అమరావతికి రాజముద్రతో బిగ్ ఇష్యూ క్లోజ్

అదే సమయంలో అమరావతి ఏపీకి రాజధానిగా ఉండాలని ముక్తకంఠంతో మూకుమ్మడిగా మూడు ప్రాంతాల ప్రజలు ఓటేసి మరీ టీడీపీ కూటమిని గెలిపించారు.;

Update: 2026-01-27 03:47 GMT

ఏపీని 2014లో రాజధాని లేని పరిస్థితిలో విభజించారు. ఒక విధంగా అదే అతి పెద్ద సెంటిమెంట్ గా మారింది. 2014 ఎన్నికలకు ముందు అదే కీలకమైన అంశంగా పనిచేసింది. బీజేపీతో టీడీపీకి పొత్తు కుదరడంతో పాటు సీనియర్ అప్పటికి రెండు సార్లు ఉమ్మడి ఏపీకి సీఎం గా పనిచేసిన చంద్రబాబు వల్లనే కొత్త రాజధాని సాధ్యపడుతుంది అని జనాలు భావించి టీడీపీ బీజేపీని గెలిపించారు. అలా వైసీపీ వెనక్కి నెట్టబడింది. పైగా టీడీపీ బీజేపీ జనసేన బంధం బలంగా ఉంది. ఆ మూడు పార్టీలు ఎన్నికల్లో చెప్పిన మాట బ్రహ్మాండమైన రాజధానిని నిర్మిస్తామని. దాంతో కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీ వల్ల అది సులువుగా జరుగుతుందని జనాలు భావించి విలక్షణమైన తీర్పు చెప్పారు. దాంతో మోడీ ప్రధానిగా బాబు సీఎం గా అయ్యారు. అలా 2014 ఎన్నికలో టీడీపీ విజయానికి రాజధాని ఇష్యూ కీలకంగా మారింది.

అదే అంశంతో :

ఇక 2019 ఎన్నికల్లో కూడా అదే అంశం మీదనే ఎన్నికలు జరిగాయని చెప్పాలి. అమరావతి రాజధాని పేరుతో అభివృద్ది కేంద్రీకృతం అవుతోంది అన్న వైసీపీ విమర్శలు ప్రచారం ఒక వైపు ఉంటే అమరావతిలో అనుకున్న స్థాయిలో అభివృద్ధి జరగలేదని అక్కడి వారు టీడీపీ మీద వ్యతిరేకత పెంచుకున్న వైనం ఉంది. అలా అన్నీ కలసి వచ్చి వైసీపీ బంపర్ మెజారిటీతో ఎన్నికల్లో గెలిచింది. అయితే ఈ ప్రజా తీర్పుని జగన్ అండ్ కో వేరే విధంగా అర్ధం చేసుకున్నారు. అమరావతి రాజధాని వద్దు అని మూడు రాజధానులు అన్నట్లుగా వైసీపీ సరికొత్త నినాదాన్ని అందుకుంది. అయితే అయిదేళ్లలో ఏమీ చేయలేకపోయింది. చివరికి 2024 ఎన్నికలలో మూడు రాజధానులు బూమరాంగ్ అయి వైసీపీ కేవలం 11 సీట్లకే చతికిలపడిపోయింది.

కూటమిని గెలిపించారు :

అదే సమయంలో అమరావతి ఏపీకి రాజధానిగా ఉండాలని ముక్తకంఠంతో మూకుమ్మడిగా మూడు ప్రాంతాల ప్రజలు ఓటేసి మరీ టీడీపీ కూటమిని గెలిపించారు. కనీ వినీ ఎరగని తీరులో టీడీపీ కూటమి భారీ విక్టరీ కొట్టడానికి అమరావతి రాజధాని సెంటిమెంట్ బ్రహ్మాస్త్రంగా పనిచేసింది అని చెప్పాల్సి ఉంది. అలా అమరావతి రాజధాని అన్నది గత మూడు ఎన్నికలలో ఏపీ ప్రజలను వారి తీర్పుని విశేషంగా ప్రభావితం చేతోంది. కానీ ఈసారి అలా జరిగే సీన్ అయితే లేదని అంటున్నారు.

చట్టబద్ధత ఖాయం :

ఈ నెల 28 నుంచి మొదలయ్యే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలోనే అమరావతి రాజధానికి సంబంధించి చట్టబద్ధత కల్పించే విధంగా బిల్లు ప్రవేశపెట్టి ఆమోదిస్తారు అని అంటున్నారు. దాంతో ఇక మీదట అమరావతి ఏపీకి శాశ్వత రాజధాని అవుతుంది. అభివృద్ధి ప్రక్రియ అన్నది అక్కడ నిరంతరాయంగా సాగుతూ ఉంటుంది. దాంతో 2029 ఎన్నికలలో అమరావతి రాజధాని సెంటిమెంట్ అన్నది ఎక్కడా బిగ్ ఇష్యూగా మారే సీన్ లేదని అంటున్నారు. వైసీపీ సైతం అమరావతి ఊసు కానీ మాట కానీ మాట్లాడే సాహసం చేయకపోవచ్చు అని అంటున్నారు. అదే విధంగా టీడీపీ కూడా జగన్ వస్తే అమరావతిని మార్చేస్తారు అన్న విమర్శలు చేసేందుకు కూడా ఆస్కారం ఏ విధంగానూ ఉండదు. దాంతో గత పదిహేనేళ్ళుగా ఎన్నికలను ప్రభావితం చేస్తూ వచ్చిన అమరావతి రాజధాని ఇష్యూ క్లోజ్ అయినట్లే అని అంటున్నారు.

Tags:    

Similar News