పొలిటికల్ డిబేట్: వంగవీటి వారసురాలు ఆశతో ప్రయోజనం ఎంత ..!
రాజకీయాల్లోకి ఎప్పటికప్పుడు కొత్త నాయకులు వస్తూనే ఉంటారు. కొత్త రాజకీయాలు చేస్తూనే ఉంటారు.;
రాజకీయాల్లోకి ఎప్పటికప్పుడు కొత్త నాయకులు వస్తూనే ఉంటారు. కొత్త రాజకీయాలు చేస్తూనే ఉంటారు. వారి వల్ల ఏ వర్గం ప్రభావితం అవుతుంది.. వారివల్ల ఎంత మేరకు పార్టీలకు ప్రయోజనం చేకూరుతుంది.. అనేది రాజకీయాల్లో ప్రధానమైన చర్చ. ఇప్పుడు ఈ దిశగానే మరో కొత్త చర్చ ప్రారంభమైంది. కాపు నాయకుడు, పేదల పెన్నిధిగా పేరొందిన వంగవీటి మోహన్ రంగా కుమార్తె వంగవీటి ఆశ కిరణ్ ప్రజల మధ్యకు వస్తున్నానని ప్రకటించారు. అయితే ఎవరు ఎలాంటి ప్రజాసేవ చేసినా.. అంతిమంగా వారి లక్ష్యం రాజకీయాలే. కాబట్టి ఆమె కూడా వచ్చే ఎన్నికల నాటికి రాజకీయాల్లోకి వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
అయితే ఆమె ఏ పార్టీలో చేరుతారు.. ఏ పార్టీ కండువా కప్పుకుంటారు అనే చర్చ పక్కన పెడితే.. అసలు వంగవీటి రంగా రేంజ్‌ను అందుకుని.. ఓట్లు దూసుకు రాగల సమర్థమైన నాయకత్వం వంగవీటి ఆశకిరణ్‌కు ఉందా అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. ఎందుకంటే పార్టీ పరంగా అయితే ఎవరైనా గెలుస్తారు. ఓడేవారు ఓడుతారు. కానీ ఒక వ్యక్తి వ్యవస్థగా మారిన పరిస్థితి వంగవీటి కుటుంబానికి సొంతం. రంగా రాజకీయాలను పరిశీలిస్తే ఆయన వ్యక్తిగా వ్యవస్థగా అతిపెద్ద రాజకీయ శక్తిగా కూడా వ్యవహరించారు.
ఇది ఆ కుటుంబానికి ఇప్పటికీ రక్షణ ఛత్రంగా మారింది. ఆయన పేరు చెప్పుకునే అప్పట్లో వంగవీటి రత్నకుమారి, వంగవీటి రాధా రాజకీయాలు చేశారు. అయితే రంగాస్థాయిని అందుకున్నారా.. రంగా స్థాయిలో రాజకీయాల చేశారా.. ఆయన సానుకూల ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకున్నారా.. అనే ప్రశ్నలు వచ్చినప్పుడు మాత్రం వారు విఫలమయ్యారు అనేది అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ రేంజ్ లో వంగవీటి ఆశకిరణ్ ఏ మేరకు సక్సెస్ అవుతారు.. ఏ మేరకు ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకుంటారు.. అనేది రాజకీయాల్లో ప్రధానంగా మారింది.
ఎందుకంటే వ్యక్తిగతంగా టికెట్లు ఇచ్చేందుకు చాలా మంది నాయకులు అన్ని పార్టీల్లోనే ఉన్నారు. కానీ, వంగవీటి కుటుంబం నుంచి వచ్చే ఆశకిరణ్ చేర్చుకోవాలన్నా.. ఆమెకు టికెట్ ఇవ్వాలన్నా వ్యక్తిగతంగా ఆమె ఇమేజ్ కంటే వ్యవస్థాగతంగా రంగా పాదుగొల్పిన ఇమేజ్‌ను ఆమె ఏ మేరకు ఓటు బ్యాంకుగా మార్చుకోగలుగుతారన్నది కీలకం. దీనిని బట్టి ఆశాకిరణ్ రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్నది విశ్లేషకులు చెబుతున్న మాట. ముఖ్యంగా రంగా అంటే అభిమానం ఉన్నప్పటికీ మహిళా నాయకత్వాన్ని ఏ మేరకు ప్రజలు ఆదరిస్తారు అన్నది కూడా మరో ప్రశ్న.
గతంలో రత్నకుమారిని ఆదరించారు. కానీ ఆమె ప్రజలకు దూరమయ్యారు. ఆ తర్వాత రాధాను ఆదరించారు. ఆయన కూడా ప్రజలను పట్టించుకోలేదన్న వాదన బలంగా వినిపించింది. ఇప్పుడు ఆశాకిరణ్ పై ఆశలు ఉన్నప్పటికీ ఆమె వేసిన అడుగులు చాలా కీలకంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏ పార్టీ ఆమెను తీసుకోవాలన్నా వ్యక్తిగతంగా ఆమె ఇమేజ్ ను పరిగణనలోకి తీసుకుంటుంది అనేది వాస్తవం.