2029 కోసం పక్కా ప్లాన్?: వివేకా, షర్మిల ఇష్యూలతోనే రాజకీయం!

టార్గెట్ 2029 అన్నట్లే ఏపీ రాజకీయాలు సాగుతున్నాయి. 2029లో ఖచ్చితంగా అధికారంలోకి రావాలని విపక్ష నేత జగన్మోహనరెడ్డి టార్గెట్ పెట్టుకున్నారు.;

Update: 2026-03-21 18:30 GMT

టార్గెట్ 2029 అన్నట్లే ఏపీ రాజకీయాలు సాగుతున్నాయి. 2029లో ఖచ్చితంగా అధికారంలోకి రావాలని విపక్ష నేత జగన్మోహనరెడ్డి టార్గెట్ పెట్టుకున్నారు. ఇదే సమయంలో 2029లో వరుసగా రెండోసారి గెలవడంతోపాటు ఏకంగా 15 ఏళ్లు కూటమి మాత్రమే పాలించాలని ప్రభుత్వ పెద్దలు కోరుకుంటున్నారు. దీంతో ఎన్నికలకు ఇంకా చాలా సమయమే ఉన్నప్పటికీ 2024 అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మరుక్షణం నుంచే 2029 దిశగా పావులు కదపడం మొదలైందని అంటున్నారు.

ప్రధానంగా మాజీ సీఎం జగన్మోహనరెడ్డి 2029 ఎన్నికల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐదేళ్ల సమయం పెద్ద భారమేమీ కాదని తన పార్టీ నేతలు, కార్యకర్తలను ఊరడించేందుకు కళ్లుమూసుకుని తెరిచేలోగా కాలం కరిగిపోతుంటుందని ఆయన చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో కూటమి పెద్దలు సైతం టార్గెట్ - 2029 దిశగా వ్యూహాలు ముమ్మరం చేశారని అంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డిని రాజకీయంగా దెబ్బతీసేందుకు రెండు అస్త్రాలకు ఎప్పటికప్పుడు పదును పెడుతున్నట్లు రాజకీయ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.

సహజంగా అధికార పార్టీ ఎప్పుడూ అభివృద్ధి, సంక్షేమం అన్న అజెండాతోనే ఎన్నికలకు వెళుతుంది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు జగన్ రెడ్డి తన హయాంలో రూ.2.70 కోట్ల సంక్షేమం అమలు చేశామని గొప్పగా చాటుకున్నారు. అయితే ఆయన వాదనను ఓటర్లు వినలేదని ఎన్నికల ఫలితాల్లో తేలిపోయిందని అంటున్నారు. దీంతో కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమంతోపాటు ఇతర రాజకీయ వ్యూహాలను అమలు చేస్తోందని అంటున్నారు. ముఖ్యంగా జగన్ రెడ్డి బయట మాట్లాడలేని పరిస్థితి తీసుకువచ్చే ఎత్తుగడను కూటమి పెద్దలు అనుసరిస్తున్నారని పరిశీలకులు సందేహిస్తున్నారు.

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుతోపాటు మాజీ సీఎం జగన్ కుటుంబానికి చెందిన ఆస్తుల వివాదాన్ని తరచూ ప్రచారంలోకి తీసుకురావడం ద్వారా జగన్ రెడ్డిని రాజకీయంగా ఒత్తిడికి గురిచేయాలన్న ఏకైక వ్యూహంతో కూటమి పెద్దలు పావులు కదుపుతున్నట్లు వ్యాఖ్యానిస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, అంతకు ముందు కూడా ఈ రెండు వివాదాలు వైసీపీని ఆత్మరక్షణలోకి నెట్టాయని అంటున్నారు. దీనిపై జగన్ రెడ్డి కూడా బహిరంగంగా మాట్లాడేందుకు తటపటాయిస్తుండటంతో కూటమి పార్టీల నేతలు అడ్వాంటేజ్ తీసుకుంటున్నట్లు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇదే సమయంలో జగన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బతీసేందుకు ఆయన ఇద్దరు చెల్లెళ్లు కూటమి పార్టీలకు సహకరిస్తున్నారా? అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసును ప్రజలు మరచిపోకుండా ఎప్పుడూ హాట్ టాపిక్ గా ఉండాలని కూటమి నేతలు భావిస్తున్నారని అంటున్నారు. దీనికి తగ్గట్టే వివేకా కుమార్తె సునీత కోర్టుల్లో వరుస పిటిషన్లు వేస్తూ నిత్యం వార్తలు ప్రచారం ఉండేలా సహకరిస్తున్నారని చెబుతున్నారు. అదేవిధంగా షర్మిలతో ఉన్న ఆస్తుల వివాదం కూడా జగన్ ను ఇబ్బంది పెడుతోందని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ రెండు సమస్యలను జగన్ పరిష్కరించుకునే వరకు కూటమి నేతలు ఈ వివాదాలను రాజేసే ప్రయత్నం చేస్తూనే ఉంటారని అంటున్నారు. దీంతో 2029 ఎన్నికల్లో కూడా వివేకా హత్య, షర్మిలతో ఆస్తుల వివాదం ప్రధాన అంశాలు అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

Tags:    

Similar News