తెలుగు రాష్ట్రాల్లో 'మైండ్ గేమ్' పాలిటిక్స్.. !
రెండు తెలుగు రాష్ట్రాల్లో గత వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే.. నేతల తీరు మైండ్ గేమ్ పాలిటిక్స్‌ను తలపిస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు.;
రెండు తెలుగు రాష్ట్రాల్లో గత వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే.. నేతల తీరు మైండ్ గేమ్ పాలిటిక్స్‌ను తలపిస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు. తమపై మరకలు పడకుండా.. చూసుకునే క్రమంలో కీలక నేతలు చేస్తున్న వ్యాఖ్యలు.. తమకు ఎంతో ఇష్టమైన నేతలను ఇరుకున పడేస్తున్నా యి. తాజాగా ఏపీ మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు.. తెలంగాణలో రాజకీయ వివాదానికి దారి తీశాయి.
తనకు గతం నుంచి మిత్రుడిగా ఉన్న కేసీఆర్‌ను ఉద్దేశించి జగన్ చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు అదే కేసీఆర్‌కు ఇబ్బందిని కలిగిస్తున్నాయి. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే.. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు చేపట్టామని.. 80 శాతం పనులు కూడా పూర్తయ్యాయని జగన్ మీడియా ముందు చెప్పారు. కానీ, వాస్తవానికి.. సీమ ఎత్తిపోతలపై ఇప్పటికే కేసీఆర్‌ను అక్కడి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం టార్గెట్ చేసింది. కేసీఆర్ వల్లే.. తెలంగాణకు నష్టం వాటిల్లుతోందని చెబుతున్నారు.
ఇలాంటి సమయంలో కేసీఆర్ ఉన్నప్పుడే.. తాము సీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టామని.. 80 శాతం పనులు కూడా పూర్తయ్యాయని జగన్ చెప్పడంతో కేసీఆర్ ను అడ్డంగా ఇరికించినట్టు అయింది. ప్రస్తుతం ఈ వేడి తెలంగాణలో బీఆర్ఎస్‌కు స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు జోరుగా తగలనుంది. ఇక, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల వేడి ఏపీ సీఎం చంద్రబాబుకు తగిలింది. నిజానికి వీరిద్దరూ గురు శిష్యులు అనే విషయం తెలిసిందే.
కానీ, చంద్రబాబుపై రెండేళ్ల పాటు తానే ఒత్తిడి తెచ్చి.. సీమ ప్రాజెక్టును ఆపేయించానని అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ప్రకటించారు. తన ఒత్తిడి కారణంగానే చంద్రబాబు సీమ ప్రాజెక్టును ఆపేశారని చెప్పుకొచ్చారు. ఇది ఏపీలో చంద్రబాబుకు సెగ తగిలేలా చేసింది. వైసీపీ నేతలు.. ఈ వ్యాఖ్యలను వాడేసుకున్నారు. సో.. మొత్తంగా ఇటు జగన్.. తనను తాను హైలెట్ చేసుకునేందుకు.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనను తాను హైలెట్ చేసుకునేందుకు చేసిన వ్యాఖ్యలు.. కేసీఆర్, చంద్రబాబుకు ఇబ్బందిగా మారాయన్నది పరిశీలకులు చెబుతున్న మాట.