పెళ్లి తంతు ఊళ్లో.. మంగళసూత్రం కట్టేది ఊరి బయట.. ఏమిటీ ఆచారం!

అవును... భారతదేశంలో ఎన్నో వేల ఆచార సంప్రదాయాలున్నాయనే సంగతి తెలిసిందే. దేశంలో కులాల వారీగా, జాతుల వారీగా ఎన్నో ఆచారాలు కొనసాగుతుంటాయి.;

Update: 2025-10-04 23:30 GMT

భారతదేశంలో వేల భాషలు, మరికొన్ని వేల సంప్రదాయాలు, ఇంకొన్ని ఆచారాలు ఉంటాయని అంటారు! ఎన్నో జాతుల సమాహారం అయిన భారతదేశంలో వందల ఏళ్ల నాటి ఆచారాలు ఇప్పటికీ చాలా చోట్ల కొనసాగుతూనే ఉంటాయి. అవి పెట్టిన పెద్దలపైన గౌరవమో.. లేక, అందుకు కారణమైన దేవతలపై నమ్మకమో తెలియదు కానీ.. అవి ఈ శతాబ్ధంలోనూ కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో విజయనగరంలోని ఓ ఆచారం గురించి తెలుసుకుందామ్..!

అవును... భారతదేశంలో ఎన్నో వేల ఆచార సంప్రదాయాలున్నాయనే సంగతి తెలిసిందే. దేశంలో కులాల వారీగా, జాతుల వారీగా ఎన్నో ఆచారాలు కొనసాగుతుంటాయి. అందులో కొన్ని మాత్రం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. ఈ క్రమంలో... విజయనగరం జిల్లా శృంగవరపుకోట పట్టణంలో ఆర్యవైశ్యుల వివాహాల్లో ఈ ప్రత్యేకమైన సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ ఆచారం ప్రకారం.. పెళ్లి తంతు ఊళ్లో జరిగితే, మంగళసూత్రం కట్టేది మాత్రం ఊరి బయట!

అయితే... వందల ఏళ్ల నాటి ఈ ఆచారం వెనుక ఒక విశ్వాసం ఉందని చెబుతున్నారు. స్థానికుల వివరాల ప్రకారం... పట్టణంలోని గ్రామ దేవత 'ఎరుకమ్మ పేరంటాలు' శాపం వల్లే ఈ ఆచారం పుట్టుకొచ్చింది. అందువల్లే వివాహానికి వచ్చిన ప్రతి కుటుంబం వధూవరులను పట్టణ సరిహద్దు దాటి తీసుకెళ్లి.. అక్కడే మంగళసూత్రం కట్టించి మళ్లీ తిరిగి ఊరికి తీసుకురావడం ఒక ఆచారంగా మారింది.

ఆర్యవైశ్య కుటుంబాలు వివాహానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలను ఊర్లోనే నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా... కల్యాణమండపంలో వధూవరుల కూర్చోబెట్టడం, భోజనాలు అన్నీ ఊర్లోనే జరుగుతాయి. కానీ ముహూర్తం రాగానే.. వధూవరులను పొలిమేర అవతలికి తీసుకునివెళ్లి.. అక్కడ తాళి కట్టే కార్యక్రమం నిర్వహిస్తారు. అనంతరం మళ్లీ వధూవరులను ఊర్లోకి తీసుకొచ్చి మిగతా పెళ్లి తంతు పూర్తి చేస్తారు.

వాస్తవానికి గతంలో వందశాతం పెళ్లిళ్లు ఈ ఆచారాన్ని తూచ తప్పక పాటించేవి కానీ.. ఇటీవల కాలంలో కొంతమంది మాత్రం ఊరి అవవతలే మొత్తం పెళ్లిని జరిపించుకోవడం మొదలుపెట్టారు. ఈ ప్రత్యేక ఆచారంలో కేవలం భయమే కాకుండా.. సమాజ బంధం, పాత విశ్వాసాలకు గౌరవం కూడా ఉన్నాయని అంటున్నారు. ఇదే సమయంలో.. ఈ ఆచారం వలన వివాహానికి వచ్చేవారిలో ఒక కొత్త అనుభవం కలుగుతుందని చెబుతున్నారు.

ఈ సందర్భంగా స్పందించిన శృంగవరపుకోట ఆర్యవైశ్యులు.. ఇది కేవలం ఒక నియమం మాత్రమే కాదని.. ఇది తమ సంస్కృతిలో భాగమని చెబుతున్నారు. అయితే.. భవిష్యత్తులో ఈ ఆచారం ఎలా మారుతుందో కాలమే నిర్ణయించాలని చెబుతున్నారు. ఇప్పటికైతే మాత్రం తమ కుటుంబాలన్నీ తప్పకుండా ఈ పద్దతి పాటిస్తున్నాయని చెబుతున్నారు.

Tags:    

Similar News