ఉచిత బస్సుపై తలోమాట.. గందరగోళంగా కీలక పథకం!
ఏపీలో ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.;
ఏపీలో ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై సీఎం చంద్రబాబు ఇప్పటికే ఒక క్లారిటీ ఇచ్చారు. ఆగస్టు 15వ తేదీ నుంచి ఎన్ని ఇబ్బందులు వచ్చినా మహిళలకు ఇచ్చిన హామీ ప్రకారం.. సూపర్ 6 పథకాల్లో కీలకమైన ఉచిత బస్సు ను నడిపించి తీరుతామన్నారు. ఇదేసమయంలో ఆయన జిల్లాలకు మాత్రమే పరిమితం చేస్తామన్నారు. అది కూడా..కొన్ని బస్సులను మాత్రమే కేటాయించనున్నట్టు చెప్పారు.
సిఎం చంద్రబాబు చెప్పిన వివరాల ప్రకారం.. పల్లె వెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులకు మాత్రమే ఉచిత సర్వీసు అందుబాటులో ఉంటుందన్నారు. అంటే.. దాదాపు సర్కారు ఈ విషయంపై ఒక క్లారిటీతో ఉన్నట్టే నని అర్ధమైంది. కానీ, సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ప్రజల వద్దకు వెళ్తున్న మంత్రులకు మహిళల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. ఎన్నికలకు ముందు.. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చని చెప్పారని మహిళలు నిలదీస్తున్నారు.
అంతేకాదు.. బస్సుల విషయంలోనూ.. నిబంధనలు అప్పట్లో పెట్టలేదని మంత్రులను ప్రశ్నిస్తున్నారు. అయితే.. దీనిపై మంత్రులు విధి విధానాలు తయారవుతున్నాయని చెప్పి.. తప్పించుకునే అవకాశం ఉంది. కానీ, ఎవరికి తోచిన విధంగా వారు ఈ పథకంపై తలోమాట చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ నుంచి ఎక్కడికైనా తిరగొచ్చని.. కొందరు మంత్రులు చెబుతుంటే.. మరికొందరు.. మండలాలకే పరిమితమని వ్యాఖ్యానిస్తున్నారు.
ఇంకొందరు.. ఏసీ బస్సులు తప్ప.. ఎలాంటి బస్సుల్లో అయినా.. తిరిగే అవకాశం ఉంటుందని వ్యాఖ్యాని స్తున్నారు. మరికొందరు వారంలో నాలుగు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా తిరగొచ్చని అంటున్నారు. ఇలా.. మంత్రులు అసంబద్ధమైన ప్రకటనలు చేస్తుండడంతో కీలకమైన ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ పథకంపై తీవ్ర గందరగోళం నెలకొంది. సీఎం చంద్రబాబు చెప్పినట్టు జరుగుతుందని ఒక్క మాట అనే బదులు.. ఎవరికి తోచినట్టు వారు.. ప్రకటనలు చేస్తే.. రేపు ప్రభుత్వానికి చెడ్డపేరు రాదా? అనేది ప్రశ్న. మంత్రులు ఈ విషయంపై ఒక్కసారి పునరాలోచన చేసుకోవాల్సి ఉంటుంది.