. విదేశాంగ విధానం కూడా భేష్ అన్నారు.

శత్రువు భారత్ వైపు చూస్తే అంతే ధీటుగా బదులిస్తామని మోడీ నిరూపించారని పవన్ అన్నారు. నరేంద్ర మోడీకి ఎన్నికల వేళనే రాజకీయం చేయడం తెలుసు అని మిగిలిన సమయం అంతా అభివృద్ధికే ఆయన కేటాయిస్తారని అన్నారు బీసీలను ఉన్నత స్థానంలో చూసే నాయకుడు మోడీ అన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో తెలంగాణా కూడా నడవాలంటే బీజేపీని గెలిపించాలని కోరారు

అంతకు ముందు నరేంద్ర మోడీతో పవన్ కళ్యాణ్ వేదికను పంచుకున్నారు. ఆయనతో చాలా సేపు ముచ్చటించారు. మోడీ పవన్ కలసి మాట్లాడుతున్న సన్నివేశాలు సభికులను ఆకట్టుకున్నాయి. పవన్ పట్ల మోడీ ఆప్యాయతతో వ్యవహరిస్తే మోడీ పట్ల గురు భావంతో పవన్ వ్యవహరించడం కనిపించింది. మొత్తానికి పవన్ తన మనసులో మోడీకి ఎంతటి స్థానం ఇచ్చారో సభలో గట్టిగానే చెప్పేశారు. పవన్ చేసిన ప్రసంగం అంతా మోడీ కూడా ఆసక్తిగా వింటూ కనిపించారు.

Tags:    

Similar News