చంద్రబాబు vs కేసీఆర్: తెలుగు రాష్ట్రాలకు ఏ మోడల్ కరెక్ట్?

కలిసి ఉంటే కలదు సుఖమంటారు. ఈ మాట ఎక్కడన్నా ఫర్లేదు కానీ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మాత్రం అస్సలు మాట్లాడకూడదు.;

Update: 2026-01-08 07:43 GMT

కలిసి ఉంటే కలదు సుఖమంటారు. ఈ మాట ఎక్కడన్నా ఫర్లేదు కానీ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మాత్రం అస్సలు మాట్లాడకూడదు. అందునా తెలంగాణ విషయంలో మరింత ముఖ్యంగా. ఎందుకంటే..ఇలాంటి వ్యాఖ్యలు తెలంగాణ ప్రయోజనాల్ని దెబ్బ తీసేవిగా.. తెలంగాణపై కుట్ర పన్నే ఎత్తుగడలో భాగంగా.. తెలంగాణను దెబ్బ తీసే దుర్మార్గ చర్యలకు నిదర్శనంగా అభివర్ణించటం అలవాటైంది. ఇలా మాట్లాడేవారు తెలంగాణ ఉద్యమ సమయంలో బలంగా వినిపించిన ‘విడిపోయి కలిసి ఉందాం’, ‘రాష్ట్రాలుగా విడిపోదాం.. తెలుగువారిగా కలిసి ఉందాం’ అంటూ చెప్పిన మాటల మాటేంటి? అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం వినిపించదు.

రాజకీయ ప్రయోజనాల కోసం.. రాజకీయ స్వార్థం కోసం పదే పదే విద్వేషాన్ని విరజిమ్మే ఎత్తుగడతో గుప్పెడు మందికి పదవులు లభిస్తాయే తప్పించి.. కోట్లాది మంది తెలుగు వారికి మాత్రం తిప్పలు తెచ్చి పెడతాయి. నీళ్లు.. నిధులు.. నియామకాల్లో జరిగిన అన్యాయాన్ని ఎత్తి చూపుతూ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటైన సంగతి తెలిసిందే. తెలంగాణ ఏర్పాటు తర్వాత పంచాయితీలు పెట్టుకొని సాధించే కన్నా.. ఇరు రాష్ట్రాలు స్నేహపూర్వకంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

ఈ విషయంలో తెలంగాణ అధికార పక్షంలో ఉన్న వారు మాత్రమే కాదు.. విపక్షంలో ఉన్న వారు సైతం ఏపీ వ్యతిరేకతే తమ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గా మార్చుకున్న పరిస్థితి. ప్రజల ప్రయోజనాల కంటే కూడా తమ రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమన్నట్లుగా వారి తీరు ఉంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల మళ్లీ నీళ్ల రగడ మొదలైంది. ఏపీ ప్రయోజనాలకు అనుగుణంగా రేవంత్ రెడ్డి సర్కారు నిర్ణయాలు ఉంటున్నాయని గులాబీ పార్టీ అగ్రనేతలు గొంతులు సవరించుకుంటూ కొత్త రాజకీయాలకు తెర తీస్తున్నారు.

ఇలాంటి వేళ.. గులాబీ నేతలకు చెక్ చెప్పేందుకు వీలుగా రేవంత్ రెడ్డి సైతం తానేం తక్కువ కాదన్నట్లుగా రియాక్టు అవుతున్నారు. ఇలాంటి వేళలో.. ఏపీ అధికారపక్షం తీరేంటి? ఏపీ ముఖ్యమంత్రి రియాక్షన్ ఏమిటి? అన్న ప్రశ్నలు తెర మీదకు వచ్చాయి. అనూహ్య రీతిలో ద్వేషాన్ని కాకుండా.. పెద్ద మనిషి తరహాలో స్పందించిన చంద్రబాబు తీరు చూసినప్పుడు.. తెలుగు రాష్ట్రాల భవిష్యత్తుకు అవసరమైన మార్గాన్ని ఏపీ సీఎం తన మాటలతో చెప్పకనే చెప్పేశారని చెప్పాలి.

నీళ్లపై రాజకీయాలు చేయొద్దని.. ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలన్న ఆయన.. భావోద్వేగాలతో తెలంగాణ ఆటలు ఆడటం సరికాదన్న సీరియస్ కామెంట్ చేసేశారు. గోదావరిలో పుష్కలంగా జలాలు ఉన్నాయని.. దాని వాటా మీద గొడవ కంటే కూడా కూర్చొని మాట్లాడుకోవాల్సిన అవసరాన్ని చెప్పారు. తెలంగాణ ప్రయోజనాల కోసం దేవాదులను విస్తరిస్తే ఏపీ ప్రభుత్వాలు కాదనలేదని.. గతంలో కాళేశ్వరాన్ని అడ్డుకోలేదని.. ఇలాంటప్పుడు పోలవరం మీద రాజకీయ రగడ అవసరమా? అంటూ ప్రశ్నిస్తున్నారు.

అందుకు భిన్నంగా పోలవరం.. నల్లమల సాగర్ మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నరన్న మాటను పదే పదే చెప్పటం కనిపిస్తుంది. ప్రజాప్రయోజనాల కోసం రాజకీయం చేయాలే తప్పించి రాజకీయాల కోసం రాజకీయం చేయటం సరికాదన్నారు. సముద్రంలో కలిసే జలాల్ని ఎవరైనా వాడుకోవచ్చని.. అలాంటప్పుడు తెలంగాణకు అభ్యంతరం ఎందుకు? అని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు వాదనను విన్న తర్వాత ఒక కీలక ప్రశ్న మదిని పట్టేస్తుంది. విద్వేషంతోనో. రాజకీయ ప్రయోజనాల కోసమో నేతలు.. పాలకులు తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టే చర్యలకు చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో.. తెలుగు ప్రజల ఫ్యూచర్ కోసం కేసీఆర్ ఫాలో అయ్యే భావోద్వేగ విద్వేషాన్ని ఫాలో కావాలా? చంద్రబాబు పెద్దమనిషి తత్త్వాన్ని వంట పట్టించుకోవాలా? అన్నది మరో ప్రశ్న.

తెలుగు రాష్ట్రాలు తమ ప్రజల ప్రయోజనాల కోసం ప్రాజెక్టులను ప్రకటిస్తే.. ఆ వెంటనే నీళ్ల రాజకీయాన్ని తెర మీదకు తెచ్చే కన్నా.. దాని కారణంగా ఎవరికి లాభం.. మరెవరికి నష్టమన్న విషయంపై మదింపు చేసే అంశంపై మేధావులతో కూడిన రాజకీయేతర విభాగాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాదు.. ఒక రాష్ట్రం తీసుకున్న నిర్ణయంతో మరో రాష్ట్రానికి నష్టం వాటిల్లే పరిస్థితే ఉంటే.. ఆ రాష్ట్రానికి మేలు చేసే కౌంటర్ ప్లాన్/ప్రాజెక్టుకు అభ్యంతరాల్ని క్రియేట్ చేయని తీరును ఫాలో కావాల్సి ఉంది. అదే.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రగతికి.. ప్రజల నీళ్ల అవసరాలకు శ్రీరామరక్ష అవుతుంది. అంతేతప్పించి.. సెంటిమెంట్ రాజేసి.. రాజకీయ మంటలతో తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల్ని దెబ్బ తీసే తీరుకు ముగింపు పలకాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పక తప్పదు.

Tags:    

Similar News