పోటీ చేయనని సీఎం జగన్ కు చెప్పేశా.. మంత్రి సంచలనం

పరిచయం చేయాల్సిన అవసరం లేని ఏపీ నేతల్లో ధర్మాన ప్రసాదరావు ఒకరు.

Update: 2023-09-30 05:03 GMT

పరిచయం చేయాల్సిన అవసరం లేని ఏపీ నేతల్లో ధర్మాన ప్రసాదరావు ఒకరు. ప్రస్తుతం జగన్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేస్తున్న ఆయన నోటి నుంచి ఆసక్తికర వ్యాఖ్యలు వచ్చాయి. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయలేనన్న విషయాన్ని ముఖ్యమంత్రికి చెప్పేశానని వెల్లడించారు. నలభై ఏళ్లుగా తాను రాజకీయాల్లో ఉన్నానని.. ఇప్పటికి పన్నెండుసార్లు ఎన్నికల్లో పోటీ చేశానని.. వయసు మీద పడిపోతున్న వేళ.. ఎన్నికల్లో పోటీకి తాను సిద్దంగా లేనని ప్రకటించారు.

తాజాగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో పోటీకి సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో పోటీ చేసిన పన్నెండుసార్లలో ఆరుసార్లు గెలిచి.. ఆరుసార్లు ఓడానని.. గెలుపు ఓటముల్లో పెద్ద తేడా ఏమీ లేదన్న ఆయన.. తాను ఎన్నికల్లో పోటీ చేయను.. విశ్రాంతి తీసుకుంటానని చెబితే.. ఈసారి ఎన్నికల్లో ఒక్కసారి పోటీ చేయాలని ముఖ్యమంత్రి జగన్ తనను కోరినట్లుగా చెప్పారు.

‘అన్నా.. ఈ ఒక్కసారి పోటీ చేయండన్నా’ అని ముఖ్యమంత్రి జగన్ అడిగారని చెప్పిన ధర్మాన..‘‘వచ్చే ఎన్నికల్లో మీరు ఆశీర్వదిస్తే గెలిచి మీ సేవకుడిగా ఉంటా. ఓడితే మీ స్నేహితుడిగా ఉంటా. నాకీ మర్యాద.. గౌరవం దక్కటానికి కారణం మీరే. అందుకే మీకన్నీ విషయాల్ని చెబుతున్నా’ అంటూ ధర్మాన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళంలో మాట్లాడిన ధర్మాన మాటలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తన ఇమేజ్ పెంచుకునే క్రమంలో.. ముఖ్యమంత్రి జగన్ ప్రస్తావన తీసుకురావటాన్ని తప్పుపడుతున్నారు.

తాను వద్దంటున్నా.. ముఖ్యమంత్రి ఎన్నికల్లో పోటీ చేయాలని కోరినట్లుగా చెప్పిన దర్మాన.. చివరకు తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయాన్ని స్పష్టం చేయటాన్ని తప్పు పడుతున్నారు. ఎన్నికల్లో పోటీకి తనకు ఇష్టం లేకున్నా.. ముఖ్యమంత్రి కోరిక మీద మాత్రమే తాను పోటీ చేస్తున్నట్లుగా చెప్పిన తీరుపై అభ్యంతరం వ్యక్తమవుతోంది. ప్రజలతో అన్ని విషయాల్ని పంచుకుంటానన్న పేరుతో.. ముఖ్యమంత్రి తనకెంత ప్రాధాన్యం ఇస్తారన్న విషయాన్ని ధర్మాన చెప్పటం వరకు బాగున్నా.. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రిని ప్రస్తావించిన తీరుపై ధర్మానను తప్పు పడుతున్నారు.

Tags:    

Similar News