పిల్లల్ని కనే రోబో: వాస్తవం కాబోతున్న సైన్స్ ఫిక్షన్
ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధస్సు (AI), రోబోటిక్స్, బయోటెక్నాలజీ రంగాల్లో వస్తున్న విప్లవాత్మక మార్పులు ఒకప్పుడు మనం కేవలం సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూసేవాళ్లం.. కానీ ఇవి ఇప్పుడు నిజం చేస్తున్నాయి.;
ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధస్సు (AI), రోబోటిక్స్, బయోటెక్నాలజీ రంగాల్లో వస్తున్న విప్లవాత్మక మార్పులు ఒకప్పుడు మనం కేవలం సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూసేవాళ్లం.. కానీ ఇవి ఇప్పుడు నిజం చేస్తున్నాయి. అటువంటి ఒక అద్భుతమైన ఆవిష్కరణే "పిల్లల్ని కనే రోబో". ఈ ప్రాజెక్ట్‌పై చైనాలో వేగంగా పరిశోధనలు జరుగుతున్నాయి. సింగపూర్‌లోని నాన్యాంగ్ యూనివర్శిటీకి చెందిన డాక్టర్ జాంగ్ కిఫెంగ్ నేతృత్వంలో ఒక ప్రత్యేక పరిశోధక బృందం ఈ రోబోను అభివృద్ధి చేసే పనిలో నిమగ్నమై ఉంది.
ఈ సాంకేతికత ఎలా పని చేస్తుందంటే, ఈ రోబోలో ఒక కృత్రిమ గర్భాశయం ఉంటుంది. అందులో అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ను నింపి, గర్భంలోని శిశువు పెరిగేందుకు అవసరమైన సహజ వాతావరణాన్ని సృష్టిస్తారు. తల్లి గర్భంలో శిశువుకు అందే అన్ని పోషకాలు, ఆక్సిజన్, రక్షణ ఈ రోబోలోని ట్యూబ్స్ , న్యూట్రియెంట్ సప్లై సిస్టమ్ ద్వారా అందుతాయి. తల్లి గర్భంలో శిశువు 9 నెలల కాలంలో ఎలాగైతే పెరుగుతాడో, ఈ రోబోలో కూడా అదే విధంగా పెరిగి పూర్తిస్థాయి శిశువుగా పుడతాడు.
- ఈ సాంకేతికత ఉద్దేశ్యం.. ప్రయోజనాలు
ఈ రోబోను అభివృద్ధి చేయడం వెనుక ప్రధాన ఉద్దేశ్యం, సంతానలేమి సమస్యలతో బాధపడుతున్న దంపతులకు, లేదా ఆరోగ్య సమస్యల కారణంగా గర్భం దాల్చలేని మహిళలకు ఒక కొత్త ఆశను కల్పించడం. ఈ సాంకేతికత భవిష్యత్తులో అంతరిక్ష ప్రయాణాల్లో కూడా ఉపయోగపడవచ్చు. అంతేకాక గర్భధారణ సమయంలో మహిళలు ఎదుర్కొనే శారీరక, మానసిక సమస్యలు ఈ సాంకేతికత ద్వారా తగ్గిపోతాయి. ఇది బయోటెక్నాలజీ.. రోబోటిక్స్ రంగాల్లో ఒక కొత్త శకానికి నాంది పలకనుంది.
- ఖర్చు.. భవిష్యత్తు
శాస్త్రవేత్తల అంచనా ప్రకారం 2026 నాటికి ఈ రోబో యొక్క తొలి నమూనా సిద్ధమవుతుంది. ప్రస్తుత అంచనాల ప్రకారం దీని అభివృద్ధి ఖర్చు సుమారుగా ₹12.96 లక్షలు. ఇది ప్రారంభ దశలో ఉన్నందున, ఖర్చులు ఇంకా పెరిగే అవకాశం ఉంది.
- సవాళ్లు.. నైతిక ప్రశ్నలు
ఈ టెక్నాలజీ అనేక ప్రయోజనాలను అందించినా, దానిపై కొన్ని అభ్యంతరాలూ ఉన్నాయి. తల్లి గర్భంలో శిశువు పెరగడం వల్ల ఏర్పడే మానసిక బంధం ఈ సాంకేతికతతో లోపించవచ్చు. అంతేకాకుండా మతపరమైన, సాంస్కృతిక అభ్యంతరాలు కూడా దీనిపై చర్చకు దారితీస్తున్నాయి. డబ్బున్న వారికి మాత్రమే అందుబాటులో ఉండడం వల్ల సమాజంలో అసమానతలు పెరిగే అవకాశం ఉంది.
మొత్తంగా చెప్పాలంటే, పిల్లల్ని కనే రోబో అనే ఆలోచన ఒకప్పుడు సైన్స్ ఫిక్షన్‌గా కనిపించినా, ఇప్పుడు వాస్తవానికి చాలా దగ్గరగా ఉంది. రాబోయే కాలంలో ఈ ఆవిష్కరణ మానవ జీవన విధానాన్ని మరియు వైద్య రంగాన్ని పూర్తిగా మార్చే అవకాశం ఉంది. అయినప్పటికీ, దీని వాస్తవ వినియోగం శాస్త్రీయ, సామాజిక మరియు నైతిక చర్చలపైన ఆధారపడి ఉంటుంది.