ఛార్జ్ తీసుకున్న గంటకే ఏసీపీ బదిలీ.. ఇదేం విడ్డూరం?
తాజాగా అలాంటి సీన్ విశాఖలో రిపీట్ అయ్యింది. బదిలీ మీద వచ్చి.. విధుల్లో చేరిన గంటకే మళ్లీ వచ్చిన స్థానానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ కావటం హాట్ టాపిక్ గా మారింది.;
గతానికి భిన్నమైన పరిణామాలు ఈసారి చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కూటమి ప్రభుత్వంలో చోటు చేసుకుంటున్నాయి. జగన్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించి.. తెలుగుదేశం పార్టీ నేతల్ని ఇబ్బంది పెట్టిన కొందరు అధికారులకు కూటమి ప్రభుత్వం కీలక పదవులు లభించటం.. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావటంతో దిద్దుబాటు చర్యలు చేపట్టటం తెలిసిందే.
సుదీర్ఘ పాలనా అనుభవం ఉన్న చంద్రబాబు ప్రభుత్వంలో అధికారుల బదిలీలు.. పోస్టింగుల వ్యవహారం ఎప్పటికప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. ఇలాంటి పరిస్థితులు ఎందుకు ఏర్పడుతున్నాయి? దీనికి బాధ్యులు ఎవరన్న దానిపై రివ్యూ కానీ.. చర్యలు కానీ ఇప్పటివరకు చోటు చేసుకున్నది లేదు.
తాజాగా అలాంటి సీన్ విశాఖలో రిపీట్ అయ్యింది. బదిలీ మీద వచ్చి.. విధుల్లో చేరిన గంటకే మళ్లీ వచ్చిన స్థానానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ కావటం హాట్ టాపిక్ గా మారింది. శ్రీకాకుళం డీఎస్పీగా పని చేస్తునన సీహెచ్ వివేకానందను అక్కడి నుంచి విశాఖపట్నం హార్బర్ జోన్ ఏసీపీగా బదిలీ చేశారు. ఫిబ్రవరి 11న దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో ఆయన శ్రీకాకుళం నుంచి విశాఖకు వచ్చారు. విశాఖపట్నం హార్బర్ జోన్ ఏసీపీగా విధుల్లో చేరారు. బాధ్యతల స్వీకరణ అనంతరం తన జోన్ పరిధిలోని నలుగురు ఎస్ హెచ్ వోలు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. అందరూ సమన్వయంతో పని చేయాలంటూ చెబుతున్న సమయంలోనే ఆయన తిరిగి తాను వచ్చిన స్థానానికే వెళ్లి.. రిపోర్టు చేయాలంటూ కొత్త బదిలీ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో.. విధుల్లో చేరిన గంటలోనే ఆయన మళ్లీ శ్రీకాకుళం డీఎస్పీగా బదిలీ కావటంచర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో విశాఖ హార్బర్ జోన్ ఏసీపీగా నగర స్పెషల్ బ్రాంచ్ లో పని చేస్తున్న చిట్టిబాబును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇలా.. బదిలీ మీద వచ్చి విధుల్లో చేరిన గంటలోనే తిరిగి బదిలీ చేసిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.